రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా, అంతుబట్టని జగన్ అంతరంగం. తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు..?

రాజ్య సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం మొదలయ్యింది. ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలకే సీట్లు దక్కనుండడంతో.. ఎంపీలయ్యే ఛాన్స్ కోసం పార్టీ అధినేతల చుట్టూ జోరుగా ప్రదిక్షణాలు చేస్తున్నారు ఆశావహులు. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. 2020, మార్చి 13 వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. 16న నామినేషన్లను పరిశీలిస్తారు. 18వ తేదీ మధ్యాహ్నం 3గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. సీట్లకన్నా నామినేషన్లు ఎక్కువగా ఉంటే.. ఈ నెల 26న ఎన్నికలు నిర్వహిస్తారు.
ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టి.సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్, తోట సీతారామలక్ష్మి, కె.కేశవరావు పదవీకాలం ముగిస్తుండండతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ అసెంబ్లీలో 151 సభ్యుల బలం వైసీపీకి ఉండడంతో నాలుగు స్థానాలూ అధికారపార్టీ పరం కానున్నాయి. శాసనమండలి రద్దుతో.. మంత్రి పదవులను కోల్పోతున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లకు రాజ్యసభ సీట్లు ఇచ్చేందుకు సీఎం జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మిగిలిన రెండు సీట్లకు పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. ఓసీటు ఇవ్వాలంటూ ఇప్పటికే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీతో కలిసి వచ్చి పరిమళ్ నత్వాని .. జగన్‌కు విజ్ఞప్తి చేశారు. మిగిలిన ఒక్క సీటు కోసం జగన్ చిన్నాన్న, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డి పోటీపడుతున్నారు. అయోధ్య రామిరెడ్డికే అవకాశం దక్కొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇక తెలంగాణలో ఉన్న రెండు సీట్లనూ అధికార పార్టీ టీఆర్‌ఎస్ దక్కించుకోనుంది. ఎంపీలుగా గరికపాటి, కేవీపీలు పదవీ విరమణ చేస్తుండడంతో, ఆ రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కేకే కు మరో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఈ రెండు సీట్లనూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పారిశ్రామిక వేత్త పార్థసారథి రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
రెండు సీట్లనూ అగ్రవర్ణాలకే ఇచ్చే అవకాశం లేదంటూ పార్టీలో చర్చ సాగుతోంది. ఒక స్థానం ఇద్దరిలో ఒకరికి ఇచ్చినా.. మరో స్థానాన్ని ఎస్సీ లేదా ఎస్టీలకు ఇచ్చే అవకాశాలున్నాయి. TSIIC చైర్మన్ బాలమల్లు, కడియం శ్రీహరి, మంద జగన్నాథం, సీతారాం నాయక్, జి. నగేష్ పేర్లను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Read More :రాత్రి 7 గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం