తాగుబోతు తల్లిని హత్య చేసిన మైనర్ కొడుకులు

సొసైటీ లో మగవాడు తాగి వచ్చి కుటుంబాన్ని రాచి రంపాన పెట్టటం మనం చూస్తూ ఉన్నాము. మద్యానికి బానిసైన భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటే కుటుంబం రోడ్డున పడటం వంటి కధలు చాలా వింటూ ఉంటాం.. కానీ…… తాగొచ్చి వేధింపులకు గురి చేస్తున్న తాగుబోతు తల్లిని హత్య చేశారు ఇద్దరు మైనర్ కొడుకులు.
ఒడిషా, భువనేశ్వర్ లోని సుందర్ పాద్ ఏరియాలో ఒక మహిళ(40) తన ఇద్దరు మైనర్ కొడుకులతో అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది. ప్రతి రోజు ఆమె మద్యం తాగి వచ్చి పిల్లలు ఇద్దరినీ హింసించేది. తల్లి పెట్టే బాధలు భరించలేని చిన్నారులు విసిగి పోయారు. ఇక ఆమె బాధలు భరించలేక తల్లిను తుదముట్టించాలనుకున్నారు.
సెప్టెంబర్ 16 బుధవారం రాత్రి ఫుల్లుగా తాగి వచ్చిన తల్లి, కొడుకులతో గొడవ పడటం మొదలెట్టింది. వారిని మాటలతో, చేతలతో హింసించ సాగింది. అప్పటికే తల్లిని తుద ముట్టించాలనుకున్న పిల్లలు పాలిథిన్ కవర్ తో ఆమె ముఖాన్ని కప్పేసి ఊపిరాడకుండా చేశారు. ఇనుప రాడ్ తో తలపై బలంగా కొట్టారు.
https://10tv.in/parents-reject-relationship-minor-girl-commits-suicide/
ఊపిరాడక పోవటం, తలలోంచి ఎక్కువగా రక్తం పోవటంతో ఆమె అక్కడి కక్కడే మరణించింది. తల్లి చనిపోయిందని నిర్ధారించుకున్న పిల్లలు శవాన్ని బాత్ రూం లోకి లాగి…. పెంపుడు కుక్కను తీసుకుని అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డు దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి చెప్పారు.
మా ఇంట్లో దొంగలు పడ్డారని ..తల్లిని కొట్టి చంపారని అతడికి చెప్పారు. సెక్యూరిటీ గార్డు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి విచారణ చేపట్టారు. తల్లిని తామే చంపామని , తాగి వచ్చి తల్లి పెట్టే టార్చర్ భరించలేకే ఈ దారుణానికి ఒడి గట్టినట్లు మైనర్ బాలురు ఒప్పుకున్నారు.