DGP not responding to Kotam Reddy's phone tap allegations_ Pawan Kalyan
Janasena Pawan kalyan : నా ఫోన్ ట్యాప్ చేశారు అంటూ నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలపై డీజీపీ ఎందుకు స్పందించటంలేదు? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇవి కేవలం ఆరోపణలే అయితే కాదు ఎందుకు నిరూపించే చర్యలు తీసుకోవటంలేదు? అని ప్రశ్నించారు. కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాప్ ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తనకు ప్రాణహాని ఉందని సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే వాపోతున్నా ప్రభుత్వం స్పందించటంలేదని పైగా ఆ ఎమ్మెల్యే సొంతపార్టీవారే అయినా వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టంలేదని ఇలా అయితే ఏపీలో ఎమ్మెల్యేలు స్వేచ్చగా మాట్లాడుకునే పరిస్థితి ఉండదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆనం భద్రత గురించి డీజీపీ రక్షణ బాద్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనం రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోకపోతే ఏపీలో ఉన్న ఈ పరిస్థితిపై కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఏపీలో రాజకీయాలు ప్రతీకారాలకు పరాకాష్టకు చేరాయని..సాక్షాత్తు శాసనసభ సభ్యులే ప్రాణహానితో భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. ఎమ్మెల్యే ఆనం తన అభిప్రాయాలను వెల్లడించటం వల్లే ఆయనకున్న సెక్యూరిటీని తగ్గించారని విమర్శించారు పవన్. తన నియోజకవర్గం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం సమస్యల్ని పరిష్కరించమని అడగటం తప్పెలా అవుతుందని ఎమ్మెల్యేగా తనకున్న బాధ్యతను నెరవేర్చాలని కోరటం తప్పెలా అవుతుంది? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. ఇటువంటి ప్రతీకార రాజకీయాలు సమాజానికి చోటు చేస్తాయని అన్నారు.