“అమాల్ఫీ 2025″ను లాంచ్‌ చేసిన ఫెరారీ.. రోడ్డు మీద వెళ్తుంటే అందరూ కళ్లు ఆర్పకుండా చూడాల్సిందే..

ఫెరారీ అమాల్ఫీ... స్పోర్ట్స్ కార్ల ప్రపంచంలో ఒక కొత్త చరిత్రను లిఖించడం ఖాయం.

“అమాల్ఫీ 2025″ను లాంచ్‌ చేసిన ఫెరారీ.. రోడ్డు మీద వెళ్తుంటే అందరూ కళ్లు ఆర్పకుండా చూడాల్సిందే..

2025 Ferrari Amalfi

Updated On : July 2, 2025 / 12:37 PM IST

ఫెరారీ అనే పేరు వింటేనే కార్ల ప్రేమికుల గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ప్రపంచ ప్రఖ్యాత ఫెరారీ తన సరికొత్త “ఫెరారీ అమాల్ఫీ 2025” (Ferrari Amalfi 2025)ను పరిచయం చేసింది.

మార్కెట్లో సూపర్ హిట్ అయిన ‘ఫెరారీ రోమా’కు తదుపరి వర్షన్‌గా ఇది వస్తోంది. రాజసం, ఇటాలియన్ డిజైన్లు అన్నీ ఈ అమాల్ఫీలో చూడొచ్చు. రోడ్డు మీద ఇది వెళ్తుంటే, అందరూ కళ్లు ఆర్పకుండా చూడాల్సిందే అనేలా ఉంది.

 ఫీచర్లు
“ఒక కారు ఇంత అందంగా ఉంటుందా?” అనిపించేలా అమాల్ఫీ డిజైన్‌ను చెక్కారు ఫెరారీ డిజైన్ హెడ్ ఫ్లావియో మంజోని. ముందు భాగంలో సాంప్రదాయ గ్రిల్‌కు బదులుగా, కారు బాడీ రంగులోనే కలిసిపోయిన ఒక “ఫ్లోటింగ్ వింగ్” డిజైన్ ఇచ్చారు. ఇది చూడటానికి ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది.

స్టైలిష్ LED హెడ్‌ల్యాంప్స్, వాటిలోనే సెన్సార్లు అమాల్ఫీకి ఒక ఆకర్షణీయమైన లుక్‌ను ఇచ్చాయి. వెనుక వైపు చూస్తే.. బలమైన షోల్డర్ లైన్, కనిపించీ కనిపించనట్టు ఉండే టెయిల్ లైట్స్… పాతకాలపు ఫెరారీ కార్లను గుర్తుకు తెస్తున్నాయి. “వెర్డే కోస్టీరా” (Verde Costiera) అనే ప్రత్యేకమైన టీల్ గ్రీన్ రంగులో ఈ కారు మెరిసిపోతూ, అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.

బయట ఎంత అందంగా ఉందో, లోపల అంతకంటే ఆధునికంగా ఉంటుంది అమాల్ఫీ. డ్యాష్‌బోర్డ్‌ను ముక్కలుగా కాకుండా, ఒకే ఫ్లోలో డిజైన్ చేశారు. ఇది పైలట్ కాక్‌పిట్‌లో కూర్చున్న అనుభూతినిస్తుంది.

గేర్ సెలెక్టర్, వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్ ఉన్న సెంట్రల్ టన్నెల్… గాలిలో తేలుతున్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని అనోడైజ్డ్ అల్యూమినియంతో తయారు చేశారు.

రాజసం ఉట్టిపడే సీట్లు: మీ సౌకర్యానికి తగ్గట్టుగా మూడు సైజులలో లభించే కంఫర్ట్ సీట్లు ఉన్నాయి. వీటిలో మసాజ్, వెంటిలేషన్ ఫంక్షన్లు కూడా ఉన్నాయి. సుదూర ప్రయాణాల్లో కూడా అలసట రాదు.

సంగీత ప్రియులకు పండగే: ఏకంగా 14 స్పీకర్ల Burmester సౌండ్ సిస్టమ్, 1200 వాట్ల పవర్‌తో ఉంది. ఒక లైవ్ కాన్సర్ట్‌లో ఉన్న ఫీలింగ్‌ను ఇస్తుంది.

యాక్టివ్ మొబైల్ వింగ్: కారు వెనుక ఒక చిన్న వింగ్ (రెక్క) ఉంటుంది. ఇది మీ ప్రమేయం లేకుండా, కారు వేగాన్ని బట్టి ఆటోమేటిక్‌గా మూడు పొజిషన్లలోకి మార్చుతుంది.

  • Low Drag (LD): సాధారణ వేగంతో వెళ్తున్నప్పుడు గాలిని చీల్చుకుంటూ వెళ్లేందుకు.
  • Medium Downforce (MD): వేగం కొంచెం పెరిగినప్పుడు.
  • High Downforce (HD): అత్యధిక వేగంతో దూసుకెళ్తున్నప్పుడు కారును రోడ్డుకు అదిమి పట్టి, పూర్తి కంట్రోల్ ఇస్తుంది.

ఇంజిన్: 631 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే శక్తిమంతమైన ట్విన్-టర్బో V8 ఇంజిన్ ఉంది.

వేగం: 0-100 కి.మీ/గం: కేవలం 3.3 సెకన్లలో (రెప్పపాటులో) వంద స్పీడ్ అందుకుంటుంది.

0-200 కి.మీ/గం: కేవలం 9 సెకన్లలో అందుకుంటుంది.

బ్రేకింగ్ పవర్: “బ్రేక్-బై-వైర్” టెక్నాలజీతో, ఎంత వేగంలో ఉన్నా సరే, కారును అత్యంత కచ్చితత్వంతో కంట్రోల్ చేయవచ్చు.

స్పీడ్ బ్రేకర్‌ల భయం ఉండదు: ఫ్రంట్ లిఫ్టర్ సిస్టమ్‌తో, అవసరమైనప్పుడు కారు ముందు భాగాన్ని 40 మిల్లీమీటర్ల వరకు పైకి లేపవచ్చు. ఇక స్పీడ్ బ్రేకర్‌ల వద్ద టెన్షన్ ఉండదు.

ఫెరారీ అమాల్ఫీ 2025 అనేది కేవలం ఒక స్పోర్ట్స్ కారు మాత్రమే కాదు. ఇది ఫెరారీ ఇంజనీరింగ్ ప్రతిభకు, డిజైన్ తపనకు, వేగంపై ఉన్న మక్కువకు నిలువుటద్దం. సంపన్నులకు ఇది ఒక స్టేటస్ సింబల్ అయితే, కార్ల ప్రేమికులకు ఇది ఒక కల. ఫెరారీ అమాల్ఫీ… స్పోర్ట్స్ కార్ల ప్రపంచంలో ఒక కొత్త చరిత్రను లిఖించడం ఖాయం.