RIL Financial Support : రిలయన్స్ పెద్ద మనస్సు.. కొవిడ్ బాధిత ఉద్యోగి కుటుంబాలకు 5ఏళ్లు పూర్తి వేతనం
కరోనా సంక్షోభ సమయంలో వైరస్ బాధిత ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ (RIL) కీలక నిర్ణయం తీసుకుంది.

Ril To Give 5 Years Of Salary To Families Of Employees Who Died Of Covid
RIL Covid-19 Financial Support : కరోనా సంక్షోభ సమయంలో వైరస్ బాధిత ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ (RIL) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబానికి 5 ఏళ్ల పూర్తి వేతనం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అంతేకాదు.. చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు విద్యను అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు రిల్ చైర్ పర్సన్, ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కీలక ప్రకటన చేశారు.
అలాగే ఆఫ్ రోల్స్ ఎంప్లాయిల కుటుంబాలకు పదిలక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ బారిన పడ్డ ఉద్యోగులు, కరోనా బాధిత కుటుంబాలు పూర్తిగా కోలుకునేంతవరకు జీతాలతో కూడిన సెలవుల్ని మంజూరు చేసింది. కరోనాతో చనిపోయిన ఉద్యోగి భార్య, పేరెంట్స్, పిల్లల ఆస్పత్రి ఖర్చుల కోసం 100 శాతం ప్రీమియం చెల్లింపును రిలయన్సే భరించనుంది.
చనిపోయిన ఉద్యోగి పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్ వరకు దేశంలో ఏ ఇనిస్టిట్యూట్‌లోనైనా 100 శాతం ట్యూషన్ ఫీజు, హాస్టల్ సౌకర్యానికి అవసరమయ్యే ఖర్చులనూ రిలయన్స్ ఫౌండేషన్ అందించనుంది. కొవిడ్-19 ప్రభావిత ఉద్యోగుల కోసం రిలయన్స్ లిబరల్ లీవ్ పాలసీని అమలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో వడ్డీ లేని జీతం అడ్వాన్స్‌గా 3 నెలల వేతనానికి ఆర్థిక సహాయం అందిస్తోంది. ఒక ఉద్యోగి దురదృష్టవశాత్తు మరణిస్తే.. వారి కుటుంబానికి రిలయన్స్ ఆర్థిక సహాయం అందిస్తోంది. పిల్లల విద్యా ఖర్చులను కూడా భరించనున్నట్టు RIL తన వార్షిక నివేదికలో తెలిపింది.