Gold: బంగారం, వెండి కొంటున్నారా? అకస్మాత్తుగా ఏం జరిగిందంటే?
నిపుణుల అభిప్రాయం ఏంటి? భవిష్యత్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి?
Gold: గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా దిగివస్తున్నాయి. సోమవారం సాయంత్రం వాణిజ్య మార్కెట్లలో పసిడి, వెండి ధరలు మరోసారి భారీగా తగ్గాయి. లాభాల స్వీకరణకు పెట్టుబడిదారులు మొగ్గు చూపడంతో ఈ పతనం చోటుచేసుకుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
MCXలో బంగారం, వెండి ధరలు
మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్ (MCX)లో డిసెంబర్ డెలివరీ బంగారం ఫ్యూచర్స్ రూ.1,521 (1.23%) తగ్గి 10 గ్రాములకు రూ.1,21,930 వద్ద ట్రేడయ్యాయి. అదే విధంగా, వెండి ఫ్యూచర్స్ రూ.2,000 (1.35%) తగ్గి కిలోకు రూ.1,45,481 వద్ద నమోదయ్యాయి. ఈ తగ్గుదల యూఎస్ ఫెడ్ పాలసీ సమావేశానికి ముందుగా నమోదైంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి తీరుతెన్నులు
అంతర్జాతీయ మార్కెట్లో కూడా సోమవారం సాయంత్రం బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. అమెరికన్ డాలర్ బలపడడం, యూఎస్ – చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన సంకేతాలు బంగారంపై తీవ్ర ఒత్తిడిని సృష్టించాయి. ద్రవ్య పరపతి విధానాలపై సూచనల కోసం పెట్టుబడిదారులు ఈ వారం జరగబోయే కేంద్ర బ్యాంకుల సమావేశాల కోసం ఎదురుచూస్తున్నారు.
స్పాట్ గోల్డ్ 2% కంటే ఎక్కువ తగ్గి ఔన్స్ కి $4,028.84 వద్ద నిలిచింది. అమెరికన్ డాలర్ యెన్‌పై రెండువారాల గరిష్ఠానికి ఎగబాకింది. ఇతర విలువైన లోహాల్లో, స్పాట్ సిల్వర్ 0.3% తగ్గి ఔన్స్ కి $48.42 వద్ద, ప్లాటినం 0.1% పెరిగి $1,607.24 వద్ద, పల్లాడియం 0.2% తగ్గి $1,426.06 వద్ద ఉన్నాయి.
ధరల పతనానికి దారితీసిన కీలక అంశాలు
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు: ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో రష్యా ఆయిల్ కంపెనీలు లూకోయిల్, రోస్‌నెఫ్ట్‌లపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం.
అమెరికా-చైనా వాణిజ్య చర్చలు: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలవబోతున్నారన్న వార్త మార్కెట్‌ను ప్రభావితం చేసింది.
అమెరికా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) నివేదిక: పెట్టుబడిదారుల దృష్టి ప్రస్తుతం ఈ నివేదికపైనే కేంద్రీకృతమై ఉంది. సెప్టెంబర్ కోర్ ఇన్‌ఫ్లేషన్ 3.1% వద్ద స్థిరంగా ఉంటుందని అంచనా.
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు: అమెరికాలో తాత్కాలిక షట్‌డౌన్ కారణంగా రేటు కోతల ప్రకటనలు ఆలస్యమైనా, వచ్చే ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల రేటు కోత ఉంటుందని పెట్టుబడిదారులు ముందుగానే అంచనా వేస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం, భవిష్యత్ ట్రెండ్స్ ఇవే..
“బంగారం ధర తగ్గుదల ప్రజలకు కొనుగోలు అవకాశాన్ని ఇస్తుంది. రాబోయే నెలల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నవారు ఈ తగ్గుదలని తెలివిగా ఉపయోగించుకోవచ్చు” అని సెంకో గోల్డ్ లిమిటెడ్ ఎండీ అండ్ సీఈవో సువంకర్ సేన్ అన్నారు.
“బంగారం ధరలు ప్రస్తుతం లాభాల స్వీకరణ కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా-భారత్, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందాలపై పెరుగుతున్న ఆశావాహ వాతావరణం పెట్టుబడిదారులను తమ పొజిషన్లను తగ్గించుకునేలా చేస్తుంది. ధరలు 3.40% తగ్గి ప్రస్తుతం రూ.1,22,000 వద్ద ఉన్నాయి. ట్రేడర్లు అమెరికా సీపీఐ డేటా కోసం ఎదురుచూశారు.
ఇది మార్కెట్ ఒడిదుడుకులను పెంచింది. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్, వాణిజ్య చర్చలపై అనిశ్చితి మార్కెట్‌లో జాగ్రత్త వాతావరణాన్ని కొనసాగించనుంది. సమీప భవిష్యత్తులో బంగారం ధరలు రూ.1,18,000–రూ.1,25,500 పరిధిలో ఊగిసలాటకు లోనవుతాయి. స్వల్ప ప్రతికూల ధోరణి కొనసాగే అవకాశం ఉంది” అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన జతీన్ త్రివేది తెలిపారు.
సోమవారం సాయంత్రం ఢిల్లీలో 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.1,720 తగ్గింది. అలాగే, 24 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.1,872 తగ్గింది.
స్టాండర్డ్ గోల్డ్ (22 క్యారెట్): రూ.90,520/8 గ్రాములు
ప్యూర్ గోల్డ్ (24 క్యారెట్): రూ.98,744/8 గ్రాములు
