EPFO Aadhaar Card : ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన.. ఇకపై పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డు పనికిరాదు.. వ్యాలీడ్ డాక్యుమెంట్లు ఇవే..!

EPFO Aadhaar Card : ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్.. ఇకపై ఆధార్ కార్డు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంగా పనిచేయదు.. ఏయే డాక్యుమెంట్లు చెల్లుబాటు అవుతాయో తెలుసా?

EPFO Aadhaar Card : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఆధార్ కార్డు విషయంలో కీలక ప్రకటన చేసింది. పుట్టిన తేదీ (DOB) రుజువుగా ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుంచి ఆధార్ కార్డును తొలగించింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నుంచి వచ్చిన ఆదేశాల అనంతరం పుట్టిన తేదీకి ఆమోదయోగ్యమైన పత్రంగా ఆధార్ కార్డ్‌ను తొలగించినట్టు ఈపీఎఫ్ఓ తెలిపింది.

ఈ మేరకు జనవరి 16న జారీ చేసిన సర్క్యులర్‌లో ఆధార్ అనేది ప్రాథమికంగా గుర్తింపు ధృవీకరణ మాత్రమేనని, అది పుట్టిన తేదీకి రుజువు కాదని ​​పేర్కొంది. ఈ సర్క్యులర్‌కు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (CPFC) నుంచి అనుమతి లభించింది. ఇటీవలి కొన్ని కోర్టు తీర్పులు కూడా ఆధార్‌ను పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించలేమని తేల్చిచెప్పేశాయి.

Read Also : EPFO Credit Interest : మీ అకౌంట్లో ఈపీఎఫ్ఓ వడ్డీ డబ్బులు పడ్డాయా? ఆన్‌లైన్‌లో పీఎఫ్ బ్యాలెన్స్‌ చేసుకోండి.. ఇదిగో ప్రాసెస్!

ఇక నుంచి ఆధార్ కార్డును వయసు నిర్ధారణకు వినియోగించరాదని ఈపీఎఫ్ఓ సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. పుట్టిన తేదీ రుజువుగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ల జాబితాను కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి యూఐడీఏఐ నుంచి కాపీ జతచేసిన లేఖ అందినట్టు తెలిపింది.

అందులో ఆధార్‌ను పుట్టిన తేదీ రుజువుగా ఉపయోగించడం, ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీని ప్రకారం.. జెడీ ఎస్‌ఓపి (JD SOP)లోని అనుబంధం-1 టేబుల్-బిలో ప్రస్తావించిన విధంగా పుట్టిన తేదీలో దిద్దుబాటు కోసం ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుంచి ఆధార్‌ను తొలగిస్తున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొంది.

EPFO Aadhaar Card As Date Of Birth Proof

ఈపీఎఫ్ఓకు పుట్టిన తేదీ రుజువుగా చెల్లుబాటు అయ్యే పత్రాలివే :

  • ఏదైనా గుర్తింపు పొందిన ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్సిటీ జారీ చేసిన మార్క్‌షీట్.
  • స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (SLC)/ స్కూల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)/ SSC సర్టిఫికేట్ పేరు, పుట్టిన తేదీని కలిగి ఉండాలి.
  • సర్వీస్ రికార్డుల ఆధారంగా సర్టిఫికేట్
  • పాన్ కార్డ్
  • కేంద్ర/రాష్ట్ర పెన్షన్ చెల్లింపు ఆర్డర్
  • ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం
  • పాస్‌పోర్ట్
  • ప్రభుత్వ పెన్షన్
  • సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్

ముఖ్యంగా, ఆధార్ కార్డు అనేది భారత ప్రభుత్వం తరపున యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసిన 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. ఈ ఆధార్ నంబర్ దేశంలో ఎక్కడైనా గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్‌గా పనిచేస్తుంది.

అసలు కారణం ఇదే  :
ఆధార్‌ కార్డులపై ఇటీవలే యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 22న దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆధార్‌ నంబర్‌ వ్యక్తిగత గుర్తింపుగా మాత్రమే ఉపయోగించాలని సూచించింది. కానీ, పుట్టినతేదీ నిర్ధారణకు రుజువుగా వినియోగించలేమని యూఐడీఏఐ స్పష్టం చేసింది.

ఎందుకంటే.. సాధారణంగా ఆధార్‌ కార్డులో అనేక మార్పులుచేర్పులు చేసుకునే వీలుంది. ముఖ్యంగా ఆధార్‌లోని పుట్టిన తేదీ వివరాలను తరచూ మార్చుకునే అవకాశం ఉంది. అందుకే.. ఖాతాదారుల పుట్టినతేదీ నిర్ధారణకు ఆధార్‌ ధ్రువీకరణ పత్రంగా పనికిరాదని యూఐడీఏఐ పేర్కొంది.

ఈపీఎఫ్ఓ సభ్యులకు గమనిక :
యూఐడీఏఐ ఆదేశాల ప్రకారం.. ఈపీఎఫ్‌ ఖాతాదారులు ఇకపై పుట్టినతేదీ ధ్రువీకరణకు ఆధార్‌ కార్డును వినియోగించరాదు. ఈపీఎఫ్‌ ఖాతాదారులు ఇకపై పుట్టిన తేదీ ధ్రువీకరణకు ఆధార్‌‌కు బదులుగా ఇతర ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్‌ అనేది కేవలం వ్యక్తిగత గుర్తింపు కార్డుగా మాత్రమేనని ఈపీఎఫ్ఓ ఖాతాదారులు గమనించాలి. పీఎఫ్ ఆఫీసుకు వెళ్లే సమయంలో లేదా ఆన్‌లైన్‌లో పీఎఫ్ కోసం అప్లయ్ చేసేటప్పుడు ఆధార్‌ కార్డు స్థానంలో ఇతర వ్యాలీడ్ డాక్యుమెంట్లను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

Read Also : Aadhaar Address Update : మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా అప్‌‌డేట్ చేసుకోవాలో తెలుసా? పూర్తి ప్రాసెస్ మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు