మందుపాతర పేల్చిన మావోయిస్టులు…సీఆర్పీఎఫ్ అధికారి మృతి

  • Published By: murthy ,Published On : November 29, 2020 / 09:00 AM IST
మందుపాతర పేల్చిన మావోయిస్టులు…సీఆర్పీఎఫ్ అధికారి మృతి

Updated On : November 29, 2020 / 9:53 AM IST

crpf assistant commandant died : చత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు పేల్చిన మందు పాతర ఘటనలో సీఆర్పీఎప్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి చెందాడు. సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా మవోయిస్టులు శనివారం సాయంత్రం ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో కోబ్రా బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ నితిన్‌ భలేరావు మరణించారు. మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.


సుక్మా జిల్లాలోని చింతఫుగా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా 206 బెటాలియన్‌ జవాన్లు, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు సంయుక్తంగా శనివాహరం సాయంత్రం గాలింపు చేపట్టారు. ఈక్రమంలో తాడ్మెట్ల వద్ద అప్పటికే అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చివేశారు.



దీంతో కోబ్రా బెటాలియన్‌లోని ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అసిస్టెంట్‌ కామాండెంట్‌ నితిన్‌ భలేరావు మరణించారు. మరో నలుగురు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.