అజ్ఞాతవాసిగా ఆ మాజీ ఎమ్మెల్యే.. కేసుల భయమేనా?
అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రకాశ్ రెడ్డి కోసం పోలీసులు విస్త్రతంగా గాలిస్తున్నారు.

ఆ మాజీ ఎమ్మెల్యే ఆచూకీ ఎక్కడ? ఒకటి కాదు రెండు ఏకంగా 20రోజులకు పైగా ఆయన కనిపించడంలేదు. కేసుల భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? లేక బెయిల్ కోసం ఇంటర్నల్ గా ప్రయత్నాలు చేస్తున్నారా? వైసీపీ అధినేత జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ దెబ్బతినడానికి ఆయనకు ఏంటి సంబంధం? ఆయనపై ఎందుకు కేసులు వచ్చి పడ్డాయి? నిన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నా..కాలర్ ఎగరేసి తిరిగిన ఆ మాజీ ఎమ్మెల్యేకు ఎందుకీ కష్టాలు? అసలు పోలీసులు ఆయన వెంట ఎందుకు పడుతున్నారు? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే?
టైం బాగుంటే ఏది చేసినా నడుస్తుంది..అదే టైం బ్యాడ్ అయితే..దారిన పోయే తీగ కూడా ఉరిలా తగులుకుంటుంది. ప్రస్తుతం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి విషయంలో అదే జరుగుతోందన్న టాక్ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. ఎందుకంటే రాప్తాడు పాలిటిక్స్ రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. అక్కడ జరిగిన రామగిరి ఎంపీపీ ఎన్నిక విషయంలో మొదలైన గొడవలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు వైసీపీకి పెద్ద తలనొప్పినే తీసుకొచ్చాయి.
ఇటీవల ఖాళీగా ఉన్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలకు ఇటీవల ఎన్నిక నిర్వహించారు. అన్ని చోట్ల వైసిపి బలం ఉండటంతో..ఆపార్టీ అభ్యర్థుల్నే అక్కడ ఎంపీపీగా ఎన్నుకున్నారు. కానీ రామగిరిలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇక్కడ మొత్తం పది ఎంపీటీసీలు ఉండగా ఒకరు టీడీపీకాగా..మిగిలిన 9 మంది వైసీపీవారే.
చివరకు ఎంపీపీ ఎన్నిక రోజు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తన ఎంపీటీసీలను క్యాంపుకు తీసుకెళ్లి తిరిగి వారిని ఎంపీడీవో కార్యాలయం తీసుకొస్తున్న తరుణంలో జరిగిన పరిణామాలు ఉద్రిక్త పరిస్థితులను దారితీశాయి. పెనుకొండ తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రకాష్ రెడ్డి చేసిన హంగామా అంతా కాదు. టీడీపీ శ్రేణులపై ఆయన దూకుడు..కవ్వింపు చర్యలకు సంబంధించిన వీడియోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హైలైట్ అయ్యాయి.
హెలికాప్టర్ దెబ్బతిన్న ఘటనపై కేసు
ఎంపీపీ ఎన్నికల్లో ప్రకాశ్ రెడ్డి చేసిన హంగామా అలా ఉంటే… మరోవైపు అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా హెలికాప్టర్ దెబ్బతిన్న ఘటన ఆయన మెడకు ఉచ్చు బిగిసేలా తయారైంది. హెలికాప్టర్ దెబ్బతిన్న ఘటనపై కేసు నమోదు చేసిన ఏపీ ప్రభుత్వం విచారణ చేపట్టింది.
జనం హెలికాప్టర్ వైపు దూసుకెళ్లేలా ప్రకాశ్ రెడ్డి రెచ్చగొట్టారని, ఓ కానిస్టేబుల్ కి గాయాలు కావడంతో అతనిచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాశ్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. దీంతో అప్పటివరకు అందరికీ అందుబాటులో ఉన్న ప్రకాశ్ రెడ్డి..ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనపై బలమైన సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో అరెస్టు తప్పదన్న భయంతోనే వెళ్లిపోయారంటూ అంతా టాక్ విన్పిస్తోంది. గత 20 రోజులుగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది.
అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రకాశ్ రెడ్డి కోసం పోలీసులు విస్త్రతంగా గాలిస్తున్నారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ప్రకాష్ రెడ్డికి చుక్కెదురే అయింది. ఈ కేసులో మొత్తం ఐదుగురికి బెయిల్ రాగా ప్రకాష్ రెడ్డికి మాత్రం ముందస్తు బెయిల్ రాలేదు. మొత్తంమీద మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మెడకు కేసుల ఉచ్చు బిగుస్తోంది. పాత కేసుల భయంతోనే ప్రకాశ్ పరారీలో ఉన్నారన్న టాక్ విన్పిస్తోంది. అయితే ఆయన అరెస్ట్ ఖాయమని పోలీసుల వర్గాల నుంచి విన్పిస్తున్న మాట.