why international shopping malls lined up to hyderabad
International shopping malls in Hyderabad : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో రెసిడెన్షియల్, కమర్షియల్, ఆఫీస్ స్పేస్‌తో పాటు రిటైల్ స్పేస్‌కు చక్కని డిమాండ్ ఉంది. అయితే కరోనా సమయంలో రిటైల్ రంగం కుదేలు కావడంతో కొంత స్తబ్దత ఏర్పడింది. కాని ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. కరోనా ప్రభావం నుంచి షాపింగ్ మాల్స్ చాలా వేగంగా కోలుకున్నాయి. మాల్స్‌లోని రిటైల్ దుకాణాల్లో కొనుగోలుదారుల సందడి, మల్టీప్లెక్స్‌లలో వీక్షకుల తాకిడి పెరగడంతో మాల్స్ నిర్వాహకుల్లో మళ్లీ జోష్ వచ్చింది.
మరోవైపు దేశవ్యాప్తంగా కొత్త షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. అందులోనూ హైదరాబాద్‌కు దేశీయ మాల్స్‌తో పాటు అంతర్జాతీయ షాపింగ్ మాల్స్ క్యూ కట్టాయి. దీంతో విశ్వనగరంలో రిటైల్ మార్కెట్ స్పేస్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగా నగరంలోని పలు ప్రాంతాలలో షాపింగ్ మాల్స్ నిర్మాణం తుదిదశలో ఉన్నాయి. హైదరాబాద్‌లో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో రిటైల్ స్పేస్ నిర్మాణం పూర్తికాకముందే లీజులకు సంబంధించిన అగ్రిమెంట్స్ జరుగుతోన్నాయి.
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నగరంలో రెండున్నర లక్షల చదరపు అడుగుల రిటైల్ స్థల లీజు లావాదేవీలు జరిగాయని CBRE నివేదిక చెబుతోంది. గత ఏడాది ఇదే కాలంలో కేవలం లక్ష చదరపు అడుగుల స్థలం మాత్రమే లీజింగ్ కార్యకలాపాలు జరిగాయి. హైదరాబాద్‌లో రిటైల్ లీజుల్లో స్టోర్‌ల వాటా 33 శాతం ఉండగా, ఫ్యాషన్, అపరెల్స్ షోరూమ్‌ల వాటా 30 శాతం, ఫుడ్ కోర్టుల వాటా 11 శాతంగా ఉంది.
Also Read: ఎన్నికలయ్యాకే ఇళ్లు కొంటామంటున్న బయ్యర్లు.. ఎక్స్‌పర్ట్స్ ఏమంటున్నారు?
హైదరాబాద్‌లోని సోమాజిగూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరు, ఉప్పల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, హైస్ట్రీట్‌లలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగాయి. ఈ క్యాలెండర్ ఇయర్ తొలి అర్ధభాగంలో హైదరాబాద్‌లో రిటైల్ లీజులు 137 శాతం పెరిగాయని CBRE తన తాజా రిపోర్ట్‌లో వెల్లడించింది.
Also Read: రియాల్టీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతోన్న ప్రజలు.. ఎందుకంటే?
దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే రిటైల్ స్పేస్ లీజు తక్కువగా ఉండటం బాగా కలిసివస్తోందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌టీ సగటు లీజు ధర 65 రూపాయలుగా ఉంది. ఇక ఈ యేడాది ముగింపు నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో రిటైల్ లీజులు 17 నుంచి 28 శాతం మేర పెరిగి 55 నుంచి 60 లక్షల ఎఫ్‌ఎస్‌టీకి చేరుతుందని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.