ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలాంటి మోసాలు చేయగలరు.. ఇంతటి నటనా కౌశల్యం ఆయనకే సొంతం: జగన్

విద్యాదీవెన, వసతి దీవెనల కింద గతంలో విద్యార్థులకు ఇచ్చే తోడ్పాటు ఇప్పుడు లభిస్తోందా? అని జగన్ ప్రశ్నించారు.

ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలాంటి మోసాలు చేయగలరు.. ఇంతటి నటనా కౌశల్యం ఆయనకే సొంతం: జగన్

YS JaganMohan Reddy

Updated On : December 8, 2024 / 7:22 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై జగన్ స్పందించారు.

“సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్‌ కమిటీ సమావేశాల పేరు మార్చి, ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా, వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్రబాబుగారి కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్‌ చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.

వైయస్సార్‌సీపీ హయాంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను, విద్యారంగాన్ని ఒకవైపు నాశనం చేస్తూ, అమ్మకు వందనం పేరిట తల్లిదండ్రులకు సున్నం రాసి, వారిని దగాచేసి, మళ్లీ ఇప్పుడు రొటీన్‌గా జరిగే పేరెంట్స్‌ సమావేశాలపై పబ్లిసిటీ చేయించుకోవడం, ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబుగారు మాత్రమే ఇలాంటి మోసాలు చేయగలరు. ఇంతటి నటనా కౌశల్యం చంద్రబాబుకే సొంతం.

టీచర్లు- విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్తేమీ కాదు. క్రమం తప్పకుండా గతంలోనుంచీ జరుగుతున్నవే. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ విద్యారంగానికి పూర్తి జవసత్వాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రతి విప్లవాత్మక మార్పులోనూ, అమలు చేసిన ప్రతి సంస్కరణలోనూ పిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు, వారి భాగస్వామ్యాన్ని తీసుకున్నాం. 15,715 పాఠశాల్లో మొదటి విడత, 22,344 పాఠశాలల్లో మలివిడత నాడు-నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే జరిగాయి. అప్పట్లో పిల్లలందరికీ ఇంగ్లిషు మీడియంలో బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పేరెంట్స్‌ కమిటీలు సంపూర్ణంగా ఆమోదించి తీర్మానాలు చేశాయి.

ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్‌ మెయింటినెన్స్‌ ఫండ్‌, స్కూల్‌ మెయింటినెన్స్‌ ఫండ్‌ నిర్వహణలో తల్లిదండ్రులదే ముఖ్య భూమిక. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల భవిష్యత్తును ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఈవిధంగా తల్లిదండ్రులు తమ వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ సమావేశాలకు కొత్త టైటిల్స్‌ పెట్టి, ఓవైపు విద్యారంగాన్ని నాశనంచేస్తూ, మరోవైపు తామేదో కొత్తగా చేస్తున్నామనే భ్రమ కల్పించడానికి చంద్రబాబుగారు, ఆయన నాయకులు ప్రయత్నిస్తున్నారు. మరొక విశేషం ఏంటంటే.. పేరెంట్స్‌ కమిటీ సమావేశాలకు దాతలనుంచి చందాలు, సామగ్రిని తీసుకోవాలని ఏకంగా సర్క్యులర్ పంపడం.

మేం అమ్మ ఒడి కింద ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15వేల చొప్పున, క్రమం తప్పకుండా 44.49 లక్షల మంది తల్లులకు రూ. 26,067 కోట్లు ఇచ్చాం. నీకు రూ.15వేలు, నీకు 15వేలు, నీకు రూ.15వేలు అంటూ చంద్రబాబు సహా కూటమి పార్టీల నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15వేల చొప్పున ఇస్తామన్నారు. సూపర్‌ సిక్స్‌ అంటూ ఊరూరా, ప్రతి ఇంటికీ డప్పు కొట్టారు. ఇద్దరు పిల్లుంటే రూ.30వేలు అన్నారు, ముగ్గురు ఉంటే రూ.45వేలు అన్నారు, నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లన్నైనా కనాలని చంద్రబాబుగారు పిలుపుకూడా ఇచ్చారు.

అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యింది. ఇప్పటివరకూ ఒక్కపైసా ఇవ్వలేదు కదా, గతంలో ఉన్న అమ్మ ఒడి పథకాన్నీ ఆపేశారు. బడ్జెట్లో రూ.12,450 కోట్లు పెట్టాల్సి ఉండగా పెట్టలేదు. మరి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఆ హామీని అమలు చేయకపోవడంతో తల్లిదండ్రులమీద పిల్లల ఖర్చులు, వారి భారం పడుతోంది కదా? నిన్నటి పేరెంట్స్‌ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్‌కళ్యాణ్‌, విద్యా శాఖమంత్రిగా లోకేష్‌ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇది దగాచేయడం కాదా? ఒక్కమాట కూడా మాట్లాడ్డంలేదంటే తల్లిదండ్రులకు సున్నం పెడుతున్నట్టే కదా?

