Sajjala Ramakrishna Reddy: కేసులన్నీ సజ్జల వైపే.. కొత్త ఇబ్బందులు తప్పవా? వైసీపీ వర్గాలను టెన్షన్ పెడుతోంది ఏంటి?

కస్టడీలో పోసాని చెప్పిన వివరాలు మినహా.. ఈ నేరంలో తమ పాత్ర ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ కోర్టులో పిటిషన్ వేశారు.

Sajjala Ramakrishna Reddy: కేసులన్నీ సజ్జల వైపే.. కొత్త ఇబ్బందులు తప్పవా? వైసీపీ వర్గాలను టెన్షన్ పెడుతోంది ఏంటి?

Sajjala Ramakrishna Reddy

Updated On : March 3, 2025 / 7:39 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. అరెస్ట్ ఏదైనా.. అటు తిరిగి ఇటు తిరిగి.. అది సజ్జల ఫ్యామిలీ దగ్గరకే చేరుతోంది. పోసాని వాంగ్మూలంతో.. ఇప్పుడు వైసీపీలో కొత్త అలజడి కనిపిస్తోంది. ఆయన చెప్తేనే చేశాను అంటూ.. అంతా సజ్జలే చేశారంటూ పోసాని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఓ వైపు అవినీతి విచారణలు.. మరోవైపు కొందరి విచారణలో వెలుగుచూస్తున్న నిజాలు.. అన్నీ కలిసి సజ్జల ఫ్యామిలీని చుట్టేస్తున్నాయా.. మరి ఇప్పుడేం జరగబోతోంది.. సజ్జలకు రాబోయే రోజుల్లో కొత్త ఇబ్బందులు తప్పవా..

వరుస అరెస్ట్‌లతో ఏపీ రాజకీయం హాట్‌హాట్‌గా మారుతోంది. మొన్న వంశీ.. నిన్న పోసాని.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన నేతలంతా.. ఒక్కొక్కరుగా జైళ్ల బాట పడుతున్నారు. ఈ ఇద్దరితో పాటు.. చాలామంది నేతలపై కేసులు నమోదయ్యాయ్‌. వీళ్లందరు ఇస్తున్న సమాచారంతో మరికొందరిపైనా కేసులు నమోదు అవుతున్నాయ్.

తాము పాత్రధారులం మాత్రమేనని.. సూత్రధారులు వేరే ఉన్నారంటూ.. అరెస్ట్ అయిన వాళ్లలో చాలామంది విచారణలో చెప్పుకొచ్చారు. అరెస్ట్ ఏదైనా.. ఆ వ్యవహారం అటు తిరిగి సజ్జల దగ్గరకు వచ్చి చేరుతోంది. పవన్‌పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో అరెస్ట్ అయిన పోసాని.. ఇప్పుడు సజ్జలను ఇరికించారు. తాను చేసింది తప్పేనని ఒప్పుకున్న పోసాని.. తనను అలా మాట్లాడమని చెప్పింది సజ్జలే అని..ఆయన స్క్రిప్టు పంపిస్తే తాను చదివానని చెప్పారు.

సజ్జలపై కేసు నమోదుకు రంగం సిద్ధం?
సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్‌ను తాను చదివితే.. ఆ వీడియోలను సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ పోసాని చెప్పుకొచ్చారు. దీంతో సజ్జలపై కేసు నమోదుకు రంగం సిద్ధం అయిందని తెలుస్తోంది. విచారణలో పోసాని తన పేరు చెప్పారని భావించిన సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి.. హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఇద్దరి పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది.

పోసాని స్టేట్‌మెంట్‌తో.. ఇద్దరి అరెస్ట్ తప్పదనే ప్రచారం కూటమి శ్రేణుల్లో వినిపిస్తోంది. ఈ కేసు మాత్రమే కాదు.. చాలా వ్యవహారాల్లో సజ్జలతో పాటు ఆయన కుమారుడు భార్గవరెడ్డి పేర్లు బయటకు వినిపించాయ్. కేసు ఏదైనా.. అది చివరికి వచ్చి ఆగేది సజ్జల దగ్గరే అన్నట్లు సీన్ కనిపిస్తోంది. ఒకదాని తర్వాత ఒక కేసు తెరమీదకు వస్తుండడంతో.. రాబోయే రోజుల్లో ఆయనకు ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది.

కూటమి అధికారంలోకి వచ్చాక.. సజ్జల రామకృష్ణారెడ్డి, అతన కుమారుడు భార్గవ్‌రెడ్డి మీద దృష్టి సారించింది. దీనిలోభాగంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు తెరపైకి వచ్చింది. ఈ దాడి వెనుక సజ్జల ప్రమేయం ఉందని ఆయనపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చారు. ఇతర దేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఇది అప్పట్లో సంచలం రేపింది.

ఇక కాదంబరి జెత్వానీ కేసులోనూ.. సజ్జల గైడెన్స్ వల్లే తాము అలా చేశామని విచారణలో నిందితులు చెప్పారు. దీంతో ఆ కేసులోనూ సజ్జలను నిందితుల జాబితాలో ఉన్నారు. అంతకుముందు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై వర్ర రవీందర్ రెడ్డి కూడా సజ్జల పేరు బయటపెట్టారు. ఈ కేసుల్లో ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు సజ్జల. ఇలా మెజారిటీ కేసుల్లో వేళ్లన్నీ సజ్జల వైపే చూపిస్తున్నాయ్.

పోసాని వాంగ్మూలం తెరపైకి..
అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. సజ్జల ఫ్యామిలీ భూములు కబ్జా చేసిందనే ఆరోపణలు కూడా వినిపించాయ్‌. 55 ఎకరాల అటవీభూమి సజ్జల కుటుంబసభ్యుల ఆక్రమణలో ఉందని తెరపైకి తెచ్చిన సర్కార్‌.. భూముల మీద సర్వే కూడా నిర్వహించింది. ఇప్పుడు పోసాని వాంగ్మూలం తెరపైకి వచ్చింది. దీంతో ఏ క్షణం ఏదైనా జరగొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులోకి తమను అవసరంగా లాగుతున్నారని.. కస్టడీలో పోసాని చెప్పిన వివరాలు మినహా.. ఈ నేరంలో తమ పాత్ర ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ కోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

గుంటూరు జిల్లాలో.. పులివెందులలో శాశ్వత నివాసాలు ఉన్నాయని.. తప్పించుకునే ప్రశ్నే లేదని వివరించారు. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ఎదుట హాజరవుతామని కోర్టుకు విన్నవించుకున్నారు. కోర్టు నిర్ణయం ఏంటన్న సంగతి ఎలా ఉన్నా.. సజ్జలకు రాబోయే రోజుల్లో చుక్కలు కనిపించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.