Wrong Route Driving: రాంగ్ రూట్‌లో వెళ్తున్నారా? ఇక నుంచి మీకు ఉంటది..! పట్టుబడితే
కొన్ని సార్లు ఏ తప్పు చేయకపోయినా అమాయకులు సైతం చనిపోతున్నారు.
Wrong Route Driving: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సార్లు ఏ తప్పు చేయకపోయినా అమాయకులు సైతం చనిపోతున్నారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమే దీనికి ప్రధాన కారణం. కొందరు వాహనదారులు మితిమీరుతున్నారు. అడ్డగోలుగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ప్రమాదాలకు కారణం అవుతున్నారు. తమ ప్రాణాలను తీసుకోవడంతో పాటు ఎదుటి వారి ప్రాణాలూ తీస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. సగటున 74 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 20 మంది వరకు చనిపోతున్నారు. ఇక ట్రాఫిక్ ఉల్లంఘనల సంగతి సరేసరి. 72 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. దీనిపై పోలీస్ శాఖ అలర్ట్ అయ్యింది. రోడ్డు ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టింది. ట్రాఫిక్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయగలిగితే చాలావరకు ప్రమాదాలు నివారించవచ్చని భావిస్తోంది.
ఇప్పటికే ఎరైవ్ ఎలైవ్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టిన పోలీస్ శాఖ.. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాలు మరింత ఎక్కువ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు నిబంధనలు ఉల్లంఘించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యింది.
ప్రస్తుతం రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు నడిపే వారు ఎక్కువైపోయారు. సిగ్నల్ పడినా పట్టించుకోవడం లేదు. పైగా యమ స్పీడ్ గా నడుపుతున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. హైవేలపై పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొందరు రాంగ్ రూట్లో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు.
గత ఏడాది సగటున రోజుకు రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు 52 వేలు నమోదవగా.. ఈ ఏడాది 20వేలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పటిష్ఠ పర్యవేక్షణతోనే ఉల్లంఘనలు, తద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చని పోలీస్ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇకపై అతి వేగంగా వాహనాలు నడుపుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నారు. హైవేలపై రాంగ్‌రూట్ లో వచ్చే వాహనాలను సీజ్ చేసే అవకాశాలనూ పరిశీలిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడాన్నీ తీవ్రంగా పరిగణించనున్నారు. మరోవైపు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలతో మాట్లాడించడం ద్వారా వారు అనుభవిస్తున్న క్షోభ మరెవరికీ రాకూడదన్న మేసేజ్ ఇవ్వాలని పోలీస్ శాఖ భావిస్తోంది.
సో.. ఇకపై వాహనదారులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిదే. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు మరి.
Also Read: ట్రెండింగ్‌లో ‘సేవ్ ఆరావళి’.. ఈ పర్వతాల ఉనికిపై ఆందోళన ఎందుకు..? సుప్రీంకోర్టు ఏం చెప్పింది..
