కర్నూలులో యురేనియం వివాదం.. అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు..

గ్రామస్తుల నిరసనలతో కర్నూలు-బళ్లారి రహదారిపై వాహనాలు భారీగా నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కర్నూలులో యురేనియం వివాదం.. అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు..

Updated On : November 4, 2024 / 5:58 PM IST

Kurnool Uranium Mining Row : కర్నూలు జిల్లాలో యురేనియంపై రచ్చ కొనసాగుతోంది. ఇవాళ యురేనియంపై గ్రామస్తులతో చర్చించేందుకు వస్తున్న అధికారులను దేవనకొండ మండలం ఈదుల దేవరబండ గ్రామం దగ్గర గ్రామస్తులు అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. గ్రామస్తుల నిరసనలతో కర్నూలు-బళ్లారి రహదారిపై వాహనాలు భారీగా నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కర్నూలు జిల్లాలో యురేనియం వ్యవహారం దుమారం రేపుతోంది. రోజురోజుకి యురేనియంకి వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. ఇవాళ ఉదయం నుంచి దేవనకొండ, కపట్రాళ్ల ప్రాంతాల్లో రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. యురేనియం తవ్వకాలను కచ్చితంగా అడ్డుకుంటామని, యురేనియం తవ్వకాలను ప్రారంభిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. దేవనకొండ మండలం నల్లచెలిమల, కపట్రాళ్ల తదితర ప్రాంతాల్లో దాదాపు 500 హెక్టార్లలో విస్తరించిన అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టేందుకు కేంద్రం నిర్ణయించింది.

దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకుని ఆ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాల వల్ల తమ పంట పొలాలు ధ్వంసం అవుతాయని, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో యురేనియం తవ్వకాలను తీవ్రంగా అడ్డుకుంటామని అంటున్నారు. ఎంతకైనా తెగిస్తామని మహిళలు, యువత, వృద్ధులు హెచ్చరిస్తున్నారు.

అంతా ఏకతాటిపైకి వచ్చారు. కపట్రాళ్ల, నల్లచెలిమల, దేవనకొండ తదితర మండలాలు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నవి. గ్రామస్తుల మధ్య కక్షలు ఉన్నాయి. అయినప్పటికీ యురేనియం తవ్వకాల విషయంలో వాటన్నింటిని పక్కన పెట్టి అంతా ఏకతాటి పైకి వచ్చారు. ఉద్యమంలో పాల్గొంటున్నారు. యురేనియం తవ్వకాలు చేపడితే కనుక ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు.