ట్రంప్ సంచలన నిర్ణయం.. టారిఫ్ లకు బ్రేక్.. స్టాక్ మార్కెట్లు రయ్..

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లపై 90రోజుల విరామం ప్రకటించిన తరువాత గురువారం ఆసియా మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి.

Asian markets

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గాడు. అమెరికాకు దిగుమతి అవుతున్న ప్రపంచ దేశాల ఉత్పత్తులపై ఇటీవల ట్రంప్ ప్రతీకార సుంకాలను విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు బుధవారం అమల్లోకి వస్తాయని తొలుత ప్రకటించారు. కానీ, చివరి నిమిషంలో ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఉన్న 10శాతమే అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో భారత్ సహా అనేక దేశాలకు పెద్ద ఊరట కల్పించినట్లయింది.

Also Read: Pharma Tariffs : ట్రంప్ మరో దెబ్బ..! ఈసారి ఫార్మా రంగంపై టారిఫ్‌లు..? హైదరాబాద్ కంపెనీలపై భారీ ఇంపాక్ట్..?

మరోవైపు చైనాపై ప్రతీకార సుంకాలను డొనాల్డ్ ట్రంప్ మరింత పెంపు చేశాడు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. అమెరికాకు ధీటుగా చైనా టారిఫ్ లు విధిస్తుండటంతో ట్రంప్ మరో అడుగు ముందుకేశాడు. చైనా ఉత్పత్తులపై 104శాతం వరకు ప్రతీకార సుంకాలను విధించిన ట్రంప్ తాజాగా ప్రతీకార సుంకాలను 125శాతానికి పెంచారు. చైనాసైతం అమెరికా ఉత్పత్తులపై 84శాతానికి సుంకాలను పెంచింది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. మిగిలిన దేశాలకు ట్రంప్ 90రోజుల ఊరట ఇవ్వటంతో ఆసియా మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి.

Also Read: Trump Tariff : సుంకాలపై ట్రంప్ సంచలన నిర్ణయం.. 90 రోజుల పాటు నిలుపుదల.. చైనాకు బిగ్ షాక్..

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లపై 90రోజుల విరామం ప్రకటించిన తరువాత గురువారం ఆసియా మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. జపాన్ బెంచ్ మార్క్ నిక్కీ 225 ఇండెక్స్ 8శాతం, దక్షిణ కొరియా కోస్పీ ఇండెక్స్ 5శాతం కంటే ఎక్కువ, ఆస్ట్రేలియా ASX 200 కూడా ట్రేడింగ్ ప్రారంభ గంటల్లో 5శాతం పెరిగాయి.

మరోవైపు బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్ భారీగా ర్యాలీ చేసింది. అర్థరాత్రి సమయానికి డౌ జోన్స్ 2,728.97 పాయింట్లు (7.25శాతం) పెరిగి 40,374.56 వద్ద ఉంది. నాస్డాక్ కాంపోజిట్ 1,857.06 పాయింట్లు (12.16శాతం) పెరిగి 17,124.97 వద్దకు చేరుకోగా, ఎస్ అండ్ పీ-500 413.13 పాయింట్లు (9.52శాతం) పెరిగి 5,456.20 వద్దకు చేరుకుంది. చైనా మినహా అన్ని దేశాలకు ట్రంప్ 90 రోజుల సుంకాల విరామం ప్రకటించిన తర్వాత ఈ మార్పు కనిపించింది.