Tadepalligudem Assembly Constituency : వైసీపీ వర్సెస్ జనసేన..! తాడేపల్లిగూడెం రేసుగుర్రం ఎవరు?

అనుకున్న స్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం సాధించని పక్షంలో జనసేనకు డేంజర్‌ సిగ్నలే అంటున్నారు పరిశీలకులు. మరి ఈ హోరాహోరీ పోరులో తాడేపల్లిగూడెం ఎవరికి జైకొడుతుందనేది చూడాలి.

Tadepalligudem Assembly Constituency : వైసీపీ వర్సెస్ జనసేన..! తాడేపల్లిగూడెం రేసుగుర్రం ఎవరు?

Tadepalligudem Assembly Constituency : హోల్‌సేల్ వ్యాపార కేంద్రం తాడేపల్లిగూడెం రాజకీయాలకూ కేంద్రమే. పశ్చిమ గోదావరి జిల్లా నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెం ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో ఊహించడం కూడా కష్టమే. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీతోపాటు గతంలో కాంగ్రెస్‌, బీజేపీ, ప్రజారాజ్యం పార్టీలను కూడా ఈ నియోజకవర్గం నుంచి గెలిపించారు. ప్రతిపార్టీని ఆదరించిన తాడేపల్లిగూడెం ఓటర్లు ఈసారి ఎవరికి జైకొట్టనున్నారు? ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు కాలం కలిసివస్తుందా? జనసేన మ్యాజిక్‌ చేస్తుందా? తాడేపల్లిగూడెం రేసుగుర్రం ఎవరు?

జనసేనాని పవన్‌ సొంత జిల్లా..
వ్యాపార, వాణిజ్య కేంద్రమైన తాడేపల్లిగూడెం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. విద్య, వ్యాపార రంగాలకు కేరాఫ్‌గా అభివృద్ధిలో దూసుకుపోతున్న తాడేపల్లిగూడెంలో ఈసారి జరిగే ఎన్నికలు పోటాపోటీగా జరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను మరోసారి బరిలోకి దింపుతోంది వైసీపీ. ఇక డిప్యూటీ సీఎంకి ప్రత్యర్థిగా జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా తాడేపల్లిగూడెంను జనసేనకు కేటాయించింది టీడీపీ. జనసేనాని పవన్‌ సొంత జిల్లా కావడంతో.. ఆ పార్టీ ఎంతటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

మహిళా ఓట్లే ఎన్నికల్లో కీలక ప్రభావం చూపే అవకాశం..
తాడేపల్లిగూడెం రాష్ట్రంలోనే అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ ఉంది. ప్రతి ఆదివారం ఇక్కడ కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. 1955లో ఏర్పడిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రస్తుతం నరసాపురం పార్లమెంటు పరిధిలో ఉంది. తాడేపల్లిగూడెం పట్టణంతోపాటు తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మొత్తం 2 లక్షల 14 వేల 554 మంది ఓటర్లు ఉండగా, వీరిలో మహిళలే సగం మంది ఉన్నారు. లక్ష 9 వేల మహిళా ఓట్లే ఎన్నికల్లో కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.

7సార్లు కాంగ్రెస్, 5సార్లు టీడీపీ విజయం..
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇప్పటివరకు 15సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 5 సార్లు టీడీపీ జెండా ఎగరేయగా, ప్రజారాజ్యం, BJP, Ysrcp పార్టీలు కూడా ఒక్కోసారి విజయం సాధించాయి. ఇక త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

అభివృద్ది వర్సెస్ అవినీతి..
ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. గత ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేశామని చెబుతున్నారు డిప్యూటీ సీఎం.. నియోజకవర్గంలో అన్ని రోడ్లు నూతనంగా నిర్మించామని, వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామంటున్నారు. తాను చేసిన పనులే మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతిపక్షం మాత్రం నియోజకవర్గంలో అభివృద్ధి కన్నా, అవినీతే ఎక్కువగా ఉందని ఆరోపిస్తోంది…

వైసీపీ ఒక్కటే ఒకవైపు.. మూడు పార్టీలు మరోవైపు..
గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన బొలిశెట్టి… మూడో స్థానంలో నిలవగా, ఈసారి టీడీపీ, బీజేపీ మద్దతుతో వైసీపీకి గట్టిపోటీ ఇస్తున్నారు. 2019లో చతర్ముఖ పోటీ జరగడంతో ఓట్లు చీలి…. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఏకంగా 16 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి వైసీపీ ఒక్కటీ ఒకవైపు… మిగిలిన మూడు పార్టీలు ఒకవైపు నుంచి పోరాడుతుండటంతో తాడేపల్లిగూడెం రాజకీయం ఆసక్తికరంగా మారింది.

కాపు ఓట్లపైనే గురి..
నియోజకవర్గంలో 60 శాతం జనాభా కాపులే ఉన్నారు. దీంతో ప్రతిపార్టీ కాపులకే ఇక్కడ టికెట్లు ఇస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కూడా అదే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. కాపు ఓట్లపైనే గురిపెట్టిన జనసేన జోరుకు వైసీపీ బ్రేక్‌లు వేస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో తన వారసుడిని పోటీకి పెట్టాలని భావించిన డిప్యూటీ సీఎం… అధిష్టానం ఆదేశాలతో మళ్లీ రంగంలోకి దిగారు. దేవాదాయశాఖ బాధ్యతలు చూస్తున్న కొట్టు… తాడేపల్లిగూడెంలో పట్టు సడలలేదని… మళ్లీ విజయం తథ్యమంటున్నారు.

సీఎం జగన్‌ అమలు చేస్తున్న పథకాలే శ్రీరామ రక్ష అంటున్న డిప్యూటీ సీఎం…. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం డిప్యూటీ సీఎంపై ఆరోపణలే అస్త్రాలుగా చేసుకుంటున్నాయి. మొత్తానికి తాడేపల్లిగూడెంలో రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. ఇరుపార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని రక్తికట్టిస్తుండటంతో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో ఓట్ల చీలికతో విక్టరీ కొట్టిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యానారాయణ…. ఇప్పుడు ఎలా గట్టెక్కుతారనేది ఉత్కంఠ రేపుతోంది.

ఇదే సమయంలో మూడు పార్టీల మధ్య సాఫీగా ఓట్ల బదిలీ జరిగితేనే జనసేనకు ఫలితం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. అనుకున్న స్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం సాధించని పక్షంలో జనసేనకు డేంజర్‌ సిగ్నలే అంటున్నారు పరిశీలకులు. మరి ఈ హోరాహోరీ పోరులో తాడేపల్లిగూడెం ఎవరికి జైకొడుతుందనేది చూడాలి.

Also Read : ఒకవైపు అదృష్టవంతుడు, మరోవైపు పోరాట యోధుడు.. నెల్లూరు రూరల్‌లో గెలుపెవరిది?