2021నాటికి 10గ్రాముల బంగారం ధర ఎంత పెరుగుతుందంటే?

బంగారం ధరలు బాగా పెరగడానికి కరోనా ఎఫెక్టే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్వ్యాప్తి, ఇండస్ట్రీలు మూతపడటం, ఆర్థిక వ్యవస్థలు చితికిపోవడం, దేశాల మధ్య విభేదాల్లాంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు కరోనా కారణంగా చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించడం.. కంపెనీలు మూతపడటంతో బంగారం ఉత్పత్తి మరింతగా తగ్గిపోయింది. ఖనిజాన్ని తవ్వి తీసినా.. దాని ప్రాసెసింగ్, బిస్కట్లు, కాయిన్లుగా మార్చడం లాంటివి చేసే పరిస్థితి లేకుండా పోయింది. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు క్లోజ్ కావడం, అవి నష్టాల్లోకి వెళ్లడంతో షేర్ల ధరలు పడిపోయాయి. ఇదే టైమ్ లో రియల్ఎస్టేట్ రంగంపైనా ఆశలు తగ్గిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లంతా గోల్డ్కొంటున్నారు. దీంతో గోల్డ్ ధర అమాంతం పెరుగుతూ వస్తోంది. మరోవైపు వడ్డీ రేట్ల తగ్గింపు కూడా బంగారం రేట్లపై ఎఫెక్ట్ చూపుతుందనే వాదనలు ఉన్నాయి.
ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల దగ్గరున్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు లాంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతున్నాయి. కారణాలేవైనా బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరుకుంటోంది. దీంతో భవిష్యత్తుల్లో సామాన్యజనం కనకం వైపు కన్నెత్తి చూడడం అనుమానంగానే కనిపిస్తోంది. వాసమున్న ప్రతి ఇంటిలోనూ వీసమెత్తయినా బంగారం ఉండాలనేది తెలుగునాట ఓ సామెత. కానీ ఇప్పుడా మాటే బంగారం అయ్యేలా కనిపిస్తోంది. రోజురోజుకి గోల్డ్ రేటు చుక్కలనంటుతోంది. సామాన్యుడికి అందనంత దూరంలో రన్ రాజా రన్ అంటూ దౌడ్ తీస్తోంది. ఆర్థిక వ్యవస్థలు చితికిపోతున్నా.. బంగారం ధర మాత్రం నాన్‌స్టాప్‌గా పెరుగుతూనే ఉంది.
గోల్డ్ రేట్‌కి ఫుల్‌స్టాప్ పడేనా..?
గతంలో ఎన్నడూ లేనంత వేగంగా ప్రస్తుతం బంగారం ధర పెరుగుతోంది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సైంజ్ లో బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా రికార్డ్ స్థాయిని అందుకుంది. గురువారం 10 గ్రాముల బంగారం ధర 67 రూపాయలు పెరిగి 48 వేల 829 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. అంతర్జాతీయంగా బంగారం ధర 8 ఏళ్ల గరిష్టాన్ని అందుకుంది. జాతీయ అంతర్జాతీయంగా కోవిడ్ 19 కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశీయంగా బంగారానికి డిమాండ్ పెరిగిందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. రానున్న రోజుల్లో బంగారం 51వేల మార్క్‌కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
సామాన్యుడికి అందనంత దూరంలో :
కరోనా మహమ్మారి ప్రభావంతో పసిడి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరానికి చేరుకున్న అతి విలువైన లోహాల ధరలు బుధవారం మరో మెట్టుపైకి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో తులం బంగారం ధర 51 వేలకు చేరువైంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌తో కకావికలమవుతుండటంతో డిపాజిటర్లు తమ పెట్టుబడులను పసిడి, వెండి లాంటి విలువైన లోహాల వైపు మళ్లిస్తున్నారు. దీంతో కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి.
10గ్రాముల బంగారం ధర రూ.49,908
దేశీయంగా కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన దన్నుతో బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర బుధవారం 647 రూపాయలు ఎగబాకి 49వేల 908 రూపాయలు పలికింది. పుత్తడి ధర ఒకేరోజు ఇంత స్థాయిలో పెరగడం గత రెండు నెలల్లో ఇదే తొలిసారి. మంగళవారం ధర 49వేల 261గా ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 470 ఎక్కువై 50వేల 950 రూపాయలు పలికింది.
1800 డాలర్ల ఔన్స్ ధర 2వేల డాలర్లు తాకే ఛాన్స్ :
10 గ్రాముల బంగారం త్వరలో 51 వేల మార్క్‌కు చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 22 క్యారెట్ల పసిడి ధర 46వేల 740కి చేరుకుంది. పసిడితో పాటు వెండి ధర కూడా పెరిగింది. పారిశ్రామిక వర్గాలతోపాటు నాణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి 1,611 రూపాయలు ఎక్కువై 51వేల 870కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు అదుపులేకుండా దూసుకుపోతున్నాయి.
ప్రస్తుతం న్యూయార్క్ బులియన్ మార్కెట్లో 1,800 డాలర్లుగా ఉన్న ఔన్స్ ధర త్వరలో 2 వేల డాలర్లను తాకొచ్చని గోల్డ్‌మెన్ సాక్స్ అంచనా వేస్తోంది. ఔన్స్ గోల్డ్ ధర 1,788 డాలర్లకు పరిమితం కాగా.. వెండి 18.34 డాలర్లుగా నమోదైంది. 2012 తర్వాత ధరలు ఈ స్థాయిలో పలకడం ఇదే తొలిసారి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటం, మరోవైపు ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతుండటంతో మదుపరులు బంగారాన్ని ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.
రాబోయే కొన్నేళ్లలో మంచి రాబడి కోసం వేర్వేరు రంగాల్లో పెట్టుబడి పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదు. బంగారం బలమైన రాబడిగా ఉంటుందని భావిస్తున్నారని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ నివేదిక చెబుతోంది. 2021 నాటికి 10 గ్రాముల బంగారం ధర 82వేలకు చేరుకుంటుందని అంచనా వేసింది. మరోవైపు కరోనా భయాలు.. ఉద్యోగాల్లో కోత.. లాంటి పరిణామాలు బంగారం ధరపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఎక్స్‌పర్ట్ అంటున్నారు. పుత్తడి జోరు చూస్తుంటే సమీప భవిష్యత్తులో ధర మరింత పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పసిడి జోరు ఇలాగే కొనసాగితే సామాన్యుడు అటువైపు చూడడం అనుమానమే.