1991నాటి సంఘటనలు.. 2020లోనూ జరగనున్నాయా?

పేరుకు రెండు వేర్వేరు (1991-2020) దశాబ్దాలు.. కానీ, ఈ రెండింటి దశాబ్దాల్లోని పరిస్థితుల మధ్య పొలికలు ఒకేలా కనిపిస్తున్నాయి. దశాబ్దాల క్రితం జరిగిన అదే సంఘటనలు పునరావృతం కాబోతున్నాయా? ఒకప్పటి పరిస్థితులను తలపించేలా కొత్త ఏడాది ఉండబోతుందా? 1991 ఏడాది ప్రారంభంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో 2020 ఏడాది ప్రారంభంలోనూ అదే తరహాలో పరిస్థితులు రానున్నాయా? అంటే జరుగుతున్న సంఘటనలను చూస్తే అవుననే సమాధానం రాక తప్పదు.
ఎందుకంటే, 1990-90 లో జరిగిన సంఘటనలతో పోలిస్తే 2019-20లో జరుగుతున్న సంఘటనలు సమానంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. మరో ప్రధాన సంఘటన ఇదే తరహాలో జరగబోతుందా? లేదో మూడు వారాల్లో తేలిపోనుంది. ఇప్పుడు, 1990-91 మధ్యకాలంలో, రిజర్వేషన్లపై మండల్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు జరిగాయి.
అదే సంవత్సరంలో, అమెరికా (జార్జ్ H W బుష్ అధ్యక్షుడిగా) సద్దాం హుస్సేన్ నేతృత్వంలోని ఇరాక్‌పై మధ్య ఆసియాలో భారీగా ఉద్రిక్తతలకు దారితీయడం, ముడి చమురు ధరల ఒక్కసారిగా పెరిగిపోవడం జరిగిపోయాయి. 2019-20 ఏడాది ప్రారంభంలోనూ పెద్దగా వ్యత్సాసంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. సెంట్రల్ యూనివర్శిటీల్లో పౌరసత్వ చట్టం అమలు, ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా పౌర సమాజం, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలంతా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
చమురు, బంగారం ధరలపై ప్రభావం:
అదే సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బాగ్దాద్‌లో డ్రోన్ దాడిలో అగ్ర ఇరాన్ జనరల్ ఖాసేం సోలైమానిని హతమార్చినట్టు ప్రకటించారు. అప్పటినుంచి ఇరాన్ అమెరికాపై ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. ఏ క్షణమైన మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్.. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై డజన్ల కొద్ది మిసైళ్లతో దాడి చేసింది. దీంతో మధ్య ఆసియాలో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం కాస్తా చమురు, బంగారం ధరలు సైతం పెరిగేలా ప్రేరేపించింది.
1990-91 రాజకీయాలకు ఒక ప్రారంభ సంవత్సరమైతే, అదే, భారత ఆర్థిక వ్యవస్థకు ఇదొకటిగా చెప్పవచ్చు. ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ 1991 చారిత్రాత్మక బడ్జెట్‌లో ఆర్థిక సంస్కరణలను విడుదల చేయడాన్ని ఓసారి పరిశీలిస్తే.. అప్పటికే ఆర్థిక వ్యవస్థ చెల్లింపుల సంక్షోభంలో ఉన్నట్టుగా గమనించవచ్చు.
ప్రస్తుతం, భారతదేశ స్థూల జాతీయోత్పత్తి ( GDP)11 సంవత్సరాల కనిష్ట స్థాయి 5 శాతంగా నమోదైంది. మరోవైపు ఆర్థిక పరిస్థితి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పటికైనా ఆర్థిక తిరోగమనం నుంచి దేశం గట్టెక్కాలంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ (1991 మాదిరిగానే) ప్రవేశపెడతారో లేదో చూడాలి.