అధికారంలోకి రాగానే స్కూళ్ల బాగుకోసం వైయస్సార్‌సీపీ చేసిన మంచి పనులన్నింటినీ కూడా నిలిపేశారు. మలిదశలో మిగిలిపోయిన నాడు-నేడు పనులను ఉద్దేశపూర్వకంగా ఆపేశారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలనూ పట్టించుకోలేదు. ఏ కారణంతో నిలిపేశారు? ఎందుకు నిలిపేశారు? ఎంతో కష్టపడి స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్ తీసుకు వచ్చాం. ఇప్పుడు సీబీఎస్‌ఈని ఎందుకు రద్దుచేశారు? ఇంగ్లిషు మీడియం బోధనను ఎందుకు నిరుత్సాహపరుస్తున్నారు?

ప్రపంచస్థాయిలో గవర్నమెంటు స్కూలు పిల్లలను తయారుచేసేలా 3వ తరగతి నుంచి ప్రవేశపెట్టిన టోఫెల్‌ క్లాసు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్ల విధానం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, ఫ్యూచర్‌ టెక్నాలజీపై తరగతులు.. ఇలా ఇవన్నీ ఎందుకు ఆపేశారు? డిజిటల్‌ లెర్నింగ్‌లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబుల పంపిణీని ఎందుకు రద్దుచేశారు? 3వ తరగతినుంచే సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌ను ఎందుకు రద్దుచేశారు? మేం స్కూళ్లలో 6వ తరగతి నుంచే ప్రతి క్లాసులోనూ, ప్రతి స్కూల్‌లోనూ పెట్టిన ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌, డిజిటల్‌ స్క్రీన్ల సమర్థ వినియోగంకోసం ఫైనల్‌ ఇయర్ ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ను ప్రతి స్కూలుకూ పెట్టాలన్న కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? దీనివల్ల వేలమంది ఇంజినీరింగ్‌ స్టూడెంట్లకు ఉపాధి దొరకదా? లేకపోతే ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ మెయింటినెన్స్‌ మూలన పడదా?

గతంలో రోజుకో మెనూతో, ఘనంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకం గోరుముద్ద కార్యక్రమం అత్యంత దారుణంగా తయారయ్యిందంటూ ఈ మీటింగ్స్‌లో పేరెంట్స్‌ గగ్గోలు పెట్టడం మీ చెవులకూ వినిపించిందా చంద్రబాబుగారూ? డొక్కా సీతమ్మ అనే మహా తల్లి పేరుపెట్టి చివరకు స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థుల డొక్కమాడుస్తున్నారు.

కనీసం ఆయాలకు జీతాలు కూడా ఇవ్వడంలేదు. విద్యార్థులు అపరిశుభ్రమైన ఆహారం తిని ఆరోగ్యంపాడై ఆస్పత్రుల్లో చేరుతున్న ఘటనలు మీ ప్రభుత్వ హయాంలో కోకొల్లలు. పిల్లలు వెళ్లే గవర్నమెంటు స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణకోసం ఇచ్చే టాయిలెట్‌ మెయింటినెన్స్‌ ఫండ్‌, స్కూళ్ల నిర్వహణకోసం ఇచ్చే స్కూల్‌ మెయింటినెన్స్‌ ఫండ్‌ ఈరోజు ఏమైంది? ఆరోజు టాయిలెంట్ల మెయింటినెన్స్‌ గురించి గానీ, స్కూళ్ల మెయింటినెన్స్‌ గురించి గానీ ఎవరైనా పట్టించుకున్నారా?

అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఇలా ప్రభుత్వ విద్యారంగాన్ని దిగజార్చి, కావాలనే సమస్యలు సృష్టించి ఉద్దేశ పూర్వకంగా ప్రైవేటు బడులకు వెళ్లేలా చేసి, తల్లిదండ్రులు చదువు కొనుక్కునేలా వారిపై ఆర్ధికభారం మోపి, ఇప్పుడు అదే పిల్లల ముందుకు, తల్లిదండ్రులకు ముందుకు వెళ్లి ఏ మార్చే మాటలు చెప్పడానికి, వారిని మభ్యపెట్టడానికి సిగ్గేయడంలేదా?

విద్యాదీవెన, వసతి దీవెనల కింద గతంలో విద్యార్థులకు ఇచ్చే తోడ్పాటు ఇప్పుడు లభిస్తోందా? ఈ జనవరి వస్తే నాలుగు త్రైమాసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇచ్చే వసతి దీవెన, విద్యాదీవెన ఈ రెండింటికీ కలిపి ఏకంగా రూ.3,900 కోట్లు బకాయిలుగా పెట్టి, ఈరోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా మీరు చేస్తున్న డ్రామా మరో డీవియేషన్‌ రాజకీయం కాదా?” అని జగన్ ట్వీట్ చేశారు.

లేటరైట్ గనులు, పోర్టులు, ప్రకృతి సంపద మొత్తం వారి గుప్పెట్లోనే: దేవినేని ఉమ