Insta Maid Service : కేవలం 15 నిమిషాల్లో మీ ఇంటికి పనిమనిషి.. ‘ఇన్‌స్టా మెయిడ్’ సర్వీస్.. ఏంటి? నెటిజన్లు ఎందుకు అంతలా విమర్శిస్తున్నారంటే?

Insta Maid service : అర్బన్ కంపెనీ ఇన్‌స్టా మెయిడ్స్ సర్వీసుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సర్వీసు కోసం 'మెయిడ్' అనే పదాన్ని వాడటం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది.

Urban Company Insta Maid service

Insta Maid Service : ప్రస్తుత రోజుల్లో ఇంట్లో పనిమనిషి దొరకాలంటే చాలా కష్టమే. బిజీ లైఫ్‌లో చాలామంది ఇంట్లో పనులు చేసుకోవడం కష్టంగా మారింది. అందుకే  ఇంటి మనిషిగా ఎవరైనా పెట్టుకుంటే బాగుండు అని చూస్తుంటారు. అందులోనూ పనిమనిషిని వెతకడం కూడా చాలా కష్టమే. ఇన్ స్టంట్‌గా ఎవరు దొరకరు కూడా.

అందుకే ఇలాంటి వారికోసమే హోం సర్వీసులను అందించే అర్బన్ కంపెనీ ఇటీవలే ‘ఇన్‌స్టా మెయిడ్స్’ అనే కొత్త సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసు ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే మీ ఇంట్లో పనిమనిషి రప్పించుకోవచ్చు. ఇందుకోసం బుకింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఇళ్లలో పనిచేసే వారికి ఫుల్ డిమాండ్ పెరగడంతో ముంబైలో ముందుగా ఈ ఇన్‌స్టా మెయిడ్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read Also : AC Safety Tips : వేసవిలో ఏసీలు పేలుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త.. మీ ఏసీని వాడే ముందు ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. సేఫ్టీ టిప్స్ మీకోసం..!

అయితే, అర్బన్ కంపెనీ ‘ఇన్‌స్టా మెయిడ్’ సర్వీసుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సర్వీసును కొందరు స్వాగతించగా, మరికొంతమంది విమర్శకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఉపాధి కల్పన ముసుగులో కార్మికులను దోపిడీ చేస్తుందని అర్బన్ కంపెనీని విమర్శించారు.

గంటకు రూ. 245 చెల్లించి బుకింగ్ :
ప్రస్తుతం ముంబైలో పైలట్ దశలో ఈ సర్వీసు అందుబాటులో ఉంది. మొదటిసారిగా బుకింగ్ చేసుకుంటే గంటకు రూ. 49 చెల్లిస్తే చాలు.. మీ ఇంటికే పనిమనిషి వచ్చి అన్ని క్లీన్ చేస్తుంది.. కావాల్సిన వంట చేసి పెడుతుంది. మ్యాపింగ్ వంటి అన్ని పనులను చకచకా చేసి వెళ్తుంది. వాస్తవానికి, ఈ సర్వీసుకు సాధారణ ధర గంటకు రూ. 245గా నిర్ణయించింది అర్బన్ కంపెనీ. ప్రమోషన్‌లో భాగంగా అర్బన్ కంపెనీ కొన్ని విషయాల పట్ల క్లారిటీ ఇచ్చింది.

సంస్థ సహ వ్యవస్థాపకుడు వరుణ్ ఖైతాన్ మాట్లాడుతూ.. ‘ఇన్‌స్టా మెయిడ్’ అనేది డిమాండ్ ఉన్న ఇళ్లలో పనిచేసేందుకు అద్భుతమైన పరిష్కారమని అభివర్ణించారు. ‘‘మా సర్వీసు భాగస్వాముల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నాం.

ఈ కొత్త సర్వీసు ద్వారా ‘ఇన్‌స్టా మెయిడ్’ పార్టనర్లు గంటకు రూ. 150 నుంచి రూ. 180 సంపాదిస్తారు. అంతేకాదు.. ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్, యాక్సిడెంటల్ కవరేజ్ కూడా లభిస్తాయి. రోజుకు కనీసం 6 గంటలు, నెలలో 22 రోజులు పనిచేసేవారికి కనీసం రూ. 20వేలు సంపాదిస్తారు.’’ అని కంపెనీ పోస్టులో పేర్కొన్నారు.

