Gold: త్వరలోనే ఈ సమస్య రానుందా? దీని నుంచి తప్పించుకోవడానికి బంగారం కొనడమే మార్గమా?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మార్చి 19న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తూ తీసుకునే నిర్ణయాలు పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వడ్డీ రేట్లలో కోతల వల్ల సామాన్యులు, వ్యాపారులకు రుణాలు తక్కువ వడ్డీలకే లభించే అవకాశం ఉంటుంది. అయితే, వడ్డీ రేట్లలో కోత పెట్టుబడిదారులకు మాత్రం శుభవార్తేం కాదు. వడ్డీ రేట్ల కోతలు ఆర్థిక బలహీనతను, మందగమనాన్ని సూచిస్తాయి. పెట్టుబడిదారులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది.
ఇది స్టాక్ మార్కెట్లను దెబ్బతీస్తుంది. అలాగే, బాండ్లు, సేవింగ్స్ అకౌంట్స్ వంటి స్థిర ఆదాయ పెట్టుబడులపై రాబడి తగ్గవచ్చు. అయినప్పటికీ, కేంద్ర బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను ప్రకటించినప్పుడు కూడా బంగారం ధరలు, రియల్ ఎస్టేట్, కొన్ని స్టాక్‌లకు బూస్ట్ వస్తుంది.
కొంతకాలంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఇది ఊహించని పరిణామమేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధిక వడ్డీ రేట్లు ఉంటే సాధారణంగా వృద్ధి రేటు తగ్గుతుంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మార్చి 19న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పెట్టుబడిదారులు దీని కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ దాని ప్రభావం అంతగా పడకుండా ఉండేందుకు పెట్టుబడిదారులు బంగారం, బాండ్స్ వంటి వాటిల్లో పెట్టబడులు పెట్టొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు నగదు సేవింగ్స్, బాండ్లపై రాబడి తగ్గుతుంది. బంగారంపై పెట్టుబడులు పెరిగేలా చేస్తుంది. బంగారం డిమాండ్ పెరగడానికి ఈ పరిస్థితి దారితీస్తుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు బంగారం ధర దాదాపు 11 శాతం పెరిగింది. ధరలు పెరిగినప్పుడు (ద్రవ్యోల్బణం వేళ) బంగారం మిమ్మల్ని రక్షిస్తుంది.
బంగారంలో పెట్టుబడులకు డిమాండ్ బలంగా ఉందని, పెట్టుబడులకు స్వర్గధామంగా దీన్ని భావిస్తుండడంతో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా తెలిపింది. భౌతికంగా సపోర్టు ఉన్న బంగారు ఈటీఎఫ్‌లలో ఫిబ్రవరిలో ఇన్‌ఫ్లోలు భారీగా పెరిగాయని చెప్పింది. 2022 మార్చి నుంచి ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇన్‌ఫ్లోలు భారీగా పెరిగాయని వివరించింది.
ఇటీవల, ట్రంప్ సుంకాలు, వాణిజ్య అనిశ్చితి వల్ల మార్కెట్ అస్థిరతను పెరిగింది. దీంతో బంగారాన్ని నమ్మకమైన పెట్టుబడిగా పెట్టుబడిదారులు చూస్తున్నారని ది గోల్డ్ బులియన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రిక్ కందా అన్నారు. కాబట్టి వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ బంగారంపై పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే, పలు రకాల బాండ్లు, యూకే డివైడెన్డ్ స్టాక్స్ వంటివి కూడా వడ్డీ రేట్లు తగ్గిన సమయంలోనూ లాభదాయకమని నిపుణులు అంటున్నారు.