Devi Navaratrulu 2025: ఇంద్రకీలాద్రిలో తొలిరోజు బాలా త్రిపుర సుందరీగా అమ్మవారు.. ఇలా చేస్తే పుణ్యం..
అమ్మవారు అనుగ్రహిస్తే సంతానం కలుగుతుంది. 2 -10 ఏళ్ల బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు చేసి కొత్త బట్టలు పెడతారు.

Devi Navaratrulu 2025
Devi Navaratrulu 2025: ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో పూజిస్తారు. తొలిరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు.
బాలా త్రిపుర సుందరీ అలంకారం
తొలిరోజు బాలా త్రిపుర సుందరీ అలంకారంలో అమ్మవారిని లేత గులాబి రంగు చీరతో అలంకరిస్తారు. త్రిపుర సుందరీ దేవికి ఇష్టమైన తుమ్మి పూవులతో పూజలు చేస్తారు. బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. రవికుల గుడ్డ దానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తారు. అమ్మవారికి పూజిస్తే మంచి బుద్ధి రావడంతో పాటు, కార్యసిద్ధి లభిస్తుంది.
త్రిపురుని భార్య పేరు త్రిపుర సుందరీ దేవి.. అంటే ఈశ్వరుడి భార్య గౌరీదేవి అని అర్థం. ఆ అమ్మవారిని పూజిస్తే మానసిక బాధలు కూడా తొలిగిపోతాయని హిందువుల నమ్మకం. బాలార్చన చేస్తే త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం వస్తుంది. అలాగే, అమ్మవారు అనుగ్రహిస్తే సంతానం కలుగుతుంది. 2 -10 ఏళ్ల బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు చేసి కొత్త బట్టలు పెడతారు.
పురాణంలో ప్రస్థావన
బ్రహ్మాండ పురాణంలో బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి ప్రస్థావన ఉంది. లలితా సహస్రంలోనూ అమ్మవారి ప్రస్థావన కనిపిస్తుంది. భండాసురుడికి 30 మంది పిల్లలు ఉండేవారు. ఇంద్రాది దేవతలను భండాసుర కొడుకులు హింసిస్తారు.
దీంతో హంసలు లాగే కన్యక రథంపై అమ్మవారు వచ్చి ఆ రాక్షసులను చంపేస్తుంది. భయంకరులైన రాక్షసులందరిను అమ్మవారు అర్ధచంద్ర బాణంతో సంహరిస్తుంది. అమ్మవారు బాలగా కనిపించినప్పటికీ బలంలో మాత్రం వీరత్వం కనబర్చుతుంది. బాలా త్రిపురసుందరి అనుగ్రహం కోసం ‘ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః’ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.