Pharma Tariffs : ట్రంప్ మరో దెబ్బ..! ఈసారి ఫార్మా రంగంపై టారిఫ్‌లు..? హైదరాబాద్ కంపెనీలపై భారీ ఇంపాక్ట్..?

ఔషధ కేంద్రమైన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ ఔషధాల సరఫరాదారు. ప్రపంచ మార్కెట్లలో 20% వాటాను కలిగి ఉంది.

Pharma Tariffs : ట్రంప్ మరో దెబ్బ..! ఈసారి ఫార్మా రంగంపై టారిఫ్‌లు..? హైదరాబాద్ కంపెనీలపై భారీ ఇంపాక్ట్..?

Updated On : April 9, 2025 / 6:50 PM IST

Pharma Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ కంటిన్యూ అవుతోంది. అమెరికా నుంచి భారీ ఎత్తున సుంకాలు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తున్న ట్రంప్.. పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం విదితమే. తమ దేశం విధించే సుంకాలకు అనుగుణంగానే ఆయా దేశాలపై తాను టారిఫ్ లు వసూలు చేస్తున్నట్లు ట్రంప్ వివరించారు. ఇప్పటికే పలు దేశాలు, పలు రంగాలపై సుంకాలు విధించి బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్.. నెక్ట్స్ టార్గెట్ ఫార్మా రంగంపైనే అని తెలుస్తోంది. త్వరలో ఫార్మా రంగంపైనా సుంకాలు విధించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరస్పర సుంకాల ఉత్తర్వు నుండి ఔషధాలను మినహాయించిన తర్వాత భారతదేశం ఊపిరి పీల్చుకుంది. అయితే, ఔషధ దిగుమతులపైనా సుంకాలు విధించేందుకు సమయం సమీపిస్తున్నట్లు ట్రంప్ చెప్పడంతో ఆందోళనలు మొదలయ్యాయి.

”మేము త్వరలోనే ఔషధాలపై భారీ సుంకాన్ని ప్రకటించబోతున్నాం. అలా చేసిన తర్వాత, వారు మన దేశంలోకి వేగంగా తిరిగి వస్తారు, ఎందుకంటే మనది పెద్ద మార్కెట్” అని ట్రంప్ రిపబ్లికన్ కార్యక్రమంలో అన్నారు. దేశీయ ఔషధ ఉత్పత్తి లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ప్రతిపాదిత సుంకాలు ఫార్మా కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికాకు మార్చడానికి ప్రోత్సహిస్తాయని ట్రంప్ అన్నారు. ”ఈ కంపెనీలు తమ ఉత్పత్తులను చైనాలో లేదా మరెక్కడా కాకుండా ఇక్కడే, అమెరికాలో తయారు చేయాలని మేము కోరుకుంటున్నాము” అని ట్రంప్ స్పష్టం చేశారు.

Also Read : చెప్పినట్లే చేసిండు..! చైనాకు బిగ్ షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. 104శాతంకు సుంకాలు పెంపు..

త్వరలో ఫార్మా రంగంపై సుంకాలు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అదే కనుక జరిగితే.. భారత దేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? అనే చర్చ మొదలైంది.

సుంకాలు భారతదేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?
ప్రతిపాదిత సుంకాలు భారత దేశాన్ని మాత్రమే కాకుండా, అమెరికన్ పౌరులను కూడా ప్రభావితం చేస్తాయి. ఔషధ కేంద్రమైన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద జనరిక్ ఔషధాల సరఫరాదారు. ప్రపంచ మార్కెట్లలో 20% వాటాను కలిగి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, అమెరికాకు భారతదేశం ఔషధ ఎగుమతులు 9.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

అమెరికా జనరిక్ ఔషధాల కోసం భారతదేశంపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఆ దేశం నుండి దాదాపు 45% దిగుమతి చేసుకుంటుంది. భారతదేశంలోని అగ్రశ్రేణి ఫార్మా దిగ్గజాలు అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారా తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని సంపాదిస్తాయి. అంచనాల ప్రకారం, భారతీయ ఫార్మా వ్యాపారంలో 50% కంటే ఎక్కువ అమెరికా నుండి వస్తుంది.

అందువల్ల, సుంకాలు భారతీయ ఫార్మా కంపెనీలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పటికీ, అవి అమెరికన్ వినియోగదారులను కూడా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే ఇది జనరిక్స్ ధరలను పెంచుతుంది. భారతీయ సంస్థలకు ఉత్పత్తి ఖర్చులు పెరగడం, ఇతర దేశాల ప్రత్యర్థులతో పోలిస్తే వాటి ధరల పోటీతత్వం దెబ్బతింటుంది.

Also Read : ట్రంప్‌ 104% టారిఫ్‌పై చైనా ప్రతిస్పందన.. సుంకాలు ఎంతగా పెంచేసిందంటే? టారిఫ్‌లతో ఫుట్‌బాల్‌ ఆడుతున్నట్లు..

ఒక నివేదిక ప్రకారం, అమెరికాకు దిగుమతులపై సుంకాలు విధిస్తే, తక్కువ ధర గల జనరిక్ ఔషధాల ధర ఒక్కో మాత్రకు 0.12 డాలర్ల వరకు పెరుగుతుంది. అంటే.. సంవత్సరానికి దాదాపు 42 డాలర్లు (రూ. 3,700) అదనపు ఖర్చు అవుతుంది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే వాటితో సహా ఖరీదైన మందులు 10వేల డాలర్ల వరకు పెరగవచ్చు.

ఫార్మా రంగంపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ హైదరాబాద్ పైనా పడనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా హబ్ గా గుర్తింపు పొందింది. అమెరికా సహా ప్రపంచంలోని చాలా దేశాలకు హైదరాబాద్ నుంచి ఔషధాలు ఎక్స్ పోర్ట్ అవుతాయి. కాబట్టి హైదరాబాద్ లో ఉండే ఫార్మా కంపెనీలపైనా ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ చాలా గట్టిగా పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ప్రపంచ ప్రజలకు సరసమైన ధరల్లో మందులు అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో భారతదేశం ప్రపంచ అవసరాల్లో 60శాతం వ్యాక్సిన్లు, 20శాతం జెనరిక్ మందులు సరఫరా చేస్తోంది. గత పదేళ్లలో భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల విలువ రెట్టింపు అయింది. 2014లో 15 బిలియన్ డాలర్లు ఉన్న ఫార్మా ఎగుమతులు, 2024 నాటికి 27.85 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

హైదరాబాద్ బల్క్ డ్రగ్ క్యాపిటల్ గా, వ్యాక్సిన్ క్యాపిటల్ గా ఎదుగుతోంది. 800కి పైగా ఫార్మా, బయోటెక్, మెడిటెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్క్ వంటి సంస్థలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా అభివృద్ధి చెందుతున్నాయి.

దేశ ఫార్మా రంగంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలోని ఫార్మా ఆదాయంలో 35 శాతం, బల్క్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 40 శాతం ఆదాయం హైదరాబాద్​ సిటీ నుంచే వస్తోంది. ప్రపంచ ఫార్మసీ, హాస్పిటల్స్ ​హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఈ పరిస్థితుల్లో ఫార్మాపై ట్రంప్ టారిఫ్ లు విధిస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో చూడాలి.