సికింద్రాబాద్ లో భారీ చోరీ

సికింద్రాబాద్ లోని ఓల్డ్ బోయిన్ పల్లి లో భారీ చోరీ జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దుండగులు మూడు కిలోల బంగారం, 18 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే…ఓల్డ్ బోయిన్పల్లి లోని మల్లికార్జున నగర్ లో ఇంటికి వేసిన తాళాలు.. వేసినవి వేసినట్టే ఉన్నాయి. కానీ ఇంట్లో ఉన్నా బంగారు ఆభరణాలు, నగదు మాయమయ్యాయి. దాదాపు మూడు కిలోల బంగారం, సుమారుగా 18 లక్షల రూపాయల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబరు21, సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు చోరీకి పాల్పడినట్లు తెలిపారు.
బాధితురాలు సరళ వడ్డీ వ్యాపారం వ్యాపారం చేస్తుండడంతో ఇంట్లో పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు, నిల్వ ఉన్నట్లు తెలిసింది. ఇంట్లో సొత్తు పోయినట్లు గుర్తించిన బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా బేగంపేట ఎసిపి రామ్ రెడ్డి, క్లూస్ టీమ్ వచ్చి ఇంట్లో జరిగిన దొంగతనానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. ఇది ఇంట్లో వారి పనా ? లేక బయట వారు ఎవరైనా వచ్చి చేశారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చోరీ జరిగిన స్థలాన్నీ డీసీపీ కరుణాకర్,ఏసీపి పీ.చంద్ర శేఖర్ పరిశీలించారు. బాధితులు వడ్డీ వ్యాపారం చేస్తుండడంతో డబ్బులకు లెక్కలు చూపించడం కష్టమని భావించి పోయిన సొత్తుకంటే తక్కువ మొత్తాన్ని పోయినట్లు చెపుతూ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. చోరీ విషయమై బాధితులు నోరు మెదపకుండా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.