Naveen Case Update : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు విచారిస్తున్నారు. హరిహరకృష్ణను ఈ నెల 9 వరకు కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ చెప్పారు. హరిహరకృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నిహారిక, హసన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
ఫిబ్రవరి 17న నవీన్ ను హత్య చేసిన హరిహరకృష్ణ.. 24న పోలీసుల ముందు లొంగిపోవడంతో హత్యోదంతం వెలుగుచూసింది. తన ప్రియురాలు నిహారిక కోసమే నవీన్ ను హత్య చేసినట్లు పోలీస్ కస్టడీలో తెలిపాడు. దీంతో నిహారికతో పాటు హరిహరకృష్ణ స్నేహితుడు హసన్ ను పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు.
నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో హసన్, నిహారికను రిమాండ్ కు తరలించారు. హసన్ ను చర్లపల్లి జైలుకి తరలించగా, నిహారికను చంచల్ గూడ జైలుకి తరలించారు. నవీన్ హత్య కేసులో ఏ-1గా హరిహరకృష్ణ, ఏ-2గా హసన్, ఏ-3గా నిహారికను చేర్చారు.
గత నెల 17న నవీన్ ను హరి హత్య చేశాడు. 24న పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీస్ కస్టడీలో అతడు చెప్పిన సమాచారం ఆధారంగా హనస్, నిహారికలను పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ ను హరిహరకృష్ణ హత్య చేసి శరీర భాగాలను వేరు చేసిన తర్వాత వాటిని తరలించేందుకు సహకరించడంతో పాటు రాత్రి తన ఇంట్లో హరికి ఆశ్రయం ఇచ్చినందుకు హసన్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. హత్య గురించి హరిహరకృష్ణ చెప్పినా.. పోలీసులు సహా ఎవరికీ సమాచారం ఇవ్వకపోవడం, హత్య అనంతరం ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను, సందేశాలను తొలగించి సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం చేసినందుకు నిహారికను నిందితురాలిగా చేర్చారు.(Naveen Case Update)
నవీన్ కేసులో దోషులకు ఉరిశిక్ష వేయాలని నవీన్ తండ్రి శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ఉరిశిక్ష పడితేనే తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. కష్టపడి తన కొడుకును బీటెక్ వరకు చదివించానన్నారు. నవీన్ కు మొదటి నుంచి గొడవలంటే భయం అన్నారు. నవీన్ పై చాలా ఆశలు పెట్టుకున్నామని తండ్రి శంకర్ నాయక్ చెప్పారు. రెండు నెలలు అయితే బీటెక్ పూర్తి అవుతుందని, లైఫ్ బాగుంటుందని ఆశించామన్నారు.
అంతలోపే నవీన్ ను హత్య చేశారని కన్నీటిపర్యంతం అయ్యారు. దోషులకు ఉరిశిక్ష వేయకపోతే పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని శంకర్ నాయక్ హెచ్చరించారు. నవీన్ కేసులో ఏ-1గా హరి, ఏ-2గా హసన్, ఏ-3గా నిహారికను చేర్చారు పోలీసులు.