Mumbai Airport: ముంబై ఎయిర్‌పోర్టులో 61 కేజీల బంగారం పట్టివేత.. ఏడుగురు అరెస్ట్
ముంబై ఎయిర్‌పోర్టులో ఆదివారం ఒక్క రోజే రూ.32 కోట్ల విలువైన 61 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం తరలిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Mumbai Airport: ముంబై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు 61 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమంగా తరలిస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు. ఆదివారం ముంబై, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ బంగారాన్ని అధికారులు సొంతం చేసుకున్నారు.
దీని విలువ దాదాపు రూ.32 కోట్లు ఉంటుందని అంచనా. ముంబై ఎయిర్‌పోర్టు చరిత్రలో ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో బంగారం పట్టుబడటం ఇదే మొదటిసారి. గతంలో ఎప్పుడూ ఇంత బంగారం ఒకే రోజు దొరకలేదు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టాంజానియా నుంచి నలుగురు భారతీయులు ఇండియా తిరిగి వచ్చారు. వాళ్లను అధికారులు తనిఖీ చేయగా ఈ బంగారం విషయం బయటపడింది. వీళ్లు ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన బెల్టు ధరించి వచ్చారు. వాటిని పూర్తిగా శరీరానికి చుట్టుకుని తీసుకొచ్చారు. వాటి లోపల చిన్న పాకెట్లలో బంగారం ఉంది. ఇలా మొత్తం ఈ నలుగురు ప్యాసింజర్ల నుంచి మొత్తం 53 కేజీల బరువున్న, రూ.28 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం యూఏఈలో తయారైనట్లు అధికారులు గుర్తించారు.
వీరిని అదుపులోకి తీసుకుని, 14 రోజుల రిమాండ్‌కు పంపించారు. సౌదీకి చెందిన కొందరు వ్యక్తులు వారికి ఈ బెల్టులను దోహాలో అందించినట్లు చెప్పారు. మరో ఘటనలో దుబాయ్ నుంచి వస్తున్న ముగ్గురు ప్రయాణికుల నుంచి 8 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3.88 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ముగ్గురు ప్రయాణికుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరిలో ఒక మహిళ వయసు 60 ఏళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.