OpenAI Employees Protest : సామ్ ఆల్ట్‌మన్‌ను తిరిగి తీసుకోండి.. లేదంటే మేమంతా వెళ్లిపోతాం : ఓపెన్ఏఐకి ఉద్యోగుల అల్టిమేటం!

OpenAI Employees Protest : ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ తొలగింపుపై కంపెనీలోని ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బోర్డు నిర్ణయాన్ని నిరసిస్తూ 700 మంది ఉద్యోగులు తిరగబడ్డారు. బోర్డు సభ్యులు వెంటనే దిగిపోవాలని లేదంటే తామంతా రాజీనామా చేస్తామని హెచ్చరించారు.

OpenAI Employees Protest : పవర్‌ఫుల్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ సృష్టికర్త సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓపెన్ఏఐ సీఈఓ పదవి నుంచి సామ్ తొలగింపుపై టెక్ ప్రపంచంలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కంపెనీలో పనిచేసే ఇతర ఉద్యోగులంతా ఆల్ట్‌మన్‌కు అండగా నిలిచారు. అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని బోర్డును బెదిరిస్తున్నారు.

ఈ మేరకు ఓపెన్ఏఐకి 700 మంది ఉద్యోగులు వార్నింగ్ లెటర్ పంపారు. మాజీ సీఈఓ ఆల్ట‌మ‌న్ ను తిరిగి చేర్చుకోని పక్షంలో తామంతా ఓపెన్ ఏఐ నుంచి వైదొలిగి మైక్రోసాఫ్ట్‌లో చేరతామని హెచ్చరించారు. ప్ర‌స్తుతం బోర్డు స‌భ్యులుగా ఉన్నవారంతా రాజీనామా చేయాలని, లేదంటే తాము ఉద్యోగంలో కొనసాగేదిలేదని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. దాంతో ఓపెన్ఏఐ భ‌విత‌వ్యంపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి.

Read Also : OpenAI CEO Sam Altman : చాట్‌జీపీటీ క్రియేటర్‌పైనే వేటు.. శామ్‌ ఆల్ట్‌మన్‌‌ను ఓపెన్ఏఐ ఎందుకు తొలగించింది? అసలేం జరుగుతోంది?

సీఈఓ తొలగింపుతో కంపెనీలోని దాదాపు 95 శాతం మంది ఉద్యోగులు నిష్ర్కమిస్తామని ఇలా బెదిరించడం అనేది చాలా అరుదని చెప్పాలి. అలాంటిదే ఇప్పుడు ఓపెన్ఏఐలో జరుగుతోంది. తాజా పరిణామాలను పరిశీలిస్తే.. ఓపెన్ఏఐలో దాదాపు 770 మంది ఉద్యోగులలో దాదాపు 700 మంది ఆల్ట్‌మన్ తిరిగి తీసుకురాకపోతే కంపెనీ నుంచి నిష్క్రమిస్తామని బెదిరించారు. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే తమకు ఉద్యోగాలను కల్పించిందని ఉద్యోగులు చెబుతున్నారు. మరోవైపు, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైతం ఒక ఇంటర్వ్యూలో ఆల్ట్‌మన్ మళ్లీ ఓపెన్‌ఏఐకి తిరిగి వచ్చే అవకాశం ఉందని సూచించాడు.

OpenAI employees Protest 

700 మంది ఓపెన్ఏఐ ఉద్యోగుల హెచ్చరిక :

నివేదిక ప్రకారం.. ఓపెన్ఏఐ కంపెనీలో పనిచేసే 770 మంది ఉద్యోగులలో 700 మందికి పైగా సామ్ ఆల్ట్‌మన్‌ను తిరిగి నియమించకపోతే కంపెనీ నుంచి వైదొలుగుతామని బెదిరిస్తూ లేఖపై సంతకం చేశారు. మైక్రోసాఫ్ట్ తమకు ఇప్పటికే ఉద్యోగాలను కల్పించిందని లేఖలో పేర్కొన్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాత్కాలిక సీఈఓ మీరా మురాటి సహా ఆల్ట్‌మన్ సీఈఓగా తొలగింపులో ప్రధాన పాత్ర పోషించిన ఇల్యా సట్స్‌కేవర్ కూడా ఉద్యోగులు ఇచ్చిన లేఖపై సంతకం చేశారు. ఓపెన్‌ఏఐ నుంచి ఆల్ట్‌మన్ నిష్క్రమించడంలో తాను పోషించిన పాత్రకు చింతిస్తున్నట్లు సట్స్‌కేవర్ ఇటీవల ఒక ట్వీట్‌లో తెలిపారు. ఓపెన్ఏఐ అభివృద్ధికి ఆల్ట్‌మన్ ఎంతో కృషి చేశారని, ఆయన లేని ఈ కంపెనీలో మేం పనిచేయలేమని డైరెక్టర్ల బోర్డుకు రాసిన లేఖలో ఉద్యోగులు స్పష్టం చేశారు.

