LIC Jeevan Utsav Return Plan : ఎల్‌ఐసీ కొత్త బీమా పాలసీ ఇదిగో.. 5 ఏళ్లు చెల్లిస్తే చాలు.. లైఫ్‌లాంగ్ గ్యారెంటీ రిటర్న్స్!

LIC Jeevan Utsav : ఎల్‌ఐసీ జీవన్ ఉత్సవ్ అనే కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. పాలసీదారులు ఎవరైనా సరే 5 ఏళ్ల పాటు ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా జీవితాంతం 10 శాతం చొప్పున గ్యారెంటీ ఆదాయాన్ని పొందవచ్చు.

LIC offers guaranteed return plan with the launch of Jeevan Utsav

LIC Jeevan Utsav Guaranteed Return Plan : ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరికి బీమాతో కూడిన పాలసీలు చాలా అవసరం. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థికపరమైన భరోసాని అందించవచ్చు. అలాంటి బీమాను అందించే అనేక బీమా కంపెనీలు ఉన్నాయి. అందులో ప్రముఖ ప్రభుత్వ రంగ జీవిత బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ఒకటి. పాలసీదారుల కోసం సరికొత్త పాలసీని ప్రవేశపెట్టింది. అదే.. జీవన్‌ ఉత్సవ్‌ పాలసీ. ఈ పాలసీ కింద పాలసీదారులు సేవింగ్, బీమాతో పాటు గ్యారెంటీ రిటర్న్స్ కూడా పొందవచ్చు.

నవంబర్‌ 29న (బుధవారం) ఎల్ఐసీ 871 (Plan No.871) ప్లాన్‌ నంబర్‌ పాలసీని తీసుకొచ్చింది. ఇదేంటంటే.. ఇదొక నాన్‌ లింక్డ్‌, ఇండివిడ్యువల్‌, సేవింగ్స్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌ పాలసీగా చెప్పవచ్చు. ఈ లిమిటెడ్‌ ప్లాన్ ఒకసారి తీసుకుంటే ప్రీమియం వ్యవధి ముగిసిన తర్వాత జీవితాంతం ఆదాయాన్ని పొందవచ్చు. అందులోనూ అందించే హామీ మొత్తంలో 10 శాతాన్ని ఎల్ఐసీ పాలసీదారులకు చెల్లిస్తుంది. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను మరింత తెలుసుకుందాం.

పాలసీ ఫీచర్ల వివరాలివే :
ఎల్ఐసీ జీవన ఉత్సవ్ పాలసీ కింద కొన్ని ఫీచర్లను పొందవచ్చు. అందులో ప్రీమియం టర్మ్‌ తీసుకుంటే.. వెయిటింగ్‌ పీరియడ్‌ దాటిన తర్వాత ప్రతి ఏడాదిలో ఆదాయాన్ని పొందవచ్చు. ఒకవేళ పాలసీదారుడు రెగ్యులర్‌ ఆదాయాన్ని వద్దని భావిస్తే.. ఫ్లెక్సీ ఇన్‌కమ్ బెనిఫిట్ ఎంచుకోవచ్చు. దాంతో దానిపై చక్రవడ్డీని పొందవచ్చు. పాలసీ మొదలైన సంవత్సరం నుంచి బతికి ఉన్నంత కాలం ఇన్సూరెన్స్ కవరేజీని పొందవచ్చు. పాలసీ ప్రీమియం చెల్లించే వ్యవధిలో రూ. వెయ్యికి రూ.40 చొప్పున గ్యారెంటీ అడిషన్స్‌ పొందవచ్చు. ఇక, 90 రోజుల శిశువుల నుంచి 65 ఏళ్ల వృద్ధుల వరకు అందరూ పాలసీని తీసుకోవచ్చు.

ఎవరెవరు అర్హులంటే? :
ఈ ఎల్ఐసీ పాలసీని ఏ వయస్సుల వారైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా పురుషులు, మహిళలు లేదా పిల్లలు, యువకులు తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 90 రోజుల నుంచి ఉంటుంది. అంటే.. గరిష్ఠ వయసు 65 సంవత్సరాల వరకు ఉంటుంది. పాలసీ చెల్లించే గరిష్ఠ వయసు 75 ఏళ్లుగా ఉంటుంది. ఎవరైనా సరే 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు పాలసీ ప్రీమియాన్ని చెల్లించాలి. ప్రారంభ బీమా మొత్తం రూ.5 లక్షలు ఉంటుంది. అయితే, పాలసీ టర్మ్ ఆధారంగా ఇందులో వెయిటింగ్ పీరియడ్ మారుతూ ఉంటుంది.

