Gold Silver Prices : బంగారం, వెండి ధరలు భారీగా తగ్గబోతున్నాయా..? కేంద్రం రంగంలోకి..? అసలు విషయం ఇదే..
Gold Silver Prices : బంగారం, వెండి ధరలను స్థిరీకరించడానికి, వాటి అస్థిరతను తగ్గించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో ప్రశ్నించగా..
Gold Silver Prices Decreased
Gold Silver Prices : బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతోపాటు.. రూపాయి విలువ పడిపోతున్న క్రమంలో గోల్డ్, సిల్వర్ రేట్లు అమాంతం పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, త్వరలో వీటి ధరలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టినట్లు సమాచారం.
భారతదేశంలో బంగారం, వెండిని కేవలం లోహాలుగా మాత్రమే కాదు.. పొదుపు, భద్రత, సంప్రదాయానికి చిహ్నంగా భావిస్తారు. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో బంగారం, వెండి కొనుగోళ్లు తగ్గాయి. అయిన్పటికీ.. వీటి ధరలు పెరగడం వలన దిగుమతి బిల్లు మాత్రం భారీగా పెరిగింది.
బంగారం, వెండి ధరలను స్థిరీకరించడానికి, వాటి అస్థిరతను తగ్గించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ఓ సభ్యుడు ప్రశ్నించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వద్ద ఉన్న బంగారం నిల్వలు ధరల స్థిరత్వాన్ని పెంచడంలో, రూపాయిపై విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో ఏమైనా పాత్ర పోషిస్తాయా అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వమని కోరారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వివరణ ఇస్తూ.. విలువైన లోహాల ధరలు మార్కెట్ పరిస్థితుల ద్వారా నిర్ణయించబడతాయని చెప్పారు. ధరలను నిర్ణయించడంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే బంగారం, వెండి ధరలు ఉంటాయని ఆయన తెలిపారు.
పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రభుత్వ డేటా ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 9.15 లక్షల కిలోల బంగారాన్ని దిగుమతి చేసుకుంటే.. 2024-25 నాటికి అది 7.57 లక్షల కిలోలకు తగ్గింది. అంటే పదేళ్లలో బంగారం దిగుమతి 17.3శాతం తగ్గింది. అయితే, తక్కువ బంగారం కొనుగోలు చేసినప్పటికీ చెల్లింపులు ఎక్కువగా చేయాల్సి వచ్చింది. బంగారం దిగుమతి బిల్లు 2024-25లో దాదాపు 69శాతం పెరిగి 58 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.
మరోవైపు.. వెండి దిగుమతుల్లో కూడా ఇదే ధోరణి కనిపించింది. 2024-15లో 77.1 లక్షల కిలోల వెండి దిగుమతి అయితే, 2024-25 నాటికి ఇది 51.6 లక్షల కిలోలకు తగ్గింది. పరిమాణంలో ఇది 33శాతం పతనం అయింది. వెండి దిగుమతుల విలువ మాత్రం కొద్దిగా పెరిగింది. ఇది అధిక ప్రపంచ ధరలను సూచిస్తుంది.
దేశంలో బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ ధరలు, రూపాయి – డాలర్ మారకం రేటు, పన్నుల ద్వారా నిర్ణీతమవుతాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధిపై ఉన్న అనిశ్చితి కారణంగా ధరలు పెరిగాయి. కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు సురక్షిత ఆశ్రయం డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు తోడ్పడ్డాయి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వద్ద ఉన్న బంగారం నిల్వలు కూడా ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇస్తాయి. 2025 మార్చి 31 నాటికి ఆర్‌బిఐ 879.58 టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. ఈ నిల్వలు రూపాయిపై విశ్వాసాన్ని పెంచి, దేశ బాహ్య స్థిరత్వాన్ని మెరుగుపరుస్తాయని ప్రభుత్వం తెలియజేసింది.
