ఏపీలో కేటీఆర్ ఫొటోలు.. పాలాభిషేకం చేసిన జనాలు

Vizag Steel Plant Workers Thanks telangana Minister ktr: ఏపీలోని విశాఖలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫొటోలు కనిపించాయి. అంతేకాదు, కేటీఆర్ ఫొటోలకు పాలాభిషేకం చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలిపినందుకుగాను స్టీల్ ప్లాంట్ కార్మికులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ విధంగా కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పెద్దఎత్తున పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలు సైతం వీరి ఉద్యమానికి అండగా నిలిచాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అవసరమైతే తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమతితో విశాఖకు వెళ్తానని, ఉద్యమకారులను కలిసి పోరాటానికి మద్దతిస్తామని కేటీఆర్ చెప్పారు.
దీంతో కేటీఆర్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు. కేటీఆర్ చిత్రపటాలకు స్టీల్ ప్లాంట్ కార్మికులు, స్థానికులు పాలాభిషేకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కలిసి పోరాడి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చర్యలను అడ్డుకుంటామని కార్మికులు చెప్పారు. తెలుగు ప్రజల ఐక్యత వర్ధిల్లాలంటూ నినదించారు.
మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీకి కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేంత వరకు సమ్మె చేస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి.