Electric Scooters : పేలుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఈ జాగ్రత్తలు పాటించండి

ఈ బైక్స్‌లో ఎక్కువగా ప్రమాదాలకు కారణం.. ఇందులోఅమర్చే లిథియం అయాన్ బ్యాటరీలే ! ఈ బ్యాటరీలతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పు ఉంటుంది. లిథియం అయాన్‌ బ్యాటరీలతో...

Exploding Electric Scooters : రాష్ట్రమేదైనా.. ప్రాంతమేదైనా.. ఎలక్ట్రిక్‌ వాహనాలంటే పేలుళ్లే కనిపిస్తున్నాయి. పేలుడుకు, మంటలకు ఎలక్ట్రిక్‌ వాహనాలు పర్యాయపదాలుగా మారిపోతున్నాయి. మొన్న తమిళనాడు, నిన్న నిజామాబాద్‌.. ఇవాళ విజయవాడలో జరిగిన ఘటనలే దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. పెట్రో ధరల మంటతో ఎంతో ఆశగా ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు చూసిన ప్రజలకు..ఆ ఆశలన్నీ ఎలక్ట్రిక్‌ బైక్‌ల మంటల్లో తగలబడిపోతున్నాయి. నెల రోజుల ముందు వరకు ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌పై ప్రజలకున్న అభిప్రాయం వేరు… ఇప్పుడు ఈ-వాహనాలపై వారి ఆలోచనలు వేరు..! ఒకటా.. రెండా.. ఈ నెల రోజుల్లో పదుల సంఖ్యలో ఎలక్ట్రిక్‌ వాహనాలు పేలిపోయాయి. దీనికి కారణాలు ఎన్ని ఉన్నా.. లీటర్‌ పెట్రోల్ 120దాటిన సమయంలో ఇలా వరసపెట్టి ఎలక్ట్రిక్‌ స్కూటర్లు పేలిపోవడం వాహనాదారులకు పెద్ద షాక్‌. ఇక వరుస ఘటనలతో ఇప్పటికే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఆర్డర్లు ఇచ్చిన వారు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. ఎండాకాలంలో ఇలాంటి ప్రమాదాలు సర్వ సాధారణంగానే జరుగుతుంటాయి. కానీ ఈ స్థాయిలో ప్రమాదాలు జరగడం ఇదే తొలిసారి కావొచ్చు. ఓ కంపెనీకి చెందిన ఒకే మోడల్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌లో ప్రమాదాలు జరుగుతున్నాయంటే.. సాంకేతిక లోపం అని ఓ అంచనాకు రావొచ్చు. కానీ రెండు కంపెనీలు, డిఫరెంట్‌ మోడల్స్‌.. అయినా ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. అయితే ఆయా కంపెనీలకు చెందిన బైకుల్లో ఉండే బ్యాటరీల్లోనే సమస్య ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read More : Electric Vehicle Blast: మరో విద్యుత్ ద్విచక్ర వాహనం పేలుడు: వ్యక్తి మృతి, ముగ్గురికి గాయాలు

ప్రమాదాలకు కారణం : –
ఈ బైక్స్‌లో ఎక్కువగా ప్రమాదాలకు కారణం.. ఇందులోఅమర్చే లిథియం అయాన్ బ్యాటరీలే ! ఈ బ్యాటరీలతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పు ఉంటుంది. లిథియం అయాన్‌ బ్యాటరీలతో ఉపయోగాలు చాలానే ఉన్నా, అదే సమయంలో అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలే పోతాయి. ఈ బ్యాటరీలను వందల సార్లు ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. మిగతా బ్యాటరీలతో పోలిస్తే, వీటిలో ఉపయోగించే లోహాల ప్రమాదకర స్థాయిలు కూడా తక్కువే. అలాగని ఇవి పూర్తిగా సురక్షితం కూడా కావని నిపుణులు వెల్లడిస్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీల్లో రెండు ఎలక్ట్రిక్ టెర్మినళ్లు ఉంటాయి. వీటి మధ్య ఎలక్ట్రోలైట్ ద్రావణం ఉంటుంది. ఈ ఎలక్ట్రోడ్‌ల మధ్య నుండే ఎలక్ట్రోలైట్ ద్రావణం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పుంటుంది. బ్యాటరీ దెబ్బ తిన్నప్పుడు, విపరీతంగా వేడెక్కినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి బ్యాటరీలను విమానాల్లోకి అనుమతించరు.

Read More : Electric Vehicles : షాకింగ్ న్యూస్, ఎలక్ట్రిక్ వాహన ధరలు పెరుగుతాయా?

 

జాగ్రత్తలివే : –

రాత్రి మొత్తం ఛార్జింగ్ పెట్టి ఉంచకూడదు
బైక్‌ను ఎండలో పార్క్ చేయకూడదు
ఓవర్‌ ఛార్జింగ్ చేసినా ప్రమాదమే
చార్జింగ్ పెట్టే చోట స్మోక్ డిటెక్టర్ తప్పనిసరి
బ్యాటరీకి తగిన బ్రాండ్‌ చార్జర్‌నే వాడాలి
ఈ-బైక్ బ్యాటరీలను ఐదేళ్లకోసారి మారిస్తే బెటర్

సెకండ్‌ హ్యాండ్‌ బ్యాటరీలు వాడడం డేంజర్
రాత్రి పూట బైక్‌కి ఛార్జింగ్‌ పెట్టి వదిలేయడం ప్రమాదం
ఇంటికి ఎర్త్‌ వైర్‌ లేకపోతే ఛార్జింగ్‌ పెట్టద్దు
ఓల్టేజ్‌ హెచ్చుతగ్గులు ఉన్న సమయంలో ఛార్జ్‌ పెట్టద్దు
వాహనం చుట్టూ తగిన వెంటిలేషన్‌ ఉండాలి

వాహనం తప్పనిసరిగా డ్రైగా ఉండాలి
వాహనం కడిగిన వెంటనే చార్జ్‌ చేయకూడదు
బ్యాటరీ చార్జ్‌ చేసే సమయంలో సమస్య ఎదురైతే నీళ్లు పోయకూడదు
మంటలు ఆర్పడానికి ఫైర్‌ ఎక్ట్సింగ్విషర్లను మాత్రమే వాడాలి
మంటలు అంటుకున్న వెంటనే పవర్‌ సప్లయ్‌ ఆపేయాలి

కేంద్రం కొత్త నిబంధనలు : –
మరోవైపు కొన్ని కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో కేంద్రం ఈవీలలో ఉపయోగించే బ్యాటరీల నాణ్యతకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే పనిలో పడింది. ఈవీ బ్యాటరీల కోసం కొత్త విధానాన్ని రూపొందించి ఎలక్ట్రిక్ వాహనాలు సురక్షితమేనన్న అభిప్రాయం కలిగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసలు కేంద్రం నుంచి పక్కా మార్గదర్శకాలు ఎప్పుడొస్తాయన్న దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ వాహనాలకు కొనేందుకు సిద్ధంగా ఉన్న వాళ్లు.. వాటిని కొనాలో.. వద్దో తెలియని గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన వాళ్లు వాటిని బయటకు తీయాలా ? వద్దా ? అన్న భయంలో ఉన్నారు. టోటల్‌గా చూస్తే ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో పెద్ద గందరగోళమే నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు