మహిళా కానిస్టేబుల్ పై వాట్సప్ లో కామెంట్లు…..ఆరుగురు సహోద్యోగులపై చర్యలు

Six constables suspended for obscene comments on woman cop : తమతో కలిసి పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ పై వాట్సప్ గ్రూపుల్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆమె సహోద్యోగులు 6 గురిపై అధికారులు వేటు వేశారు.
ఉత్తర ప్రదేశ్ లోని బిల్సండా పోలీసు స్టేషన్ కు కొంత మంది కొత్త కానిస్టేబుళ్లను కేటాయించారు. అక్కడ పని చేస్తున్న పాత,కొత్త సిబ్బంది అంతా కలిసి ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు.
వాట్సప్ గ్రూప్ లో తమ డిపార్ట్ మెంట్ కు సంబందించిన సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఆ గ్రూప్ లోనే ఉన్న తమ సహోద్యోగిని, ఓ మహిళా కానిస్టేబుల్ నుద్దేశించి ఒక కానిస్టేబుల్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలకు మద్దతుగా మరోక అయిదుగురు కానిస్టేబుళ్లు కూడా అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారు.
అది చూసిన సదరు మహిళా కానిస్టేబుల్ బాధపడుతూ స్టేషన్ ఎస్సై బిర్జారామ్ కి ఫిర్యాదు చేసింది. తోటి ఉద్యోగులు చేసిన వ్యాఖ్యలను చూపించింది. దీంతో ఆయన నిందితులైన కానిస్టేబుల్స్ రవి తవార్, రజత్ కుమార్, సచిన్ కుమార్, చేతన్ కుమార్, ఉమాంగ్ గుప్తా మరియు ఆర్చిన్ తోమార్ల ను పిలిచి మందలించారు.
కానీ, విషయం జిల్లా ఎస్పీ జై ప్రకాష్ యాదవ్ కి చేరింది. వెంటనే ఆయన ఆరుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వమని బిసాల్పూర్ సీఐ ను ఆదేశించారు. వారిపై శాఖాపరమైన దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.