EV Car Servicing Guide : మీకు ఎలక్ట్రిక్ కారు ఉందా? సర్వీసింగ్ సమయంలో ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. తప్పక గుర్తుంచుకోండి.. కంప్లీట్ గైడ్..!
EV Car Servicing Guide : ఎలక్ట్రిక్ కార్ల సర్వీసింగ్ చేయడం ఇంజిన్ కార్ల కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ కారుకు సర్వీసింగ్ చేసేటప్పుడు మీరు ఏం గుర్తుంచుకోవాలో తెలుసా?

Electric Car Servicing Guide:భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల (EV) సంఖ్య వేగంగా పెరుగుతోంది. చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోతున్నారు. కొత్త ఈవీ కార్లను కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లకు సర్వీసింగ్ చేసే విధానం సాంప్రదాయ పెట్రోల్ లేదా డీజిల్ కార్ల కన్నా చాలా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే.. ఈ కార్లకు ఇంజిన్ ఉండదు. కేవలం బ్యాటరీ మాత్రమే ఉంటుంది.

అయితే, మీ కారు చాలా కాలం పాటు మంచి కండిషన్‌లో నడిచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు కూడా ఎలక్ట్రిక్ కారు ఉందా? అయితే, సర్వీసింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. చాలామంది ఈవీ కార్ల ఓనర్లు సర్వీసింగ్ సమయంలో పెద్దగా పట్టించుకోరు. కొన్ని విషయాల పట్ల అవగాహన ఉండదు. సర్వీసింగ్ సమయంలో ఏయే విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. కారు బ్యాటరీని చెక్ చేసుకోండి : ఎలక్ట్రిక్ కారుకు బ్యాటరీ అనేది హార్ట్ లాంటిది. కారుకు అత్యంత పవర్ అందిస్తుంది. కారు సర్వీస్ సమయంలో బ్యాటరీని చెక్ చేయండి. టెక్నీషియన్ బ్యాటరీ కూలింగ్ సిస్టమ్‌ను క్షుణ్ణంగా చెక్ చేశారో లేదో తెలుసుకోండి. ఎల్లప్పుడూ బ్యాటరీ ప్యాక్ పర్ఫార్మెన్స్, లైఫ్ టైమ్ కూడా చెక్ చేయండి. అలాగే, కూలెంట్ లెవల్ కూడా చెక్ చేయండి.

2. బ్రేక్ సిస్టమ్ జాగ్రత్త.. : సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉపయోగిస్తాయి. మీరు బ్రేక్ వేసినప్పుడు జనరేట్ అయ్యే పవర్ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు విద్యుత్తుగా కన్వర్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ కార్లలో బ్రేకింగ్ కూడా బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. సర్వీస్ సమయంలో కారు బ్రేక్ సిస్టమ్‌ను చెక్ చేయడం కూడా చాలా ముఖ్యం. సేఫ్టీతో పాటు అలాగే బ్యాటరీ ఛార్జింగ్‌కు చాలా అవసరం. అలాగే, బ్రేక్ ఫ్లూయిడ్ లెవల్ కూడా చెక్ చేయండి.

3. మోటారును చెక్ చేయండి : ఎలక్ట్రిక్ మోటారును చెక్ చేయడం చాలా ముఖ్యం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏవైనా అసాధారణ శబ్దాలు లేదా పర్ఫార్మెన్స్ తగ్గడాన్ని గమనించండి సర్వీసింగ్ చేసే ముందు వాటిని మెకానిక్‌కు చెప్పండి. సర్వీసింగ్ సమయంలో మోటార్ మౌంట్‌లు అన్ని కేబుల్‌లు సేఫ్ కండిషన్‌లో ఉన్నాయని నిర్ధారించుకోండి.

4. టైర్లు, సస్పెన్షన్ : బ్యాటరీ ప్యాక్ కారణంగా ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువ బరువు ఉంటాయి. టైర్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.

టైర్ చెక్ : కారు సర్వీస్ సమయంలో టైర్లను చెక్ చేయండి. టైర్ల కండిషన్, పీడనం , ట్రెడ్ డెప్త్‌ను చెక్ చేయండి. అలాగే, ఏదైనా ఒక టైర్ లేదా ముందు లేదా బ్యాక్ టైర్లు ఎక్కువగా అరిగిపోయినట్లయితే వాటిని తిప్పండి. అంటే, ముందు టైర్లను వెనుక భాగంలో వెనుక టైర్లను ముందు భాగంలో మార్చండి.

సస్పెన్షన్ : కారులో సౌకర్యవంతమైన రైడ్ కోసం మంచి సస్పెన్షన్ తప్పనిసరి. కారులో షాక్ అబ్జార్బర్‌లు మూవ్ అవుతున్న సమయంలో చాలా ఒత్తిడిని ఎదుర్కొంటాయి. రైడ్ సౌకర్యవంతంగా ఉండేలా సస్పెన్షన్ పార్టులను చెక్ చేయండి.
