Parvathipuram Assembly Constituency : జోగారావు వర్సెస్ విజయచంద్ర.. పార్వతీపురంలో రసవత్తర పోరు

గ్రూపుల గోల నుంచి తప్పించుకుంటేనే విజయచంద్ర నెగ్గుకు రాగలరనే అభిప్రాయం ఉండగా, ప్రత్యర్థిపై పైచేయి సాధించడంలో ఎమ్మెల్యే అనుసరించే వ్యూహమే మరోసారి గెలిపించే అవకాశం ఉందంటున్నారు.

Parvathipuram Assembly Constituency : జోగారావు వర్సెస్ విజయచంద్ర.. పార్వతీపురంలో రసవత్తర పోరు

Mla Alajangi Jogarao vs Vijay Chandra Bonela

Parvathipuram Assembly Constituency : ప్రగతి పలుకులు ఒకరివైతే.. ప్రత్యర్థిపై ఆరోపణాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు మరొకరు. ఒకరు తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి.. రెండోసారి నిలిచి తానేంటో నిరూపించుకోవాలని తహతహలాడుతున్నారు. మరొకరు రాజకీయాలకు కొత్తగా వచ్చినా… రాజకీయం అంటే ఏంటో పూర్తిగా చదివేశానంటున్నారు.. ఎన్నికలకు ముందు నుంచే మాటల తూటాలతో… ఆరోపణలు.. ప్రత్యారోపణలతో కాకరేపుతున్నారు.

కొత్త అభ్యర్థిని దింపిన టీడీపీ..
మాటలే తూటాలు… సై అంటే సై.. ఢీ అంటే ఢీ… ఇద్దరూ.. ఇద్దరే… తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నారు. సమరోత్సాహంతో రాజకీయ దుమారానికి తెరలేపుతున్నారు. మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం నియోజకవర్గం అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారుతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో ఇరువైపులా వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన పార్వతీపురంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అలజంగి జోగారావు వైసీపీ తరపున మళ్లీ పోటీ చేస్తుండగా, ఆయనకు ప్రత్యర్థిగా ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన బోనెల విజయచంద్రను కొత్తగా తెరపైకి తెచ్చింది టీడీపీ…. ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జోగారావు తాను చేసిన పనులే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తుండగా, ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలే అజెండా చేసుకుని దూకుడు చూపిస్తున్నారు టీడీపీ అభ్యర్థి విజయచంద్ర.

మరోసారి గెలుస్తానని ధీమా..
ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా పని చేసిన అలజంగి జోగారావు గత ఎన్నికల్లో 24 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు కూడా అంతకు ఒక్క ఓటు కూడా తక్కువ కాకుండా గెలుస్తానని చెబుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత జోగారావు ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు. సొంత పార్టీలో వర్గపోరును తట్టుకొని నిలబడ్డారు. అంతేకాదు ప్రతిపక్ష పార్టీలను తన గుప్పెట్లో పెట్టుకున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇంటా.. బయటా అంతా సెట్‌ చేసుకున్న ఎమ్మెల్యే… ఆ ధీమాతోనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తానని గట్టి నమ్మకం పెట్టకున్నారు.

సీఎం జగన్‌ ఇమేజ్‌తోపాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు..
అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో సీఎం జగన్‌ ఇమేజ్‌తోపాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే.. ఎవరు ఏ పనిమీద వచ్చినా…. కాదనుకుండా చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎక్కడ సమస్య అని తెలిసినా క్షణాల్లో ప్రత్యక్షమై ప్రజల్లో పట్టు పెంచుకున్నారు ఎమ్మెల్యే. తన రాజకీయ గురువు బొత్స సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అండదండలతో రెండోసారి సీటు దక్కించుకుని.. మళ్లీ విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు ఎమ్మెల్యే…

పొలిటికల్‌ పాలసీ మేకింగ్‌లో విశేష అనుభవం..
గత ఐదేళ్లు చేసిన సేవలే గెలిపిస్తాయని ఎమ్మెల్యే జోగారావు ధీమాగా ఉన్నా… ఆయనపై అవినీతి, అక్రమాలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు. కొంతకాలం క్రితం వరకు ప్రతిపక్షాలను కూడా తన గుప్పెట పెట్టుకుని రాజకీయం నడిపిన ఎమ్మెల్యేకు తిరుగులేదనే వాతావరణమే ఉండేది.. కానీ, టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే చిరంజీవులును తప్పించి… ఆ స్థానంలో యువకుడైన బోనెల విజయచంద్రకు బాధ్యతలు అప్పగించింది టీడీపీ. ఇంజనీరింగ్‌ చదవిన విజయచంద్ర… రాజకీయాలకు కొత్త అయినప్పటికీ పొలిటికల్‌ పాలసీ మేకింగ్‌లో విశేష అనుభవం ఉండటంతో అగ్రనేతలు అందరితో సత్సబంధాలు ఏర్పరుచుకున్నారు.

ఎమ్మెల్యేను కార్నర్ చేయడంలో సక్సెస్..
ఇందులో భాగంగానే రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని పార్వతీపురం టీడీపీ ఇన్‌చార్జిగా నియోజకవర్గంలో అడుగుపెట్టారు. విజయచంద్ర బాధ్యతలు స్వీకరించిన తర్వాత… ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను తప్పించుకోలేని విధంగా ఎమ్మెల్యేను కార్నర్‌ చేయడంలో విజయచంద్ర సక్సెస్‌ అయ్యారని అంటున్నారు పరిశీలకులు.

టీడీపీలో పెరిగిన జోరు..
నియోజకవర్గంలో చెరువులు, ప్రభుత్వ భూములు కనిపించడం లేదని… వీటి వెనుక ఎమ్మెల్యే ఉన్నారంటూ టీడీపీ చేస్తున్న విమర్శలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యేగా జోగారావు గెలిచిన తర్వాత నాలుగున్నరేళ్లు స్తబ్దుగా ఉండిపోయిన టీడీపీ… ఇన్‌చార్జిగా విజయచంద్ర వచ్చాక జోరు పెంచింది. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై పోరాటం చేయడం ద్వారా విజయచంద్ర నియోజకవర్గంలో సొంత ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నారు. దీంతో పార్టీలో కొందరు సీనియర్లు కినుక వహించినా, అధినేత చంద్రబాబు ఆశీస్సులతో వాటన్నింటినీ అధిగమిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే జోగారావుపై విజయచంద్ర చేస్తున్న పోరాటమే గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ అభ్యర్థికి అదే మైనస్..
మంచి వాగ్దాటితో క్యాడర్‌ను ఆకట్టుకుంటున్న విజయచంద్ర… సీనియర్ల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవడమే మైనస్‌గా చెబుతున్నారు పరిశీలకులు. వైసీపీలో అన్ని గ్రూపులను ఒక్కటి చేసిన ఎమ్మెల్యే… టీడీపీపై పోరాటం చేస్తూ దూసుకుపోతుండగా, టీడీపీ ఇన్‌చార్జి విజయచంద్ర మాత్రం… ఇంటా బయటా యుద్ధం చేయాల్సి రావడమే సమస్యగా మారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐతే సీనియర్లను కలుపుకుని వెళుతున్నానని… నలుగురు నాలుగు మండలాలు చూస్తుండటం వల్లే తప్పుడు భావన కలుగుతోందని… అదంతా తమ పార్టీ వ్యూహమని చెబుతున్నారు విజయచంద్ర…

గెలుపెవరిది?
ఏదైనా సరే గ్రూపుల గోల నుంచి తప్పించుకుంటేనే విజయచంద్ర నెగ్గుకు రాగలరనే అభిప్రాయం ఉండగా, ప్రత్యర్థిపై పైచేయి సాధించడంలో ఎమ్మెల్యే అనుసరించే వ్యూహమే మరోసారి గెలిపించే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి ప్రజాక్షేత్రంలో ఇద్దరూ సమ ఉజ్జీలుగా తలపడుతుండటంతో పార్వతీపురం అసెంబ్లీ ఫైట్‌ హాట్‌.. హాట్‌గా మారింది.

Also Read : అన్నదమ్ముల యుద్ధంలో గెలుపెవరిది? ఉత్కంఠ రేపుతున్న విజయవాడ పార్లమెంట్‌ సీటు