ఐస్ క్రీమ్స్ కాదు.. యమ క్రీమ్స్ : ఐస్‌క్రీముల్లో విష రసాయనాలు

కామారెడ్డి : ఐస్ క్రీమ్ కనబడగానే.. ఆహా.. ఏమి రుచి అంటూ ఆరగించేస్తున్నారా..? ఇక ఐస్ క్రీమ్ తినడం ఆపండి.. మార్కెట్‌లోకి కల్తీ ఐస్‌క్రీమ్‌లు వచ్చేస్తున్నాయి. ఐస్‌క్రీముల్లో విష రసాయనాలు కలుస్తున్నాయి.
హిమ క్రీములు.. యమ క్రీములుగా మారుతున్నాయి. మొన్నటివరకు కారం, పసుపు, బెల్లం, పాలు మాత్రమే కల్తీ అయ్యాయి. ఇప్పుడు చిన్నా, పెద్దా అమితంగా ఇష్టపడే.. ఐస్ క్రీంను కూడా కల్తీ జాబితాలో చేర్చేశారు. ఆరోగ్యానికి హానికలిగించే రసాయనాలు వాడుతూ ఐస్ క్రీంలు తయారు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో కల్తీ ఐస్ క్రీమ్‌లు తిని ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐస్ క్రీం తయారీ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చిరువ్యాపారులు ఐస్‌క్రీం, కుల్ఫీలను తయారు చేసి విక్రయిస్తుంటారు. అయితే ఈ ఫ్యాక్టరీ యజమానులు ఐస్ క్రీం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. ప్రమాదకరమైన రసాయనాలు వాడుతూ ఐస్‌క్రీములు తయారుచేస్తున్నారు. కల్తీ ఐస్ క్రీమ్‌లు విక్రయిస్తున్న వారిని స్ధానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఐస్ క్రీంను నీటిలో వేస్తే కరగకపోవడం.. చేతిలో పెట్టుకుంటే దద్దులు రావడంతో ఐస్ క్రీం తయారీలో రసాయనాలు వాడుతున్నట్లు గుర్తించారు. వెంటనే ఐస్ క్రీం ఫ్యాక్టరీని మూసివేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. రసాయనాలతో చేసిన ఐస్ క్రీంమ్‌తో ఆరోగ్యం పాడవుతుందని స్థానికులు ఆగ్రహం చేస్తున్నారు. ఇలాంటి ఫ్యాక్టరీలను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.