వామ్మో.. బంగారం టన్నులు టన్నులు కొంటున్నారు.. డబ్ల్యూజీసీ నివేదికలో సంచలన విషయాలు

ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతీయులు బంగారాన్ని టన్నులు టన్నులు కొనుగోళ్లు చేస్తున్నట్లు స్పష్టమైంది.

వామ్మో.. బంగారం టన్నులు టన్నులు కొంటున్నారు.. డబ్ల్యూజీసీ నివేదికలో సంచలన విషయాలు

World Gold Council report

Updated On : February 6, 2025 / 10:58 AM IST

World Gold Council: బంగారంకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అధికశాతం మంది ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టడం సురక్షితంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో బంగారం కొనుగోళ్లు, పెట్టుబడులు పండుగలా సాగాయి. దీంతో గతేడాది మొత్తం మీద బంగారం డిమాండ్ 802.8 టన్నులకు చేరుకుంది. అయితే, 2023 సంవత్సరంతో పోల్చితే ఐదు శాతం పెరగ్గా.. విలువపరంగా చూస్తే ఏకంగా 31శాతం వృద్ధి కనిపించింది. తాజాగా.. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం బంగారాన్ని టన్నులు టన్నులు కొనుగోళ్లు చేస్తున్నట్లు స్పష్టమైంది. అంతేకాదు.. గడిచిన రెండేళ్లలో మాదిరిగానే ఈ ఏడాదిలోనూ బంగారం గిరాకీ ఉండొచ్చునని అంచనా వేసింది.

Gold

గతేడాది రూ.5.15లక్షల కోట్లు ఖర్చు చేశారు..
డబ్ల్యూజీపీ నివేదిక ప్రకారం.. 2023లో బంగారం గిరాకీ 761 టన్నులుగా ఉండగా.. గతేడాది ఆ మొత్తం 802.8 టన్నులకు పెరిగింది. ఇక 2025లో బంగారం గిరాకీ 700 నుంచి 800 టన్నులు ఉండొచ్చని అంచనా వేసింది. అయితే, ఈ సంవత్సరం ధరల్లో కొంత స్థిరత్వం వచ్చే అవకాశం ఉందని, దీంతో పెళ్లిళ్ల సీజన్ లో బంగారు ఆభరణాల కొనుగోళ్లు పెరగొచ్చునని డబ్ల్యూజీపీ రీజినల్ సీఈఓ సచిన్ జైన్ వెల్లడించారు. 2023లో 761 టన్నుల బంగారం కోసం భారతీయులు రూ. 3,92,000కోట్లను ఖర్చు చేశారు. 2024లో 802.8 టన్నుల బంగారం కొనుగోలు కోసం రూ.5,15,390 కోట్లను వెచ్చించారని డబ్ల్యూజీసీ తాజా నివేదికలో పేర్కొంది.

Gold

ప్రపంచ వ్యాప్తంగా..
2024లో ప్రపంచ వ్యాప్తంగా బంగారం డిమాండ్ 4,974 టన్నులుగా నమోదైంది. 2023లో డిమాండ్ 4,945.9 టన్నులతో పోల్చితే ఒక శాతం పెరిగింది. మూడు, నాలుగో త్రైమాసికాల్లో ప్రపంచ వ్యాప్తంగా గోల్డ్ ఈటీఎఫ్ లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. సెట్రల్ బ్యాంక్ లు రేట్ల కోత ఆరంభించడం, అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇందుకు కారణాలుగా ఉన్నాయని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొంది. 2025లోనూ సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, గోల్డ్ ఈటీఎఫ్ ల డిమాండ్ బలంగానే కొనసాగొచ్చని నివేదిక అంచనా వేసింది.

Gold

2013 తరువాత ఇదే గరిష్ఠ స్థాయి..
దిగుమతి సుంకాలు తగ్గించినప్పటికీ గత ఏడాది కాలంలో దేశీయ మార్కెట్లో బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. కొన్ని నగరాల్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.86వేలపైనే పలుకుతోంది. అయితే, అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా పేరొందిన బంగారం 2024లో పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారింది. గతేడాది బంగారంలో పెట్టుబడులు 29శాతం పెరిగి 239.4 టన్నులకు చేరినట్లు జైన్ తెలిపారు. 2013 తరువాత బంగారం పెట్టుబడుల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. 2023లో ఈ మొత్తం 185.2 టన్నులుగా నమోదైంది. ఇదిలాఉంటే.. బంగారం ఈటీఎఫ్ ల పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది. దీంతో పెట్టుబడి పరంగా బంగారంకు డిమాండ్ 2025లోనూ బలంగానే కొనసాగనుందని నివేదిక అంచనా వేసింది.

Gold

ఆర్బీఐ కొనుగోళ్లు ఇలా..
డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ సచిన్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గతేడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 73 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2023లో 16 టన్నులు కొనుగోలు చేయగా.. అప్పటితో పోల్చితే 2024లో నాలుగు రెట్లు ఎక్కువగా బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. దీనికి ప్రధాన కారణం.. ప్రపంచంలో పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, అధిక ద్రవ్యోల్బణం, ఇతర సవాళ్లను పరిగణలోకి తీసుకొని రిస్కును తగ్గించుకునే ఉద్దేశంతో ఆర్బీఐ బంగారం నిల్వలు పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.