Amarnath Yatra 2025 : జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. ఎన్ని రోజులు, ఎప్పుడు ముగుస్తుంది, రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి..
తేదీ ఖరారు కావడంతో తీర్థయాత్రకు సజావుగా ఏర్పాట్లు జరిగేలా చూసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు.

Amarnath Yatra 2025 : అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు.. అమర్నాథ్ యాత్ర తేదీలను ఖరారు చేసింది. జమ్ముకశ్మీర్‌లోని పవిత్రమైన అమర్నాథ్ గుహకు వార్షిక తీర్థయాత్ర జూలై 3, 2025న ప్రారంభం కానుంది. 39 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. రక్షా బంధన్ రోజున(ఆగస్ట్ 9) ముగుస్తుంది. అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు ఛైర్మన్ జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షత వహించిన పుణ్యక్షేత్ర బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తేదీలు నిర్ణయించడంతో తీర్థయాత్రకు సజావుగా ఏర్పాట్లు జరిగేలా చూసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు.
అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పవిత్ర మందిరం సందర్శనకు పెద్ద సంఖ్యలో భక్తులకు తరలి వస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సులభంగా అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు. అలాగే భక్తులకు భద్రత, వైద్య సదుపాయాలు కల్పిస్తారు.
అమర్‌నాథ్ యాత్ర అత్యంత పవిత్రమైన హిందూ తీర్థయాత్రలలో ఒకటి. ఇది దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది. అమర్‌నాథ్ గుహ లోపల సహజంగా ఏర్పడిన మంచు శివలింగం ఆశీర్వాదం కోసం యాత్రికులు హిమాలయ భూభాగం నుంచి ట్రెక్కింగ్ చేపడతారు. ఇది సవాళ్లతో కూడుకున్న యాత్ర. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర రెండు మార్గాలు అనంతనాగ్ జిల్లా పహల్‌గామ్ ట్రాక్, గందర్‌బల్ జిల్లా బల్తల్ నుంచి ఒకేసారి జూలై 3న ప్రారంభం అవుతుంది.
Also Read : ఏప్రిల్ 2 నుంచి ఇండియాపై సుంకాలు.. ప్రకటించిన ట్రంప్
గతేడాది అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు 2024 ఏప్రిల్ 17న ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహించబడుతుంది. ఈసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ 10 రోజుల ముందుగానే అంటే.. మార్చి 15 నాటికి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ముందుగా వచ్చిన వారికి ముందుగా అనుమతి ఆధారంగా అనుమతులు జారీ చేయబడతాయి. 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్‌కు అనర్హులు. ముఖ్యంగా అమర్‌నాథ్ యాత్రను ప్రారంభించే ముందు.. యాత్రికులు ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.