Amazon lays off hundreds in its Alexa division as it pushes resources into artificial intelligence
Amazon Alexa Layoffs : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగాల్లో భారీగా కోతలను విధిస్తోంది. కంపెనీలోని అన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై ఒక్కొక్కటిగా వేటు వేస్తోంది. ఇప్పటికే పలు విభాగాల్లోని ఉద్యోగులను తొలగించిన అమెజాన్.. ఇప్పుడు అలెక్సా యూనిట్లో పనిచేసే ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. దాదాపు వందలాది మంది ఉద్యోగులను అలెక్సా వాయిస్ అసిస్టెంట్ యూనిట్ నుంచి ఇంటికి సాగనంపుతోంది.
ఉద్యోగాల్లో కోతకు కారణం ఆర్థికపరమైన ఒడిదుడకులుగా కంపెనీ చెబుతోంది. అందుకే విడతల వారీగా అమెజాన్ తమ ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది. అమెజాన్ ఉద్యోగాల కోతకు సంబంధించి కంపెనీ ఉద్యోగులకు మెయిల్ ద్వారా అలెక్సా, ఫైర్ టీవీ అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ రౌష్ తెలియజేశారు.
అమెజాన్ దాదాపు అన్ని యూనిట్లను కొత్త ఏఐ టెక్నాలజీలోకి మార్పులు చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లోకి మరిన్ని యూనిట్లను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఫలితంగా, కంపెనీ కొన్ని రోల్స్ లో పనిచేసే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా కంపెనీ ఖర్చుల తగ్గింపు, వ్యాపార ప్రాధాన్యత దిశగా ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వాయిస్ అసిస్టెంట్ అలెక్సాను నిర్వహించే యూనిట్‌లో వందలాది ఉద్యోగాలను తొలగిస్తోంది. వ్యాపారపరమైన అభివృద్ధి కోసం జనరేటివ్ ఏఐపై దృష్టి సారించే ప్రయత్నాల్లో భాగంగా ఈ కోతలు విధించక తప్పడం లేదని రౌష్ మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు.
Amazon lays off hundreds Alexa division
అయితే, ఎంతమంది ఉద్యోగులను తొలగించారు అనేది కచ్చితమైన సంఖ్యను ఆయన వెల్లడించలేదు. అమెజాన్, సియాటిల్ ఆధారిత కంపెనీ, జనరేటివ్ ఏఐ ట్రెండ్‌ను ఉపయోగించుకోవడానికి ఇతర టెక్ కంపెనీలతో పోటీపడుతోంది. గత కొన్ని నెలల్లో, అమెజాన్ (AWS) క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లో డెవలపర్‌లు వారి సొంత ఏఐ టూల్స్ రూపొందించడానికి సర్వీసులను అనుమతించింది. అంతేకాదు.. కస్టమర్ రివ్యూల కోసం టెక్నాలజీని అందించడం వరకు అనేక ఏఐ యాక్టివిటీలను అమలు చేసింది. గత సెప్టెంబరులో అమెజాన్ అలెక్సాకు మరింత జనరేటివ్ ఏఐ ఫీచర్లతో ఒక కొత్త అప్‌డేట్ కూడా ఆవిష్కరించింది.
అమెరికా, భారత్, కెనడాల్లోనే ఉద్యోగాల కోతలు :
అమెజాన్ తొలగింపుల ప్రకటనలో ఎక్కువగా అమెరికా, భారత్, కెనడాలోని ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారు. అమెజాన్ గేమింగ్, మ్యూజిక్ టీమ్‌లలో కూడా ఇటీవల ఉద్యోగులను తొలగించింది. గత సంవత్సరంతో కలిపి ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ 27వేల మంది ఉద్యోగులను తొలగించింది. అలెక్సా అమెజాన్ యూనిట్లో కూడా ఉద్యోగాల కోతలను విధిస్తోంది. ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిన అమెజాన్ ఇంకా కోతలను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.