నా కొడుక్కి ఒక్క అవ‌కాశం ఇవ్వండి : విజ‌య‌మ్మ స్లొగ‌న్

ఏపీలో మోసపు పరిపాలన సాగుతోందని వైఎస్ విజయమ్మ అన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 29, 2019 / 11:58 AM IST
నా కొడుక్కి ఒక్క అవ‌కాశం ఇవ్వండి : విజ‌య‌మ్మ స్లొగ‌న్

Updated On : March 29, 2019 / 11:58 AM IST

ఏపీలో మోసపు పరిపాలన సాగుతోందని వైఎస్ విజయమ్మ అన్నారు.

ఏపీలో మోసపు పరిపాలన సాగుతోందని వైఎస్ విజయమ్మ అన్నారు. రాష్ట్రంలో ఒక్కపనైనా చేశానని.. చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్యాయం, అక్రమం, అబద్ధం, మోసపు పరిపాలన జరుగుతుందని విమర్శించారు. విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలన్నారు. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి.. న్యాయానికి, అన్యాయానికి.. అవకాశావాదానికి, మాటకు మధ్య జరుగుతున్నాయని విశ్లేషించారామె. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు విజయమ్మ.

ఒక్కసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. రాజశేఖర్ రెడ్డి పాలన, ప్రస్తుత పాలన ఎలా ఉందో గమనించాలన్నారు. ఇది చేశాను..ఇది చేస్తాను.. అని చెప్పగలిగే వాడే నాయకుడు అన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అన్నారు. తమ కుటుంబానికి, ప్రజలతో 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఓదార్పు యాత్ర చేపట్టిన జగన్ ను ప్రజలు అక్కున చేర్చుకున్నారని.. అది ఎప్పటికీ మరవలేనన్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పారు.

వైఎస్ మరణం తర్వాత.. జగన్ ను చాలా ఇబ్బందులు పెట్టారని వాపోయారు. పొమ్మనలేక పొగబెట్టి పార్టీ నుంచి బయటికి పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో ఉంటే జగన్ మంచివాడు.. పార్టీ నుంచి బయటికి వస్తే ఎలా చెడ్డవాడు అవుతాడని నిలదీశారు. ఏపీ సమైక్యంగా ఉండాలని.. స్పెషల్ స్టేటస్ కోసం జగన్ ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఎన్నికల ప్రచారం కోసం బయటికి వచ్చానని తెలిపారు. ఇటీవలే మా మరిది వివేకానందరెడ్డిని హత్య చేశారని కన్నీళ్ల పర్యంతం అయ్యారు. 20 ఏళ్ల క్రితం మామ రాజారెడ్డిని హత్య చేశారు.. 9 ఏళ్ల క్రితం రాజశేఖర్ రెడ్డిని కోల్పోయాం.. అది కూడా అనుమానాస్పద మృతి అన్నారు. 4 నెలల క్రితం ఎయిర్ పోర్టులో జగన్ ను హత మార్చాలనుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

హత్యలు చేసుకునే కుటుంబం కాదని.. బయటికి వారికి కూడా ప్రాణం పోసే కుటుంబం అన్నారు. కేసీఆర్ – ఏపీకి సంబంధమేంటీ? ఎవరు ఎవరితో ఉన్నారో ప్రజలు గమనించాలన్నారు. కనిగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బుర్రా మధుసూదన్ యాదవ్, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ ను గెలించాలని కోరారు. ఒక్కసారి జగన్ కు అవకాశం ఇవ్వాలని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మళ్లీ ఓట్లు అడగం అంటూ ఓటర్లకు విన్నవించుకున్నారు విజయమ్మ.