YS Sharmila: అంతవరకు పుట్టింటి నుంచి కదలను.. మీ ఇష్టమొచ్చింది చేసుకోండి..

అంతవరకు రాజశేఖరరెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టమొచ్చింది చేసుకోండి. ఎంత చేసుకుంటారో చేసుకోండి. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇక్కడ భయపడే వాళ్లు ఎవ్వరూ లేరు. ఇక్కడున్నది రాజశేఖరరెడ్డి బిడ్డ. ఖబద్దార్..

YS Sharmila: అంతవరకు పుట్టింటి నుంచి కదలను.. మీ ఇష్టమొచ్చింది చేసుకోండి..

ys sharmila powerful speech in kadapa

Updated On : January 29, 2024 / 2:01 PM IST

YS Sharmila: ”నేను రాజశేఖరరెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. రాజశేఖరరెడ్డి రక్తం నాలో ప్రవహిస్తోంది నా పేరు వైఎస్ షర్మిలా రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, అవునన్నా.. ఎవరు గీపెట్టినా నేను వైఎస్ షర్మిల రెడ్డి. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చా. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు వాళ్ల హక్కులు కల్పించడం కోసం రాజశేఖరరెడ్డి బిడ్డ ఇవాళ తన పుట్టింటిలో అడుగు పెట్టింది. ప్రత్యేక హోదా, పోలవరం వచ్చే వరకు రాజశేఖరరెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలదు. మన బిడ్డలను ఉద్యోగాలకు రావాలి.. అంతవరకు రాజశేఖరరెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టమొచ్చింది చేసుకోండి. ఎంత చేసుకుంటారో చేసుకోండి. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇక్కడ భయపడే వాళ్లు ఎవ్వరూ లేరు. ఇక్కడున్నది రాజశేఖరరెడ్డి బిడ్డ. ఖబద్దార్..” అంటూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

కడప జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలతో సోమవారం వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ, వైసీపీ, బీజేపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓటు వేస్తే కేసిన ఆ ఓటు బీజేపీకే చెందుతుందని అన్నారు. టీడీపీ, వైసీపీకి మళ్లీ ఓటు వేస్తే భవిష్యత్తు శూన్యమవుతుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న పూర్తిగా మారిపోయారని ఆరోపించారు.

Also Read: పొత్తు ధర్మంలో బలైపోయే నేతలు ఎవరు.. ఈ 18 సీట్లపై టీడీపీ-జనసేనలో గందరగోళం?

”జగనన్నతో మనకు ద్వేషం లేదు. కడప జిల్లా నా పుట్టినిల్లు. జమ్మలమడుగులోని హాస్పిటల్లో జగనన్న ఎక్కడ పుట్టారో నేను కూడా అదే హాస్పిటల్లోనే పుట్టాను. జగన్ అన్నది నాది ఒకే రక్తం. అన్న సీఎం అయ్యాక మారిపోయారు. ఈ జగనన్న నాకు తెలియదు. వైసీపీ కోసం నేను నిస్వార్థంగా 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. వైసీపీకి ఉనికే లేకుండా పోతుందేమో అని భయపడుతుండగా నేను అండగా నిలిచాను. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయమంటే చేశాను. ఏ పదవిని ఆకాంక్షించకుండా నిస్వార్థంగా నేను ఇవన్నీ చేశాను. ఈరోజు వైసీపీ పార్టీకి వాళ్లు.. ఆడబిడ్డ అని కూడా చూడకుండా మూకుమ్మడిగా నాపై దాడి చేస్తున్నారు. సిగ్గు సిగ్గు లేకుండా నాపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. పదవీ కాంక్షతోనే నా భర్త అనిల్ సోనియా గాంధీ వద్దకు వెళ్లారని దుష్ప్రచారం చేస్తున్నారు. మాకు పదవీ కాంక్ష ఉంటే మా నాన్న సీఎంగా ఉన్నప్పుడు ఒక్క పదవైనా తీసుకోకపోదుమా?” అని షర్మిల అన్నారు.