Dussehra 2025: దసరా రోజు పాలపిట్టను చూడాల్సిందే.. ఎందుకంటే?
దసరా రోజున పాలపిట్టను కచ్చితంగా చూడాలని అంటారు. దీని వెనక ఉన్న కారణమేంటి..పాండవులకు పాలపిట్టకు ఉన్న సంబంధమేంటి..?

Indian Roller
దసరా పండుగ, దేవి నవరాత్రులు తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభను నింపుతాయి. ప్రతి ఇల్లు మామిడి తోరణాలు, పసుపు కుంకుమలతో కళకళలాడుతుంది. ఒక్కో రోజు అమ్మవారు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. దసరా పండుగ పేరు ఒక్కటే అయినా, ప్రాంతాన్ని బట్టి ఆచారాలు మారుతుంటాయి. తెలంగాణలో బతుకమ్మగా, ఆంధ్రాలో దేవి నవరాత్రులుగా జరుపుకుంటారు.
బతుకమ్మ లేదా దేవి నవరాత్రులు ఎలా జరుపుకున్నా, దసరా రోజున ‘పాలపిట్ట’ను చూడటం అనేది ఒక ముఖ్యమైన ఆచారం. దీనిని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించి గౌరవించింది.
దసరా రోజున పాలపిట్ట తప్పకుండా కనిపిస్తుందని తెలంగాణ ప్రజలు నమ్ముతారు. దశమి రోజున గ్రామాల్లో ప్రజలు పాలపిట్టను చూడటానికి పొలాలకు వెళతారు. నగరాల్లో కనిపించదు కాబట్టి, కొందరు పండుగ రోజున పాలపిట్టను పంజరంలో బంధించి తీసుకొచ్చి, వీధుల్లో తిరుగుతూ ‘పాలపిట్టమ్మా పాలపిట్ట’ అని పిలుస్తారు. చూడాలనుకునేవారు డబ్బులిచ్చి చూస్తారు. ఈ సంప్రదాయం వెనుక కొన్ని ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి.
పాండవులకు పాలపిట్ట దర్శనం:
కురుక్షేత్ర యుద్ధానికి ముందు, పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించుకుని తిరిగి వస్తుండగా, వారికి దారిలో పాలపిట్ట కనిపించిందట. అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిసిన రోజు విజయదశమి కావడంతో, పాలపిట్ట దర్శనం తమకు శుభాలను, విజయాలను తెస్తుందని నమ్మారట. తదనంతరం కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. విజయదశమి రోజున పాలపిట్టను చూసినందుకే విజయం సిద్ధించిందనే నమ్మకంతో, ఇది ఒక ఆచారంగా మారిందని చెబుతారు. అప్పటి నుండి విజయదశమి రోజున పురుషులు అడవికి వెళ్లి పాలపిట్టను చూడటం అలవాటుగా మారింది.
శ్రీరాముడికి పాలపిట్ట దర్శనం:
మరో పురాణ కథ ప్రకారం, శ్రీరాముడు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు పాలపిట్ట దర్శనం చేసుకున్నాడని చెబుతారు. అందుకే విజయదశమి రోజున ఈ పక్షిని చూస్తే అంతా మంచే జరుగుతుందని ప్రజలు నమ్ముతారు.
చెడుపై మంచి సాధించిన విజయాన్ని విజయదశమిగా జరుపుకుంటారు. ఈ రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుందని నమ్ముతారు. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడటానికి అంత ప్రాధాన్యత ఏర్పడింది. జమ్మిచెట్టుతో పాటు పాలపిట్ట దర్శనం దసరా పండుగలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.