Starlink India : భారత్‌కు స్టార్‌లింక్ వచ్చేస్తోందోచ్.. శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు లాంచ్ డేట్, ప్లాన్ ధర, స్పీడ్ ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్..!
Starlink India : స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు లాంచ్‌కు రెడీగా ఉంది. భారత ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అప్రూవల్స్ కోసం ఎదురుచూస్తోంది. లాంచ్ డేట్, ధర వివరాలు ఇలా ఉన్నాయి.

Starlink India
Starlink India : అతి త్వరలో భారత్‌కు స్టార్‌లింక్ వచ్చేస్తోంది. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ సొంత కంపెనీ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ భారత మార్కెట్లోకి ఎంట్రీకి రెడీగా ఉంది. ఇప్పటివరకు, స్టార్‌లింక్ భారత ప్రభుత్వం నుంచి దాదాపు అన్ని ఆమోదాలను పొందింది. కొన్ని లాంఛనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
స్టార్‌లింక్ శాటిలైట్ సర్వీసు అందుబాటులోకి వస్తే ప్రధానంగా మారుమూల (Starlink India) ప్రాంతాలలో ప్రజలకు ఫాస్ట్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. దేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసు ధర, లభ్యత, స్పీడ్‌కు సంబంధించి అంచనా వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
స్టార్‌లింక్ ఇండియా లాంచ్ తేదీ, స్పీడ్, లభ్యత :
స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌కు SATCOM నుంచి ఒకటి.. స్పెక్ట్రమ్‌కు మరొకటి ఇలా రెండు ఆమోదాలు పొందాల్సి ఉంది. ఈ రెండు ఆమోదాలు 2025 చివరి నాటికి పొందే అవకాశం ఉందనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ కాలక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ 2026 మొదటి త్రైమాసికం నాటికి భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
లభ్యత విషయానికొస్తే.. భారత ప్రభుత్వం దేశంలో స్టార్‌లింక్ కలిగిన కనెక్షన్ల సంఖ్యపై గరిష్ట పరిమితిని విధించింది. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు భారత మార్కెట్లో 2లక్షల కన్నా ఎక్కువ అకౌంట్లను కలిగి ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది.
స్పీడ్ విషయానికి వస్తే.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ 25Mbps నుంచి 225Mbps మధ్య స్పీడ్ ఉంటుందని అంచనా. స్పీడ్ అంతగా ఆకట్టుకోకపోవచ్చు. కానీ, ఈ సర్వీసు ప్రత్యేకంగా మారుమూల ప్రాంతాలకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్నెట్ చౌకగా లభించే పట్టణ ప్రాంతాల్లోని ఇంటర్నెట్ ప్రొవైడర్ల నుంచి స్టార్‌లింక్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
భారత్‌లో స్టార్‌లింక్ ధర (అంచనా) :
స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ సింగిల్ సెటప్ ఖర్చు దాదాపు రూ. 30వేలు ఉంటుందని అంచనా. కానీ, మారుమూల ప్రాంతాలలో స్టేబుల్ ఇంటర్నెట్ కోరుకునే వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని లీక్‌లను పరిశీలిస్తే.. ఈ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసు కోసం నెలవారీ ప్రారంభ ధర రూ. 3,300 చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత హై-స్పీడ్ డేటా ప్లాన్లను పొందవచ్చు.