కార్మిక సంఘాలు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు :
ఈ సోషల్ ప్రకటనతో అర్బన్ కంపెనీ సర్వీసులపై సోషల్ మీడియా యూజర్లు, సామాజిక కార్యకర్తలు, గిగ్ వర్కర్ యూనియన్ల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసింది. అర్బన్ కంపెనీ సోషల్ మీడియా పోస్ట్‌పై కార్మిక సంఘాలు గట్టిగానే స్పందించాయి. ఇది మూమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నాయి.

‘ఇన్నోవేషన్’ పేరుతో కంపెనీ చౌకగా శ్రమ దోపిడీ చేయడం ఆపాలని పలు సంఘాలు హెచ్చరించాయి. భారతీయ స్టార్టప్‌లు టెక్నాలజీని వాడుకుని ఇలాంటి శ్రమ దోపిడీ చేసేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్నాయని అదేదో ‘ఇన్నోవేషన్’గా లేబుల్ చేస్తున్నాయని మండిపడ్డారు.

ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) ఈ కొత్త మోడల్‌ను తీవ్రంగా ఖండించాయి. ఇదంతా అర్బన్ కంపెనీ హైటెక్ శ్రమ దోపిడీగా అభివర్ణించాయి. వెంటనే ఈ సర్వీసులను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి.

అర్బన్ కంపెనీ ఈ సర్వీసును ప్రారంభించే ముందు కార్మిక సంఘాలు, నియంత్రణ సంస్థలతో సంప్రదించలేదని (IFAT) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వర్క్ మోడల్‌ కొనసాగించే ముందు న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రత, సురక్షితమైన పని కల్పించేలా కార్మిక ప్రతినిధులు, కార్మిక హక్కుల సంస్థలతో సహకరించాలని యూనియన్ అర్బన్ కంపెనీని కోరింది.

గిగ్ వర్క్ నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. గౌరవాన్ని పణంగా పెట్టి వెట్టిచాకిరి చేయించుకోవడాన్ని తప్పుబట్టాయి. ముఖ్యంగా మహిళల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి.

‘ఇన్‌స్టా మెయిడ్స్’ సర్వీసు ఏంటి? :
ఈ సర్వీసు కోసం యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న తర్వాత మీ ఇంటికి ఒక పనిమనిషి వస్తుంది. ముందుగా సర్వీసులో ఇంట్లో గిన్నెలు కడగడం, ఊడ్చడం, తుడవడం, ఫుడ్ రెడీ చేయడం వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. మొదటిసారి బుకింగ్ చేసుకంటే గంటకు ధర రూ.49గా నిర్ణయించింది.

Read Also : iQOO vs Poco vs Nothing : ఈ మూడు ఫోన్లు కిర్రాక్.. పోటాపోటీ ఫీచర్లు.. ఏది కొంటే బెటర్..? రూ.25వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా?

ఏయే సేవలు ఉన్నాయంటే? :
‘ఇన్‌స్టా మెయిడ్స్’లో డిష్‌వాషింగ్, ఊడ్చడం, మాపింగ్, ఫుడ్ రెడీ చేయడం అనేక రకాల సర్వీసులు ఉంటాయి. సాధారణంగా ఇంటి పనిమనిషి ఈ పనులన్నీ చేస్తుంటారు. అర్బన్ కంపెనీ ఇప్పటికే ఇంటి శుభ్రపరచడం, బాత్రూమ్, వంటగది శుభ్రపరచడం, సోఫా, కార్పెట్ శుభ్రపరచడం, చెదపురుగుల నియంత్రణ, బెడ్ బగ్ నియంత్రణ, బొద్దింకలు, చీమల నియంత్రణ వంటి అనేక సర్వీసులను అందిస్తోంది. దాంతో పాటు, అర్బన్ కంపెనీ ఏసీ రిపేర్, ఇన్‌స్టాలేషన్, అన్‌ఇన్‌స్టాలేషన్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కార్పెంటర్, పెయింటింగ్ వంటి సర్వీసులను కూడా అందిస్తుంది.