RBI Repo Rate : లోన్లు తీసుకునేవారికి గుడ్ న్యూస్.. ఆర్బీఐ రేపో రేటు తగ్గించిందోచ్..!

రుణగ్రహీతలకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయి. ముఖ్యంగా హోమ్ లోన్స్ చెల్లించేవారికి వడ్డీ భారం తగ్గనుంది.

RBI Repo Rate : లోన్లు తీసుకునేవారికి గుడ్ న్యూస్.. ఆర్బీఐ రేపో రేటు తగ్గించిందోచ్..!

RBI MPC Meeting 2025

Updated On : February 7, 2025 / 11:08 AM IST

RBI MPC : ఆర్బీఐ రేపో రేటు తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ (ఫిబ్రవరి 7, 2025న) ఎంపీసీ సమావేశం తర్వాత ఆర్బీఐ గవర్నర్ రెపోను 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించారు. ప్రస్తుత 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించారు. ఎంపీసీ సభ్యులందరూ రేటు తగ్గింపుకు అనుకూలంగా ఓటు వేశారని ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.

కోవిడ్ (మే 2020) తర్వాత ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గించడం ఇదే మొదటిసారి. మే 2020 నుంచి ఏప్రిల్ 2022 మధ్య, ఆర్బీఐ రెపో రేటును 4 శాతం వద్దనే ఉంచింది. ఆ తర్వాత ఏప్రిల్ 2022 నుంచి పాలసీ రేట్లను పెంచడం ప్రారంభించింది. ఫిబ్రవరి 2023 వరకు క్రమంగా 6.5 శాతానికి పెంచింది. ఆ తర్వాత రెండేళ్లపాటు మార్చకుండా అలానే ఉంచింది.

Read Also : మీ దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులున్నాయ్.. రెండా? మూడా?.. మీ కోసమే ఈ స్టోరీ.. డోంట్ మిస్..

SDF, MSF కూడా 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతం, 6.5 శాతానికి తగ్గించింది. బ్యాంక్ రేటును కూడా 6.5 శాతానికి తగ్గించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరి ద్రవ్య విధానంపై సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. “భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉంది.

అయినప్పటికీ ప్రపంచ సవాళ్లకు నిరోధకత లేదు. కొత్త పంటల రాక నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు దాదాపు 6.7 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

ఆర్బీఐ రేపో రేటు తగ్గించడంతో బ్యాంకుల్లో తీసుకున్న లోన్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఆర్బీఐ నిర్ణయంతో రుణగ్రహీతలకు భారీ ఉపశమనం కలుగనుంది. అందులోనూ హోమ్ లోన్లు తీసుకున్నవారికి వడ్డీ భారం తగ్గుతుంది. నెలవారీ ఈఎంఐలు చెల్లిస్తున్నవారికి కూడా వడ్డీ భారం తగ్గుతుంది.

రేపు రేటు అనేది ఆర్బీఐ బ్యాంకులకు విధించే వడ్డీ.. ఇప్పుడు ఆ వడ్డీని తగ్గించడంతో బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఇచ్చే లోన్లపై తక్కువ వడ్డీకే ఇస్తాయి. ఆర్బీఐ నిర్ణయంతో మధ్య తరగతి వారికి మేలు జరుగనుంది.

రెపో రేటు తగ్గింపుతో కలిగే ప్రయోజనాలివే :
తక్కువ వడ్డీకే రుణాలు :
బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీకే నిధులను పొందుతాయి. తద్వారా వ్యాపారాలు, వ్యక్తిగత రుణాలు తీసుకునేవారికి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందించేందుకు వీలుంటుంది.

మార్కెట్లో ద్రవ్యత పెరుగుతుంది :

తక్కువ రెపో రేటుతో బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇచ్చేందుకు వీలుంటుంది. తద్వారా ద్రవ్య సరఫరా పెరుగుతుంది. దాంతో ద్రవ్యత కూడా మెరుగుపడుతుంది. ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది.

ఈఎంఐలపై వడ్డీలు తగ్గుతాయి. :
ఫ్లోటింగ్-రేట్ రుణాలు (గృహం, ఆటో లేదా వ్యక్తిగత రుణాలు) ఉన్న ప్రస్తుత రుణగ్రహీతలు తక్కువ సమాన నెలవారీ వాయిదాల (EMI) నుంచి ప్రయోజనం పొందుతారు. తద్వారా ఆర్థిక భారం తగ్గుతుంది.

స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది :
తక్కువ వడ్డీ రేట్లు అనేవి స్థిర-ఆదాయ పెట్టుబడులను (బాండ్ల వంటివి) తక్కువ ఆకర్షణీయంగా చేస్తాయి. పెట్టుబడిదారులు నిధులను ఈక్విటీలలోకి పెట్టేందుకు వీలుంటుంది. దాంతో స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి.

Read Also : జీతం చాలట్లేదు.. అప్పులు క్లియర్ చేసేద్దాం అని గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ మిస్టేక్స్ చేయొద్దు..

గృహనిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహం :

గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగానికి అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. తగ్గిన గృహ రుణ వడ్డీ రేట్లతో ఆస్తి కొనుగోళ్లను సరసమైన ధరకే పొందవచ్చు. అంతేకాదు.. రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా డిమాండ్‌ పెరుగుతుంది.