LIC Saral Pension Plan
LIC Saral Pension Plan : ఎల్ఐసీ పాలసీదారుల కోసం అద్భుతమైన ప్లాన్ అందిస్తోంది. మీరు చేయాల్సిందిల్లా.. ఒకసారి ప్రీమియం చెల్లించడమే.. ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు. ఉద్యోగం చేసే సమయంలో డబ్బులు ఆదా చేసుకుంటారు. కానీ, వృద్ధాప్యంలో పెన్షన్ డబ్బులను మాత్రం ఆదా చేయలేకపోతుంటారు.
రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం ఉండాలి. అప్పుడు మాత్రమే మీ జీవితం సంతోషంగా ఉంటుంది. లేదంటే ఆర్థికంగా ఒకరిపై ఆధారపడుతూ ఇబ్బందిగా జీవించాల్సి వస్తుంది. భవిష్యత్తులో డబ్బుల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదంటే ఇప్పటినుంచే ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టడం చేయాలి.
ఇప్పుడు అలాంటి ఒక పెన్షన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. మీరు కేవలం ఒకసారి ప్రీమియం చెల్లించడం ద్వారా పెన్షన్ జీవితాంతం పొందవచ్చు. అంతమాత్రమే కాదు.. మీరు కోరుకుంటే.. 40 ఏళ్ల వయస్సు నుంచే ఈ పెన్షన్ తీసుకోవచ్చు. ఈ పెన్షన్ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రీమియం ఒక్కసారి చెల్లిస్తే చాలు.. :
ఎల్ఐసీ అందించే పథకాల్లో ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ ఒకటి. ఈ సరళ్ పెన్షన్ ప్లాన్ అనేది ఇన్‌స్టంట్ యాన్యుటీ ప్లాన్. మీరు పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన్ పొందవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో పెన్షన్ పొందడానికి మీరు 60 ఏళ్ల వయస్సు వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
మీరు 40 ఏళ్ల వయస్సు నుంచి పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పెన్షన్ పథకం ప్రత్యేకత ఏమిటంటే.. పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాలి. పాలసీదారుడు ప్రీమియం చెల్లించిన వెంటనే పెన్షన్ పొందుతారు. మొదటిసారి పొందే పెన్షన్ మొత్తం జీవితాంతం వస్తూనే ఉంటుంది.
రెండు విధాలుగా ఎంచుకోవచ్చు :
సరళ్ పెన్షన్ పథకాన్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు. మొదటిది ఒంటరి జీవితం, రెండవది ఉమ్మడి జీవితం. ఒంటరి జీవితంలో పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ అందుకుంటూనే ఉంటాడు. అతని మరణం తరువాత పెట్టుబడి మొత్తాన్ని నామినీకి తిరిగి ఇస్తారు. ఉమ్మడి జీవితంలో భార్యాభర్తలిద్దరినీ కవర్ చేస్తుంది. ఇందులో ప్రాథమిక పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం అతనికి పెన్షన్ లభిస్తుంది.
నెలకు రూ. వెయ్యి పెన్షన్ :
మీ మరణం తరువాత, అతని/ఆమె జీవిత భాగస్వామికి పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది. ఇద్దరూ మరణిస్తే.. డిపాజిట్ చేసిన మొత్తాన్ని నామినీకి ఇస్తారు. సరళ్ పెన్షన్ పథకం కింద.. మీరు నెలకు రూ. 1000 పెన్షన్ పొందవచ్చు. గరిష్ట పెన్షన్‌కు పరిమితి లేదు. ఏడాదికి రూ. 12వేలు పెన్షన్ పొందవచ్చు. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ పాలసీదారులకు దాదాపు 5 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది.
ఈ పెన్షన్ మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంపై ఆధారపడి ఉంటుంది. పెన్షన్ కోసం మీరు నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంచుకున్న ఎంపిక ప్రకారమే మీకు పెన్షన్ అందుతుంది.
ఏ వయస్సులో ఎంత పెట్టుబడి :
ఎల్ఐసీ వెబ్‌సైట్ ప్రకారం.. మీరు 60 ఏళ్ల వయస్సులో రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే.. మీకు ప్రతి ఏడాది రూ. 64,350 లభిస్తుంది. మీకు 60 ఏళ్లు, మీ భార్యకు 55 ఏళ్లు ఉంటే.. మీరు జాయింట్ లైఫ్ ప్లాన్ కొనుగోలు తీసుకోవచ్చు. మీకు ఏడాదికి రూ. 63,650 లభిస్తుంది. ఈ పథకంలో మీరు 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య ఎప్పుడైనా పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడితో పాటు పెన్షన్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
మీరు 40 ఏళ్ల వయస్సులో సరళ్ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెడితే.. అదే వయస్సు నుంచి మీకు పెన్షన్ ప్రయోజనాలు వర్తిస్తాయి. జీవితాంతం మీరు పెన్షన్ పొందవచ్చు. మీరు ఎల్ఐసీ ఈ ప్లాన్‌లో లోన్ సౌకర్యం కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ కొనుగోలు చేసిన 6 నెలల తర్వాత రుణ సౌకర్యం పొందవచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో మీరు పాలసీని సరెండర్ చేయాలనుకుంటే.. 6 నెలల తర్వాత మీకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.