నాని డ్రామాలు ఆడారు, వాళ్లపై ఒక్క కేసు కూడా లేదు- దాడి ఘటనపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఈ ఐదేళ్లు నన్ను ఎంత దూషించినా నేను స్పందించలేదు. నాని దంపతులను నేను ఏనాడూ విమర్శించ లేదు.

నాని డ్రామాలు ఆడారు, వాళ్లపై ఒక్క కేసు కూడా లేదు- దాడి ఘటనపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Chevireddy Bhaskar Reddy : చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయవర్గాల్లో మాటల యుద్ధానికి దారితీసింది. పోలీసులు కేసులు నమోదు చేయడం, దాడికి పాల్పడిన వారి అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పులివర్తి నాని టార్గెట్ గా నిప్పులు చెరిగారు. తనపై దాడి విషయంలో టీడీపీ అభ్యర్థి నాని డ్రామా చేశారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించి మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు చెవిరెడ్డి.

”మహిళా యూనివర్సిటీ వద్ద నాని కారుపై దాడి చేశారే తప్ప, ఆయనపై దాడి చేయలేదు. దాడిని నేను కూడా ఖండిస్తున్నా. దాడి తర్వాత కూడా నాని చాలా హుషారుగా ఉన్నారు. కానీ చేతులకు, కాళ్ళకు గాయాలు అని నటన చేస్తున్నారు. నాని భార్య సైతం ఇదే తరహాలో లేని గాయాలు సృష్టించి డ్రామాలు ఆడుతున్నారు.

పులివర్తి నానిపై దాడి విషయంలో అనవసరంగా మమ్మల్ని దోషులు చేస్తున్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి దాడులు సరికాదు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వాడిని. హుందాగా వ్యవహరిస్తాను. ఈ ఐదేళ్లు నన్ను ఎంత దూషించినా నేను స్పందించలేదు. పులివర్తి నాని దంపతులను నేను ఏనాడూ విమర్శించ లేదు. ఈ ఐదేళ్లు వారిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నాని చేస్తున్న క్వారీ వ్యాపారాల జోలికి నేను ఎప్పుడూ వెళ్లలేదు. నాని భార్య మమ్మల్ని వ్యక్తిగతంగా ఎన్నో దూషించారు.

నాని ఆడిన నాటకం వల్ల ఇప్పుడు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్ల ముందు నియోజకవర్గాన్ని వదిలేద్దామని అనుకున్నా. కానీ చంద్రగిరి ప్రజలతో ఏర్పడ్డ అనుబంధాన్ని వదలలేక, నా కుమారుడిని బరిలో నిలిపా. నానిపై దాడి చేయాల్సిన అవసరం మాకు లేదు. పులివర్తి నాని మాకు ప్రత్యర్థి తప్ప, శత్రువు కాదు. ఆయనపై దాడి జరిగిందని తెలిశాక, ఆయనను వెళ్లి పరామర్శించాలని అనుకున్నా” అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు.