తిరుగేలేదు.. ఈ రకమైన కాలసర్పయోగము వల్ల పేరుప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు, ధనము అంతా మీ సొంతం..
ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..

Kaal Sarp Dosh
Kaal Sarp Dosh: రాహువు, కేతువుల మధ్య సప్తగ్రహములు ఉంటే దానిని కాలసర్పయోగము అంటారు. జన్మలగ్నములో రాహువు.. సప్తమంలో కేతువు ఉండి అష్టమ, నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశ (8,9,10,11,12) భావములలో మిగతా గ్రహములు ఉంటే (అక్కడ మాలికాయోగము ఏర్పడుతుంది) దానిని దృశ్యగోళార్థ కాలసర్పయోగము అని అంటారు.
దృశ్యగోళార్థ కాలసర్పయోగ ప్రభావం
ఈ రకమైన దృశ్యగోళార్థ కాలసర్పయోగము వల్ల సంఘంలో పేరుప్రతిష్ఠలు గౌరవమర్యాదలు ఉంటాయి. వీటితో పాటు ధన, ధాన్య సమృద్ధి కలుగుతుంది. రాజకీయాల్లోకి ప్రవేశం, కీర్తి, పెద్దల మన్ననలు ఆశీర్వాదము కూడా లభిస్తుంది. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. ఏ కార్యక్రమములు మొదలుపెట్టినా బాగుటుంది.
ఈ జాతకునికి ఐశ్వర్యంతోపాటు ఎక్కువ మంది శత్రువులు కూడా పెరుగుతారు. అలాగే ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. కష్టములు, దీర్ఘవ్యాదులు కలుగుతాయి. గురుదేవులు, పండితుల మన్ననలు పొందుతారు. మరొక విధమైన దృశ్యగోళార్థ కాలసర్పయోగము కూడా ఉంది.
అది రాహువు ద్వాదశ భావములో కేతువు షష్టమ భావములో ఉండి మిగతా సప్తగ్రహములు అష్టమ, నవమ, దశమ, ఏకాదశ (8,9,10,11) భావములలో (ఆయుష్య, భాగ్య, కర్మ లాభ భావములలో) ఉంటే దానిని కూడా దృశ్య గోళార్థ కాలసర్పయోగము అంటారు.
ఈ విధమైన కాలసర్పయోగము వల్ల జాతకుని జీవితంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. వృత్తిలో నైపుణ్యత, కార్యదీక్ష పట్టుదల, సాహసం చేయగల సమర్థులు అవుతారు. వ్యాపారంలో నిపుణత, మంచి ఆలోచనాసరళి, ఉన్నత శిఖరాలను అధిరోహించడం, కీర్తి, గౌరవం, ఆనందం, సౌఖ్యము, సంపత్తి, ఐశ్వర్యం, భూమి, వాహనాలు, భవనాలు మొదలైన అన్ని సుఖాలను అనుభవిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు, గౌరవం, అభిమానం లభిస్తాయి. అడుగడుగున అదృష్టం వస్తుంది.
వీరికి పట్టిందల్లా బంగారము అవుతుంది. దైవకార్యములో ఆసక్తి, యజ్ఞములు, దానములు, పరోపకారములు చేయుట ఆధ్యాత్మిక కార్యక్రమములలో పాల్గొనడం వంటివి ఉంటాయి. శత్రువులు ఉండటం, వాహన ప్రమాదములు, వ్యాపారములో హఠాత్తుగా నష్టము రావడం, మళ్లీ కోలుకోవటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ధార్మిక జ్ఞానము, ధర్మము వల్ల నిబద్ధత ఉంటుంది.
శత్రువుల వల్ల విపరీతంగా బాధలు, నిత్య సంఘర్షణ హఠాత్తుగా మరణము ఉంటాయి. ఈ జాతకుని జీవితంలో పూర్వార్థంలో ధనము కలగడం, ఉత్తరార్థంలో దానధర్మాలు, సమాజసేవ, దైవిక, ధార్మిక కార్యక్రమములలో పాల్గొనడం వంటివి ఉన్నాయి.
పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Ph: 9849280956, 9515900956