Elon Musk : జీతం పెంచకపోతే మానేస్తా.. ధమ్కీ ఇస్తున్న ఎలాన్ మస్క్.. టెస్లా బాస్ అన్నంత పనిచేస్తాడా?
Elon Musk : బిలియనీర్ ఎలన్ మస్క్ నిజంగానే టెస్లాను విడిచిపెడతాడా? ఒక ట్రిలియన్ డాలర్ల వేతనాన్ని వాటాదారులు ఆమోదిస్తారా? టెస్లా భవిష్యత్తు ఏంటి? పూర్తి వివరాలివే..
Elon Musk Tesla
Elon Musk : టెస్లా బాస్ ఉద్యోగం మానేస్తాడట.. తనకు జీతం పెంచకపోతే కంపెనీకి గుడ్ బై చెప్పేస్తానని అంటున్నాడు.. టెస్లా కార్ల కంపెనీని ప్రపంచ మార్కెట్లో నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టిన టెక్ బిలియనీర్ మస్క్ మామ జీతం విషయంలో గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడు.. వాటాదారులు తనకు ఒక ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఆమోదించకపోతే బయటకు వెళ్లిపోతా అంటూ ధమ్కీ ఇస్తున్నాడు..
వచ్చే నవంబర్ నవంబర్ 6న కంపెనీ (Elon Musk) వార్షిక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మస్క్ ప్రతిపాదించిన ఒక ట్రిలియన్ డాలర్లు పేమెంట్ డీల్ వాటాదారులు అంగీకరించని పక్షంలో అన్నంత పనిచేస్తాడని టెస్లా బోర్డు చైర్ రాబిన్ డెన్‌హోమ్ హెచ్చరించారు.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. మస్క్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని రాబిన్ పెట్టుబడిదారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. టెస్లా భవిష్యత్తు బాగుండాలంటే మస్క్ నాయకత్వంలో నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. కనీసం రాబోయే ఏడున్నర ఏళ్లు మస్క్ టెస్లాను నడిపించేలా రూపొందించామని రాబిన్ లేఖలో ప్రస్తావించారు. ఈ కొత్త ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదంపైనే ఆధారపడి ఉందని రాబిన్ హెచ్చరించారు.
టెస్లాకు మస్క్ నాయకత్వం అవసరం :
కంపెనీ భవిష్యత్తుకు మస్క్ నాయకత్వం చాలా కీలకమని తెలిపారు. తనను సీఈఓగా కొనసాగించేందుకు సరైన ప్యాకేజీ లేకుండా టెస్లా సమయం, ప్రతిభతో పాటు దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీలోకి విస్తరించాలని లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో కంపెనీకి మస్క్ సహకారం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు.
ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం.. టెస్లా 8.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించడమే కాకుండా స్వయంప్రతిపత్త వ్యవస్థలు, రోబోటిక్స్‌లో పురోగతి వంటి ప్రధాన లక్ష్యాలను సాధిస్తే మస్క్‌కు 12 ప్రత్యేక దశల్లో స్టాక్ ఆప్షన్లు మంజూరు అవుతాయి. కంపెనీ విజయం, వాటాదారుల ప్రయోజనాల ఆధారంగా ఈ ప్రణాళిక మస్క్‌కు లాభదాయకంగా ఉంటుందని డెన్‌హోమ్ తెలిపారు.
అంతేకాదు.. మస్క్‌తో సన్నిహితంగా పనిచేసిన ముగ్గురు డైరెక్టర్లను కూడా తిరిగి ఎన్నుకోవాలని ఆయన పెట్టుబడిదారులను కోరారు. అయితే, కొంతమంది వాటాదారులు, నిపుణులు టెస్లా బోర్డును విమర్శించారు. బోర్డు మస్క్ నుంచి పూర్తిగా స్వతంత్రంగా లేదని విశ్వసిస్తున్నారు.
మస్క్ పేమెంట్ డీల్ రద్దు :
ఈ ఏడాది ప్రారంభంలో డెలావేర్ కోర్టు మస్క్ 2018 పేమెంట్ డీల్ రద్దు చేసింది. పూర్తిగా స్వతంత్రంగా లేని డైరెక్టర్లు ఈ బోర్డును నిర్వహించారని తీర్పునిచ్చింది. ప్రముఖ సలహా సంస్థలు, పెట్టుబడిదారుల సంఘాలు వాటాదారులను ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేయమని కోరాయి. మరి అతిగా ఉందని, టెస్లా బోర్డు మస్క్‌తో న్యాయంగా చర్చలు జరిపేందుకు సుముఖంగా లేరని అన్నారు. బోర్డు తరచుగా వాటాదారుల ప్రయోజనాల కన్నా మస్క్ ప్రయోజనాల కోసం వ్యవహరించిందని విమర్శకులు అంటున్నారు.
టెస్లాకు ఇదేం ఫస్ట్ టైమ్ కాదు :
మస్క్ జీతం విషయంలో టెస్లా ఎదురుదెబ్బలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో డెలావేర్ కోర్టు 2018 వేతన ఒప్పందాన్ని కొట్టివేసింది. సీఈఓతో చాలా సన్నిహితంగా ఉన్న బోర్డు దానిని సరిగ్గా మంజూరు చేయలేదని తీర్పు చెప్పింది. అదే సమయంలో టెస్లా బాస్ (CFO)ని అడ్డుకుని పెట్టుబడిదారులను ఈ ప్లాన్ మద్దతు ఇవ్వమని వ్యక్తిగతంగా కోరాడు.
ప్రస్తుతానికి, టెస్లా భవిష్యత్తు, మస్క్ రోల్‌పై ఉత్కంఠ నెలకొంది. వాటాదారులు ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లయితే కంపెనీ కీలక వ్యక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ, వాటాదారులు ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే మాత్రం కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద వేతన ప్యాకేజీలలో ఇదొకటి కానుంది.
