TRAI new rules: మీ కోసం ట్రాయ్ గేమ్ ఛేంజర్ నిర్ణయం.. ఇక స్పామ్ కాల్స్ బాధ వదిలిపోతుంది పో..
కొత్త నిబంధనలను పాటించని టెలికాం కంపెనీలకు ట్రాయ్ భారీగా జరిమానాలు విధిస్తుంది.

పదే పదే స్పామ్ కాల్స్ వస్తుండడంతో మొబైల్ యూజర్లు చిరాకు పడుతుంటారు. అటువంటి స్పామ్ కాల్స్‌ను కట్టడి చేయడానికి వినియోగదారులకు వాటి నుంచి కాపాడి సేవలను మెరుగుపరచడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త రూల్స్ తీసుకొచ్చింది.
టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ 2018 కింద ఈ రూల్స్ ప్రవేశపెట్టింది. ఇందులో సవరణల ద్వారా యూజర్లకు లాభం కలుగుతున్నప్పటికీ టెలికాం ఆపరేటర్లు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. 10 డిజిటల్ సంఖ్యలు ఉండే ఫోన్ నంబర్ల ద్వారా కమర్షియల్ కమ్యూనికేషన్‌ను ట్రాయ్ నిషేధించింది.
టెలిమార్కెటింగ్ కంపెనీలు ప్రజలను కాంటాక్ట్ చేయడానికి ఫోన్ నెట్‌వర్క్‌లను దుర్వినియోగం చేస్తుండడంతో ఈ కొత్త రూల్‌ను ట్రాయ్ ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు ట్రాయ్ చర్చలు కూడా జరిపింది. ట్రాయ్ గత ఏడాది ఆగస్టు 28 నుంచి సంప్రదింపులు జరిపింది. వ్యాపారుల నుంచి అభిప్రాయాలను తీసుకుంది.
Also Read: ఏపీలో జీబీఎస్ సిండ్రోమ్ భయం.. రోజుకు 5 ఇంజక్షన్లకు రూ.లక్ష.. లక్షణాలు ఇవే: సర్కారు ఫుల్ డీటెయిల్స్
మార్కెటింగ్ కోసం 10 అంకెల ఫోన్ నంబర్లను దుర్వినియోగం చేయడాన్ని ట్రాయ్ తీసుకున్న నిర్ణయంతో నివారించవచ్చు. అలాగే, రిజిస్ట్రర్‌కాని టెలిమార్కెటర్లకు నిబంధనలు కఠినతరం అవుతాయి. ఈ కొత్త రూల్స్ టెలిమార్కెటర్లు, ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లల్లో జవాబుదారీతననాన్ని పెంచుతాయి. అనవసర కాల్స్, మెసేజ్‌లను రిపోర్టు చేయడం ప్రజలకు సులభతరం అవుతుంది.
ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌ల కోసం సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్లను ఉపయోగించకుండా ట్రాయ్ రూల్ తీసుకురావడంతో ప్రజలకు స్పామ్ కాల్స్ చిరాకు తగ్గుతుంది.
ప్రమోషనల్ కాల్స్ (ప్రకటనలు, మార్కెటింగ్ మొదలైనవి) కోసం ‘140’ సిరీస్ నంబర్‌ను వాడవచ్చు. అలాగే, సర్వీసుల సంబంధిత, లావాదేవీల కాల్స్ (బ్యాంక్, ఓటీపీలు, కస్టమర్ సపోర్ట్ వంటివి) వాటి కోసం ‘1600’ సిరీస్ వాడుకోవచ్చు.
ఒకవేళ ఈ నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తే ట్రాయ్ జరిమానాలు విధిస్తుంది. మొదటిసారి ఉల్లంఘిస్తే అవుట్ గోయింగ్ టెలికాం సేవలపై 15 రోజుల సస్పెన్షన్ వేటు పడుతుంది. మళ్లీ నిబంధనలను ఉల్లంఘిస్తే అన్ని సేవా సంస్థలలోని పీఆర్‌ఐ/ఎస్‌ఐపీ ట్రంక్ వంటి టెలికాం రీసోర్సులు ఒక ఏడాది పాటు డిస్‌కనెక్ట్ అవుతాయి.
కొత్త నిబంధనలను పాటించని టెలికాం కంపెనీలకు ట్రాయ్ నగదు జరిమానాలు కూడా విధిస్తుంది. మొదటిసారి ఉల్లంఘనకు రూ.2 లక్షల జరిమానా, రెండవ ఉల్లంఘనకు రూ.5 లక్షల జరిమానా, మరిన్నిసార్లు ఉల్లంఘిన ప్రతిసారీ రూ.10 లక్షల చొప్పున జరిమానా పడుతుంది. అలాగే, టెలికాం ఆపరేటర్లు ట్రాయ్ నిబంధనలను పాటిస్తున్నారని నిర్ధారించుకోవడానికి వ్యాపార సంస్థలు, టెలిమార్కెటర్లతో చట్టపరమైన ఒప్పందాలపై సంతకం చేయాలి.