Read Also : Gautam Adani : ప్రపంచ టాప్ 20 సంపన్నుల జాబితాలోకి గౌతమ్ అదానీ రీఎంట్రీ..!

5ఏళ్ల ప్రీమియం వ్యవధిపై 5 ఏళ్లు వెయిటింగ్ పీరియడ్, 6 ఏళ్ల టర్మ్ ఎంచుకుంటే నాలుగేళ్ల వరకు వెయింటింగ్ పీరియడ్, 7 ఏళ్ల టర్మ్ తీసుకుంటే 3ఏళ్ల వెయిటింగ్ పీరియడ్, 8ఏళ్ల నుంచి 16 ఏళ్ల ప్రీమియం టర్మ్ తీసుకుంటే 2 ఏళ్ల వరకు వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది. ఆ తర్వాత నుంచి బీమా హామీ మొత్తంలో నుంచి ప్రతి ఏడాదిలో 10 శాతం వరకు జీవితాంతం ఆదాయాన్ని పొందవచ్చు. పాలసీదారుడు బతికి ఉన్నరోజులు జీవిత బీమాను పొందవచ్చు.

పాలసీదారుడికి రెండు ఆప్షన్ల బెనిఫిట్స్ :
పాలసీదారు కవర్ ప్రారంభంలో ఎంచుకోవడానికి రెండు ఆప్షన్లు ఉంటాయి. ఇందులో ఒకటి రెగ్యులర్ ఇన్ కమ్ బెనిఫిట్, రెండోది ఫ్లెక్సీ ఇన్ కమ్ బెనిఫిట్.. వీటిలో ఎంచుకున్న ఆప్షన్ బట్టి ప్రయోజనాలు మారుతూ ఉంటాయి. సాధారణ ఆదాయ ఆప్షన్ ఎంచుకున్న పాలసీదారులు 11వ పాలసీ సంవత్సరం నుంచి వార్షిక చెల్లింపులను అందుకుంటారు. చెల్లింపులు ప్రారంభమయ్యే కచ్చితమైన సంవత్సరం ఎంచుకున్న ప్రీమియం చెల్లింపు వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ప్రీమియంలు చెల్లించే వారు 11వ సంవత్సరం నుంచి చెల్లింపులను పొందవచ్చు. అయితే 10 ఏళ్ల వంటి ఎక్కువ ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకునే పాలసీదారులు 13వ పాలసీ సంవత్సరం నుంచి చెల్లింపులను పొందవచ్చు.

ఏదేమైనప్పటికీ, పాలసీదారుడు పాలసీని ప్రారంభించిన సమయంలో ఉపయోగించిన ఆప్షన్ పాలసీ సంవత్సరం ప్రారంభానికి 6 నెలల ముందు వరకు ఏ సమయంలోనైనా మార్చవచ్చు. ఇందులో మొదటి, సాధారణ లేదా ఫ్లెక్సీ ఆదాయ ప్రయోజనం చెల్లించడం జరుగుతుంది. ప్రీమియం చెల్లింపు అనేది వెయిటింగ్ పీరియడ్ దాటిన తర్వాత కూడా జీవితాంతం అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ప్రతి ఏడాది చివరిలో కనీస మొత్తంలో 10 శాతం ఆదాయాన్ని పొందవచ్చు. అదే రెండో ఆప్షన్ తీసుకుంటే.. బీమా మొత్తంలో 10 శాతాన్ని పొందవచ్చు. అలా తీసుకోకుండా అలానే ఉంచుకుంటే మాత్రం 5.5 శాతం చొప్పున చక్రవడ్డీ వస్తుంది. లేదంటే ఇందులో పాలసీదారుడు కావాలనుకుంటే 75 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఆపై మిగిలిన మొత్తంపై వడ్డీ పొందవచ్చు.

