లాక్ డౌన్ వేళ షాక్ ఇస్తున్న బంగారం

బంగారం ధరలు అధికంగా పెరుగనున్నాయి. ఒకవైపు ఆర్థిక మాంద్యం బుసలు కొడుతుంటే మరోవైపు కరోనా రక్కసి విస్తరించడంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది. స్టాక్ మార్కెట్లు కుదేలవుతుండటంతో తమ పెట్టుబడులు సురక్షితమైన, అతి విలువైన లోహాల వైపు మళ్లిస్తుండటంతో వీటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు రూ.50 వేల నుంచి రూ. 55 వేల మధ్యలోకి చేరుకోనున్నాయని విశ్లేషకులు అంచనా వేసున్నారు.
న్యూయార్క్ బులియన్ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ ధర ఏడేళ్ల గరిష్టానికి 1715.25 డాలర్లు పలికింది. డిసెంబర్ 2012లో నమోదైన 1722 డాలర్ల తర్వాత ఇదే గరిష్ట స్థాయి ధరలు కావడం గమనార్హం. అమెరికా గోల్డ్ ఫ్యూచర్ లో 1770.20 డాలర్లుగా ట్రేడ్ అవుతోంది. కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాల ఆర్థిక సంక్షోభం పసిడి ధరలు పెరిగేందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు తెలిపారు.
2019లో 23.74 శాతం రిటర్నులు పంచిన బంగారం … ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో పది గ్రాముల ధర రూ.6,94 లేదా 17.31 శాతం ఎగబాకింది. ఇప్పటి వరకు 15.19 శాతం రిటర్నులు పంచింది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటంతో వచ్చే రెండు మూడేళ్ల వరకు బంగారం మరింత ప్రియమయ్యే అవకాశాలున్నాయని పీఎన్ జీ జువెల్లరీ ఎండీ సౌరభ్ గాడ్గిల్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఏదైనా యుద్ధం లేదా సంక్షోభం జరిగిన వెంటనే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఏప్రిల్ 20 నుంచి సావరిన్ గోల్డ్ బాండ్లను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.