కర్నూలు ఆర్టీవోకి ఉగాండాలో బ్యాంక్ అకౌంట్
కర్నూలు జిల్లా మోటారు వెహికిల్ ఇన్ స్పెక్టర్ అక్కిరాజు శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.20 కోట్ల పైనే అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

కర్నూలు జిల్లా మోటారు వెహికిల్ ఇన్ స్పెక్టర్ అక్కిరాజు శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.20 కోట్ల పైనే అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
అవినీతి తిమింగళాలపై ఏసీబీ దాడులు ముమ్మరం చేశారు. మూడు నెలల నుంచి కర్నూలు జిల్లాలో అధికారులు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతికి పరాకాష్టగా మారిన క్రమంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. గురువారం (అక్టోబర్ 3, 2019) మోటారు వెహికిల్ ఇన్ స్పెక్టర్ అక్కిరాజు శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివప్రసాద్ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో దాడులు చేపట్టారు.
ఏకకాలంలో 5 చోట్ల అధికారులు దాడులు నిర్వహించారు. కర్నూలు, హైదరాబాద్, తాడిపత్రి, బెంగళూరులో సోదాలు నిర్వహించారు. రూ.20 కోట్ల పైనే అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. కేజీ బంగారం, వెండి, కీలక డాక్యుమెంట్లు, రూ.లక్షా 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో ఖరీదైన ఇల్లు, బెంగళూరులో జీ ప్లస్ 3 ఇల్లు గుర్తించారు. అతని భార్య పేరు మీద రెండు సూట్ కేసు కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. బినామీ గాజుల రామారావు పేరు మీద విలువైన ఆస్తులు గుర్తించారు. ఉగాండలో బ్యాంకు ఖాతా ఉన్నట్లు గుర్తించారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు.
కర్నూలు ఏసీబీ డీఎస్ పీ నాగభూషణం మాట్లాడుతూ పంచలింగాల చెక్ పోస్టులో శివప్రసాద్ పని చేస్తున్నారు. ఉదయం నుంచి ఐదు చోట్ల సోదాలు జరిపాం.. బెంగుళూరులో రెండు చోట్ల, తాడిపత్రిలో ఒక చోట, కర్నూలులో ఒక చోట, హైదరాబాద్ లో ఒకచోట సోదాలు జరిపాం. బెంగళూరులోని కార్తీక్ నగర్ బస్ స్టాప్ లో జీ ప్లస్ 7 ఆక్సీ ట్రీ సర్వీస్ అపార్ట్ మెంట్ పేరుతో శివప్రసాద్ బిల్డింగ్ నిర్మించారు. డాక్యుమెంట్ వ్యాల్యూ ప్రకారం దాని విలువు రూ.3 కోట్లు ఉంటుంది.
బెంగళూరులోని కుందాల్ హళ్లీ దగ్గర జీ ప్లస్ 1 అనే ఇండిపెండెంట్ రేంజల్ హౌజ్ ఉంది.. డాక్యుమెంట్ వ్యాల్యూ ప్రకారం దాని విలువ రూ.2.7 కోట్లు ఉంటుంది. హైదరాబాలోని గచ్చిబౌలిలో జయభేరి ఆరెంజ్ ఆర్కేడ్ లో ఏ 103 అనే ప్లాట్ ఉంది. డాక్యమెంట్ వ్యాల్యూ ప్రకారం దీని విలువ రూ.1.2 కోట్లు ఉంటుంది. గాజుల రామారంలో ఒక ఎకరా ల్యాండ్ కొన్నాడు. డాక్యుమెంట్ వ్యాల్యూ ప్రకారం దాని విలువ ఒక కోటి ఉంటుంది.
సోదాల్లో అతనికి సంబంధించిన లాకర్ గుర్తించామని..దాని ఓపెన్ చేయాల్సివుంది. అతనికి మొత్తం 11 బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. ఒక బ్యాంక్ అకౌంట్ ఉగాండలో ఉంది. మేము మెయిల్ పెట్టామని.. మెయిల్ లో రిప్లై రావాల్సివుందన్నారు. వెరిఫై చేసిన తర్వాత ఆ అకౌంట్ లో ట్రాన్సాక్షన్స్ జరిగాయా లేదా అన్నది చెప్పాల్సివుంటుంది. శివప్రసాద్ ఇంట్లో 3.5 లక్షల నగదుతోపాటు కేజీ 250 గ్రాముల డైమండ్ జ్యూవెలరీ లభ్యం అయిందని వివరించారు.