పాలసీదారుడు మరణిస్తే :
పాలసీ తీసుకున్న తర్వాత ఒకవేళ ప్రమాదవశాత్తూ లేదా ఏదైనా పరిస్థితుల్లో పాలసీదారుడు మరణిస్తే.. డెత్ బీమా మొత్తంతో కలిపి గ్యారెంటీడ్ అడిషన్స్ కూడా చెల్లించడం జరుగుతుంది. డెత్ బీమా మొత్తాన్ని లేదా వార్షిక ప్రీమియానికి ఏడు రెట్లు చెల్లిస్తుంది. ఎందులో ఎక్కువగా ఉంటే అదంతా పాలసీదారుడి నామినీకి ఎల్ఐసీ చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ పేమెంట్ కాల పరిమితిలో ప్రతి రూ.వెయ్యకి రూ.40 చొప్పున గ్యారెంటీ అడిషన్స్ కూడా చెల్లిస్తుంది. అయితే, మొత్తం జీవితకాల పాలసీ నిబంధనలకు ప్రీమియం చెల్లింపు వ్యవధి 5 ​​సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు ఉంటుంది.

పాలసీ రైడర్ల యాడింగ్ సదుపాయం :
ఎల్ఐసీ అందించే ఈ జీవన్ ఉత్సవ్ పాలసీలో అవసరమైతే రైడర్లను కూడా చేర్చుకునే వీలుంది. డిజెబిలిటీ బెన్ఫిట్ రైడర్, ఎల్ఐసీ యాక్సిడెంట్ బెన్ఫిట్ రైడర్, ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్, ఎల్ఐసీ న్యూ క్రిటికల్ ఇల్నెస్ బెన్ఫిట్ రైడర్, ఎల్ఐసీ ప్రీమియం వెయివర్ బెన్ఫిట్ రైడర్, ఎల్ఐసీ న్యూటర్మ్ అస్యూరెన్స్ రైడర్లను చేర్చుకోవచ్చు.

LIC guaranteed return plan

పాలసీ ప్రీమియం ఎంతంటే? :
ఈ ఎల్ఐసీ పాలసీలో కనీస బీమా మొత్తం రూ.5 లక్షలు ఉంటుంది. అంతకంటే ఎక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకు.. 30 ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల ప్రీమియం పేమెంట్ ఆప్షన్ తీసుకుంటే.. ప్రతి ఏడాదిలో రూ.2.17 లక్షలు చెల్లించాలి. ఒకవేళ, 8 ఏళ్లకు ప్రీమియం ఆప్షన్ తీసుకుంటే.. అతడు రూ.1.43 లక్షలు చెల్లించాలి. అదేవిధంగా, 16 ఏళ్ల ప్రీమియం ఆప్షన్‌పై ఏడాదికి రూ.58 వేల వరకు చెల్లించాలి. అది కూడా వ్యక్తి వయస్సును బట్టి ప్రీమియంలో మార్పులు ఉంటాయి. ప్రీమియాన్ని చెల్లించే వ్యవధి పెరిగిన కొద్ది చెల్లించాల్సిన మొత్తం తగ్గుతూ వస్తుంది.

ఇంతకీ ఈ పాలసీని ఎలా కొనుగోలు చేయాలంటే.. ఎల్ఐసీ ఏజెంట్ ద్వారా తీసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు.  జీవన్ ఉత్సవ్ ప్లాన్‌ను లైసెన్స్ పొందిన ఏజెంట్లు, కార్పొరేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, బీమా మార్కెటింగ్ సంస్థల ద్వారా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు అలాగే నేరుగా ఎల్ఐసీ వెబ్‌సైట్ (www.licindia.in) ద్వారా కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

మీరు పాలసీ తీసుకుంటే దీనిపై లోన్ ఫెసిలిటీ కూడా పొందవచ్చు. పాలసీ పేమెంట్ చేసేటప్పుడు లోన్ కూడా అప్లయ్ చేయొచ్చు. తీసుకునే లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీ అనేది మీ ఆదాయంలో 50 శాతానికి మించకూడదని గమనించాలి. మీరు చెల్లించాల్సిన ప్రీమియాన్ని నెలకు ఒకసారి లేదంటే 3 నెలలు, 6 నెలలు, ఏడాదికి ఒకసారి చెల్లించవచ్చు.

Read Also : OnePlus Nord CE 3 5G : భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఇప్పుడు ఎంతో తెలుసా?