Read Also : Satya Nadella : సామ్ ఆల్ట్‌మన్‌ను ఓపెన్ఏఐ వద్దు పొమ్మంది.. మైక్రోసాఫ్ట్ పిలిచి ఉద్యోగమిచ్చింది.. సత్యనాదెళ్ల ఏమన్నారంటే?

బోర్డు సభ్యులు వెంటనే రాజీనామా చేయాలి.. :
ఆల్ట్‌మాన్, గ్రెగ్ బ్రోక్‌మన్‌లను బోర్డు నుంచి తొలగింపు నిర్ణయం సరైనది కాదని, ఇలా చేయడం కంపెనీని మరింత బలహీనపరిచిందని తెలిపారు. ఓపెన్ఏఐని పర్యవేక్షించే సామర్థ్యం బోర్డుకు లేదని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల నమ్మకంలేని అసమర్థత వ్యక్తులతో కలిసి పని చేయలేమని తెలిపారు. ఈ క్రమంలోనే ఓపెన్ఏఐకి రాజీనామా చేసి ఆల్ట్‌మన్, బ్రాక్‌మన్ నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్‌లో చేరిపోతామని పేర్కొన్నారు.

ఆల్ట్‌మన్, బ్రాక్‌మాన్‌లను తిరిగి నియమించకపోతే బోర్డు సభ్యులందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత బోర్డు డైరెక్టర్లను తొలగించి వారి స్థానంలో కొత్త లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌లను నియమించాలని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే, ఓపెన్‌ఏఐ ఉద్యోగులందరికీ తమ కంపెనీలో ఉద్యోగాలు రెడీగా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చింది.

OpenAI employees threaten to quit

ఆల్ట్‌మన్ తొలగింపు ఎందుకంటే? :
ఓపెన్ఏఐ బ్లాగ్ పోస్ట్‌లో ఆల్ట్‌మన్ తొలగింపును ప్రకటించింది. బోర్డు నిర్ణయాలకు అడ్డుతగులుతున్నాడని, కంపెనీని నడిపించే అతని సామర్థ్యంపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. అయితే, ఈ విషయాన్ని కంపెనీ ముందుగా తెలియజేయలేదు. గూగుల్ మీట్ సమావేశంలో చివరి నిమిషంలో ఆల్ట్‌మన్ తనపై వేటు పడినట్టు తెలుసుకున్నాడు.

కంపెనీ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మన్‌ను కూడా ఓపెన్ఏఐ బోర్డు నుంచి తొలగించారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని ఆల్ట్‌మాన్, బ్రాక్‌మాన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో సామ్‌కు శుక్రవారం మధ్యాహ్నం బోర్డు సభ్యుడు ఇల్యా సుత్‌స్కేవర్ నుంచి గూగుల్ మీట్‌లో కాల్‌లో చేరమని కోరుతూ టెక్స్ట్ మెసేజ్ వచ్చిందని పేర్కొన్నాడు.

ఆల్ట్‌మన్ కాల్‌లో జాయిన్ అయిన వెంటనే తనను తొలగిస్తున్నట్లు బోర్డు నిర్ణయాన్ని వెల్లడించింది. కొన్ని నిమిషాల తర్వాత, బ్రాక్‌మన్‌కి సట్స్‌కేవర్ నుంచి మరో టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఈ కాల్ సమయంలో, బ్రాక్‌మన్‌ను బోర్డు నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఆల్ట్‌మన్ స్థానంలో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటిని తాత్కాలిక సీఈఓగా నియమించగా.. ఆమె తర్వాత ఎమ్మెట్ షీర్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారని సట్స్‌కేవర్ తెలిపారు.

Read Also : OpenAI Mira Murati : ఎవరీ మీరా మురాటి.. ఓపెన్ఏఐ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు.. 34 ఏళ్ల ఇంజనీర్ ప్రొఫైల్ ఇదిగో..!

ట్రెండింగ్ వార్తలు