చెప్పిన ప్రతి పని చేస్తాం..ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం – పవన్

అవినీతికి జనసేన వ్యతిరేకం… ధన రాజకీయాలను అస్సలుకే సహించమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చెప్పిన ప్రతీపని చేస్తాం… ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్న హామీతో స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలతో వరుస సమావేశాల్లో పాల్గొన్న ఆయన… రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2020, ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం నాయకులు, కార్యకర్తతో బిజీబిజీగా గడిపారు పవన్.
సేవ చేయడానికే తప్పా మరో ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేన చీఫ్ పనవ్ కల్యాణ్. సినిమాలకి రిటైర్‌మెంట్ ఇచ్చాక రాజకీయాల్లోకి రాలేదని ఆదర్శ రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతోనే వచ్చానన్నారు. దేశం విచ్చిన్నమవుతుంటే చూడలేకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. చెప్పిన ప్రతీపని చేస్తాం… ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని.. ప్రజలకి మాటిచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు పవన్.. పెట్టుబడి పెట్టి గెలిస్తే ఆ డబ్బులు వచ్చేదాకా అవినీతికి పాల్పడతారని అందుకే… డబ్బులు పెట్టకుండా ఎన్నికల్లో నిలబడతామని తెలిపారు.
ఓటు ఎందుకు వేస్తున్నామన్న స్పష్టత జనాల్లో లేదన్నారు పవన్. డబ్బు ప్రభావంతో నడుస్తున్న రాజకీయాలను తరిమికొట్టాలన్నారు. సినిమా షూటింగ్‌లో ఉన్నా ప్రజాసమస్యల గురించే ఆలోచిస్తానన్నారు. సినిమాలు సమాజం పట్ల బాధ్యతను పెంచాయన్నారు. జగన్‌కి ఉన్నట్లు నాకు మైన్స్‌గానీ, బిజినెస్‌లు గానీ లేవన్న ఆయన…. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలు చేస్తానన్నారు. ధన రాజకీయాలకు జనసేన దూరమన్నారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసే నేతలు ప్రజా సమస్యలు పరిష్కరించలేరన్నారు. వైసీపీ నేతలు ఇప్పుడు అదే చేస్తున్నారని మండిపడ్డారు.
ఆదర్శవంతమైన రాజకీయాలు చేయడమే జనసేన లక్ష్యమన్నారు. అవినీతిని సహించేదే లేదన్నారు పవన్ మరోసారి స్పష్టం చేశారు. డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయకూడదన్న ఆదర్శంతోనే ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు కోసం ఓట్లు అమ్ముకుంటే అవినీతిని ప్రశ్నించే నైతిక హక్కు ఉండదన్నారు పవన్ కల్యాణ్. మొత్తంగా… స్థానిక ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టిన పవన్. దానికి అనుగుణంగా సమావేశాలు నిర్వహిస్తూ… కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
Read More : ఐటీ దాడులు 2 వేల కోట్లా…? 2.36 లక్షలా…? బాబు నోరు విప్పడం లేదు ఎందుకు